Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ లో జల విలయం.. 23 మంది మృతి

by Shamantha N |
Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ లో జల విలయం.. 23 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో జల విలయానికి 23 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్ లో 8 మంది చనిపోయారు. ఇరు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల వల్ల పలువురు చనిపోయారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగి పడటంతో కేదార్ నాథ్ కు వెళ్లే మార్గంలో 800 మిం యాత్రికులు చిక్కుకుపోయారు. వారిన రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. చినూక్, MI17 హెలికాప్టర్ల ద్వారా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, టెహ్రీ, చమోలీ, డెహ్రాడూన్, హరిద్వార్ జిల్లాల్లో వరదల వల్ల 15 మంది చనిపోయారు. ఇప్పటివరకు 7,234 మంది యాత్రికులను కేదార్‌నాథ్ మార్గం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒంటరిగా ఉన్న యాత్రికులందరినీ బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన 800 మందికి పైగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.

హిమాచల్ లో 8 మంది చిన్నారులు గల్లంతు

హిమాచల్ లోని కులు, మండి, సిమ్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే, ఈ వరదల్లో 45 మంది ఆచూకీ గల్లంతయ్యింది. వారిని వెతికేందురు సహాయక చర్యలు చేపడుతున్నారు. రాంపూర్ సమేజ్ గ్రామంలో ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులు తప్పిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. హిమాచల్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. కేవలం 36 గంటల్లో మూడు జిల్లాల్లో 103 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 32 వంతెనలు ధ్వంయం అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు బాధితులకు తక్షణ సహాయంగా రూ. 50,000 ప్రకటించారు, గ్యాస్, ఆహారం, నిత్యావసరాలు, అద్దె కోసం వచ్చే మూడు నెలలపాటు నెలకు 5వేల చొప్పున బాధిత కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సిమ్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం.. 225 ట్రాన్స్‌ఫార్మర్లు, 111 నీటి సరఫరా కేంద్రాలు ప్రభావితం అయ్యాయి. మొత్తం 3,612 రూట్లలో 82 బస్సు సర్వీసులు నిలిపివేశారు.

Advertisement

Next Story