వారంలో వేల కోట్లు సంపాదించిన ముఖేశ్ అంబానీ.. ఎలాగంటే ?

by Harish |   ( Updated:2021-09-07 06:35:06.0  )
ambani
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులతో తన సంపదను పెంచుకుంటున్నారు. తాజాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన సంపద ఏకంగా 17 బిలియన్ డాలర్లు(రూ. 1.24 లక్షల కోట్లు) పెరిగింది. ఈ లాభాల్లో దాదాపు సగం కేవలం గత వారం రోజుల్లో వచ్చి చేరాయి. ముఖేష్ అంబానీ దాదాపుగా 51 శాతం వాటాలను కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేర్లు గడిచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో 9 శాతం లాభాలను సాధించాయి. దీంతో ఆయన సంపదకు అదనంగా 8 బిలియన్ డాలర్లు(రూ. 59 వేల కోట్లు) వచ్చి చేరాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఆర్ఐఎల్ షేర్లు ఆల్-టైమ్ గరిష్టాల వద్ద రూ. 2,480ని తాకాయి. అనంతరం చివర్లో 1.55 శాతం పెరిగి రూ. 2,429 వద్ద ముగిశాయి. ఈ పెరుగుదల గత శుక్రవారం పెరిగిన 4 శాతానికి అదనంగా వచ్చినవి. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ ఇండెక్స్ ప్రకారం.. ఆర్ఐఎల్ షేర్ ధరలో సోమవారం లాభాల తర్వాత ముఖేష్ అంబానీ మొత్తం సంపద స్వల్పంగా పెరిగి 94 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన 103 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వారెన్ బఫెట్ తర్వాత ప్రపంచంలోనే 11వ ధనవంతుడిగా ఉన్నారు.

లాభాలకు కారణాలేంటంటే..
ఇటీవల ముఖేష్ అంబానీ సాంప్రదాయ ఇంధనం కంటే చౌకైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై తమ ప్రధాన దృష్టి ఉంటుందన్న ప్రకటన తర్వాత ఆర్ఐఎల్ షేర్లు భారీగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ ఎడాదిలో ఆర్ఐఎల్ షేర్లు ఇంకా 10 శాతం మేర లాభపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనివల్ల ముఖేశ్ అంబానీ అరుదైన 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరనున్నట్టు వారు భావిస్తున్నారు. విశ్లేషకుల ప్రకారం.. సమీప భవిష్యత్తులో టెలికాం అనుబంధ జియో ఇన్ఫోకామ్ సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 138.4 ఉండగా, రానున్న త్రైమాసికాల్లో ఇది రూ. 200 కంటే ఎక్కువగా ఉండనుంది.

అలాగే, సంస్థ పెట్రోకెమికల్స్ వ్యాపారంలో సౌదీ ఆరామ్‌కో లాంటి దిగ్గజ సంస్థ వాటా కొనుగోలుతో ఆర్ఐఎల్ షేర్ల విలువ పెరిగేందుకు దోహదపడనున్నట్టు వివరించారు. ‘ఈ ఏడాది చివరి నాటికి ఆర్ఐఎల్ షేర్ ధర రూ. 2,700కి చేరుకుంటుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ అన్నారు. ఆగష్టు 1 నుంచి ఆర్ఐఎల్ షేర్లు ఏకంగా 18 శాతం పెరిగాయని, ఇది బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సాధించిన 10 శాతం లాభాలతో పోల్చితే దాదాపు రెట్టింపు కావడం విశేషమని సంజీవ్ అభిప్రాయపడ్డారు. అలాగే, తాజాగా రిలయన్స్ రిటైల్ తన సొంత బ్రాండ్ పేరున పండుగ సీజన్‌కు ముందు సాంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో అవంత్ర బ్రాండ్‌ను ప్రారంభిస్తోంది. ఈ కొత్త వ్యాపారాలతో ఆర్ఐఎల్ మరింత ఆదాయం సాధించగలదని నిపుణులు వెల్లడించారు.

Advertisement

Next Story