నన్ను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్

by Hajipasha |
నన్ను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం నడుమ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను అడ్డుకునేందుకే ఈడీ సమన్లు పంపి వేధిస్తోందని ఆరోపించారు. ఎలాగోలా ఎన్నికల కంటే ముందే తనను అరెస్టు చేసి జైల్లో పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. “గత రెండేళ్లలో మీరు మద్యం పాలసీ స్కాం గురించి చాలాసార్లు విని ఉంటారు. ఈ రెండేళ్లలో బీజేపీకి చెందిన అన్ని దర్యాప్తు సంస్థలు అనేకసార్లు సోదాలు నిర్వహించి చాలా మందిని అరెస్టు చేశాయి. కానీ అవినీతి ఆరోపణలతో ముడిపడిన ఒక్క విషయాన్ని కూడా నిరూపించలేకపోయాయి. ఒక్క పైసా తప్పుడు లెక్కను గుర్తించలేకపోయాయి. నిజంగానే అవినీతి జరిగి ఉంటే కోట్లాది రూపాయలు ఎందుకు దొరకలేదు ? డబ్బంతా గాలికి మాయమైపోయిందా?’’ అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

నిజాయితీయే నా పెద్ద ఆస్తి

‘‘నిజాయితీయే నా పెద్ద ఆస్తి. తప్పుడు ఆరోపణలు చేసి నిరాధార సమన్లు ​​జారీ చేసి నా ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సమన్లు ​​చట్టవిరుద్ధమని నా లాయర్లు చెప్పారు. దీనిపై నేను ఈడీ వాళ్లకు లేఖలు రాశాను. అయినా ఈడీ ఒక్క దానికి కూడా స్పందించలేదు. రెండేళ్లుగా విచారణ జరుగుతుంటే.. సరిగ్గా ఎన్నికలకు ముందే నన్ను విచారణకు ఈడీ ఎందుకు పిలుస్తోంది ? గత రెండేళ్లలో విచారణకు ఎందుకు పిలవలేదు ?’’ అని ఆప్ చీఫ్ అడిగారు. మరోవైపు కేజ్రీవాల్‌కు నాలుగోసారి కూడా సమన్లను జారీ చేసేందుకు ఈడీ సమాయత్తం అవుతోందనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story