స్థాయి తెలుసుకో.. కౌశిక్ రెడ్డిపై ఉత్తమ్ సీరియస్

by Shyam |   ( Updated:2021-07-12 08:19:42.0  )
స్థాయి తెలుసుకో.. కౌశిక్ రెడ్డిపై ఉత్తమ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి పాడి కౌశిక్ రెడ్డిపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ ఖండించారు. బెంగళూర్ జిందాల్ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తమ్ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతోనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడని సూచించారు. కౌశిక్ రెడ్డి తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

టీఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయడం ప్రారంభించాడని అన్నారు. టికెట్‌ ఇచ్చి లీడర్‌ను చేస్తే.. చివరకు పార్టీ నేతలనే విమర్శించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇవి కౌశిక్‌తో టీఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలు అని, అందుకే పార్టీ బహిష్కరించామని స్పష్టం చేశారు. ఎవరైనా నాయకులు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. స్థాయి మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story