మిల్లర్లకు పెద్ద పీట..రైతులకు కుచ్చుటోపి : కోదండరెడ్డి ఇంటర్వ్యూ

by Shyam |
మిల్లర్లకు పెద్ద పీట..రైతులకు కుచ్చుటోపి : కోదండరెడ్డి ఇంటర్వ్యూ
X

దిశ, న్యూస్‌ బ్యూరో: ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్ప ఆచరణలో మాత్రం రైతుల సంక్షేమానికి వెలగబెట్టింది ఏమీ లేదు. గత ప్రభుత్వాలు అందించిన దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను రద్దు చేసి, రైతులను ఆకర్షించే తాత్కాలిక ప్రోత్సాహకాలను అట్టహాసంగా ప్రారంభించడం, మధ్యంతరంగా నిలిపివేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటుగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకమన్నట్లు వ్యవహరిస్తుంది. ధ్యానం కొనుగోలు‌పై మిల్లర్ల యాజమాన్యానికి ధాన్యం గ్రేడ్ నిర్ణయించే అధికారం ఇచ్చి రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. రైతు రుణమాఫీపై మీనమేసాలు లెక్కబెడుతుంది. రుణమాఫీ పై తీసుకున్న నిర్ణయం అనాలోచితం మాత్రమే కాదు రైతులకు నిరుపయోగకరంగా ఉంది. ప్రపంచలోనే నెం.1 పథకమని గొప్పలు చెప్పిన రైతు బంధు పథకం ఈరోజు నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం తమ వాట కింద చెల్లించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించడం లేదు. రైతులు బ్యాంక్‌లో తీసుకున్న రుణాలకు పావల వడ్డీకి కూడా ఎగనామం పెట్టి రైతులను మోసం చేస్తూ పబ్బంగడుపుకుంటుందని’’ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎమ్.కోదండరెడ్డి ‘దిశ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇంకా ఆయన మాటల్లో..

ప్రభుత్వానికి మిల్లర్ల మీదే ప్రేమ..

మాటకు వస్తే రైతు బిడ్డను..రైతు ప్రభుత్వం అనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడు లేని విధంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్‌మిల్లర్ల యాజమాన్యానికే పెద్ద పీట వేశారు. వారు రైతుల‌పై అజమాయిషి చేలాయిస్తుంటే ప్రభుత్వాధికారులు చేతులు ముడ్చుకు కూర్చున్నారన్నారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో నిర్ణయించాల్సిన ధాన్యం గ్రేడ్, తేమా శాతాన్ని ఈ సారి ప్రత్యేకంగా మార్కెట్లో కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత మిల్లర్లు ధ్యానం క్వాలిటీ చూసి ధర నిర్ణయించడం కోతలు పెట్టడం జరుగుతుందన్నారు. కానీ, ఇప్పుడు రైతులను మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారన్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ప్రభుత్వం మిల్లర్ల పై కఠినమైన చర్యలు తీసుకోక పోగా, రైతులు తమ గోడు వెల్లబోసుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే జగిత్యాల జిల్లాకు చెందిన రైతులను అరెస్టు చేసింది. ఈ ఘటన చూస్తే ప్రభుత్వానికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

క్షేత్రస్థాయిలో అమలేది..

ఇటీవల నిర్వహించిన ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రైతులను ఆదుకుంటాం, ప్రతి గింజనూ కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో 6,900 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు క్షేత్రస్థాయిలో ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. రైతులు పంటల కోతలు పూర్తిచేసుకుని ధాన్యం మార్కెట్లకు చేరవేస్తున్నప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో మార్కెట్లను ప్రారంభించ‌లేదన్నారు. ప్రస్తుతానికి 5,003 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించి మంగళవారం వరకు ధాన్యం ప్రొక్యూర్‌మెంట్ 18,85,013మెట్రిక్ టన్నులు మాత్రమే జరిగిందని వివరించారు. రబీలో వరి ధాన్యం దిగుబడి వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం 1.12లక్ష మెట్రిక్ టన్నులు మార్కెట్ రానుందన్నారు. ఈ లెక్కన కొనుగోలు చేస్తే ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి కూడా మార్కెట్లలో ధాన్యం కొనుగోలు ప్రక్రయి ముగిసేట్టు లేదన్నారు.

మార్కెట్ నిబంధనలను తుంగలో తొక్కారు..

మార్కెట్లలో రైతులకు కలిపించాల్సిన సౌకర్యాలు గాలికి వదిలేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధర నిర్ణయాల పట్టిక, స్టాక్ బోర్డులు పెట్టి రైతులకు అవగాహన కల్పించాలి. కానీ, అవి ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నరని ఆరోపించారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యానికి రక్షణ లేకుండా పోతుందనీ, రైతు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల అధికారుల‌పై ఉంటుందన్నారు. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి మార్కెట్లలో కనిపించడం లేదన్నారు. టార్ఫాలిన్‌లు లేక రైతులు ప్రైవేటుగా కిరాయి పట్టాలు తెచ్చుకొని ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. సకాలంలో ధ్యానం కొనుగోలు కాకపోవడంతో ప్రభుత్వం పంటకు కలిపించే మద్ధతు ధర కాస్తా పట్టాల కిరాయికే సరిపోతుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్న 18శాతం కూడా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు.

పండ్ల రైతులు నానా అవస్థలు పడుతున్నారు..

బత్తాయి, నిమ్మ, మామిడి రైతులకు మార్కెట్ వ్యవస్థ అందుబాటులో లేక పండించి పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు ఎదుర్కొంటున్నరన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో రైతులు మరింత పంట నష్టపోయారనీ, మిగిలన పంటలను అమ్ముకుందామంటే రవాణ సౌకర్యాలు లేక మార్కెట్‌కు తేస్తే కొనుగోలు చేసేవారు లేక కోత కొచ్చిన పంటలు చేనుమీద కుప్పకూలీ పోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బత్తాయి పంటలు పండుతాయి. నల్లగొండ జిల్లాలో 50వేల ఎకరాల్లో బత్తాయి పండుతుంది. గత ఏడాది మెట్రిక్ టన్నుకు ధర రూ.40వేలు పలుకుతే. ఈ ఏడాది రూ.12వేలకు ధరకు కూడ పలుకడం లేదని తెలిపారు. లాక్‌డౌన్‌తో రవాణ వ్యవస్థ స్థంభించి పోవడంతో కలకత్త, ఢిల్లీ మార్కెట్ మూసివేడం బత్తాయి,మామిడి పంటలకు ధర లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి మార్కెట్లను తెరిపించి రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చి రోజులు గడుస్తున్న మార్కెట్ తెరిపించే ప్రయాత్నం చేయకపోడంతో రైతులు మార్కెట్లలో నిరీక్షిస్తున్నారని చెప్పారు. రైతులు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు.

పంట నష్ట అంచనాలో ప్రభుత్వం విఫలం..

రైతులు వేసిన పంటలు ప్రకృతి వైఫరిత్యాలు కరువు, అకాల వర్షాలు, వడగండ్లు సంభవించినప్పుడు సంబంధిత వ్యవసాయ అధికారులు ఆయా ప్రాంతాల్లోని పంట నష్ట రిపోర్టును సేకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2015 తర్వాత ప్రభుత్వం ప్రకృతి వైఫరిత్యాల వల్ల నష్టపోయిన పంటను అంచన వేయడాన్ని విస్మరించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి 2015 పంట నష్టం అంచనా వేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.798కోట్లు నష్టపోయిన రైతులకు పరిహారం కింద ఇచ్చినట్లు గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ పంటనష్టం అంచనా వేసిన దాఖలాలు లేవన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన వాట కింద చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో రైతులకు పంట బీమా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందాన్నారు. ఈ విషయం‌పై ఇటీవల ఆదిలబాద్ జిల్లాకు చెందిన రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో ఫిటిషన్ కూడా దాఖలు చేశారని తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఖరీఫ్, రబీల రైతు బంధు పూర్తి చేయలేదు 2019-2020 ఏడాది ఖరీఫ్, రబీలకు సంబంధించి పంట పెట్టుబడి డబ్బులు నేటికీ రైతులకు చెల్లించ‌లేదన్నారు. ఖరీఫ్‌లో30 శాతం, రబీలో 50 శాతం మంది రైతులకు రైతు బంధు అందలేదన్నారు. రైతు బంధు పథకం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే పెట్టారన్న విషయం రైతులకు అర్థమైయిందన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఆ నియోజకవర్గానికి మాత్రమే రైతు బంధు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాలో జమ చేయడం ఇతర ప్రాంతాలలో జమ చేయకపోడంతో అసలు బండరం బట్టబయలైందన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల పంట పెట్టుబడి డబ్బులు వేయలేదు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పుడైన డబ్బులు వేస్తారన్న గ్యారెంటీ లేదని తెలిపారు.

రుణమాఫీలో ప్రభుత్వ నిర్ణయం నిరుపయోగం..

టీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రూ.23వేల కోట్ల ఉంటే నాగిరెడ్డి కమిటీ వేసి ఆ రుణాలను రూ.17వేల కోట్లలకు కుదించడం జరిగిందన్నారు. నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పి ఆరు విడతల మాఫీ చేశారన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన డబ్బులు రైతులు బ్యాంకులో తీసుకున్న అసలుకు వడ్డీ కిందికి పోయి అసలు మాత్రం బ్యాంకుల్లో అట్లాగే బాకాయి పడి ఉన్నాయన్నారు. రెండో దఫా అధికారంలో వస్తే ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తానని మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న మాఫీ చేయకపోగా ఏకకాలంలో మాఫీ చేయలేము నాలుగు విడతలుగా మాఫీ చేస్తామంటున్నరన్నారు. దీనితో రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన పంట రుణాల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని రిజర్వ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకొని రెండు విడతలుగా అసలు, వడ్డీ ఆయా ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ చెల్లిస్తున్నయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేవిధంగా రిజర్వ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుని రైతులకు రుణ విముక్తి కల్పించాలని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

tags: Interview, national kisan cell vice president, kodanda reddy, farmers, issues, waiver

Advertisement

Next Story

Most Viewed