కునో నేషనల్ పార్క్‌లో మరో రెండు చిరుత కూనలు మృతి..

by Vinod kumar |
కునో నేషనల్ పార్క్‌లో మరో రెండు చిరుత కూనలు మృతి..
X

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో రెండు చిరుత పిల్లలు చనిపోయాయి. దీంతో గత మూడు రోజుల వ్యవధిలో చనిపోయిన చిరుత పిల్లల సంఖ్య మూడుకు పెరిగింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చిరుతకు ఈ ఏడాది మార్చి 24న నాలుగు పిల్లలు పుట్టగా.. మంగళవారం ఒకటి చనిపోయింది. ఇప్పుడు గురువారం రోజు ఇంకో రెండు చీతా పిల్లలు మృత్యువాతపడ్డాయి. ఇక ఒకే ఒక చిరుత పిల్ల ప్రాణాలతో మిగిలింది. ప్రస్తుతం దాన్ని అటవీ అధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ఈ చీతా ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని తెలిపారు. మొదటి చీతా.. వీక్‌నెస్ కారణంగా చనిపోయిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 6 చీతాలు ప్రాణాలొదిలాయి. ఇవన్నీ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినవే కావడం గమనార్హం.

నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతా "సాశా" మార్చి 27న కిడ్నీ సమస్యతో చనిపోయింది. ఏప్రిల్ 13న ఉదయ్ చీతా చనిపోయింది. మే 9న దక్ష అనే మరో చీతా అనారోగ్యంతో ప్రాణాలొదిలింది. "కునో జాతీయ పార్కు ప్రాంతంలో ఇటీవల రికార్డు స్థాయిలో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలం కావడం వల్ల డీహైడ్రేషన్ కారణంగా చీతాలు చనిపోతుంటాయి. పుట్టుకతోనే వీక్‌గా ఉన్న చీతా పిల్లలు త్వరగా ప్రాణాలు కోల్పోతాయి" అని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాగా, ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story