Theaters: కరోనాతో కళ తప్పిన థియేటర్లు

by Anukaran |   ( Updated:2021-05-26 20:18:47.0  )
Movie theater
X

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్ డౌన్ కు ముందు వారానికి మూడు సినిమా రిలీజులు, నిత్యం ఫ్యాన్స్ కొలాహలంతో థియేటర్లు కళకళలాడాయి. అభిమానులు తమ హీరో సినిమా వస్తుందంటే థియేటర్లను పెళ్లి కూతుళ్లలా ముస్తాబు చేసేవారు. కేరింతలు, ఈలలతో వినోదాన్ని పంచాయి సినిమా హాళ్లు. అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడా సీన్ రివర్స్ అయింది. కొవిడ్ వీర విజృంభణ చేస్తుండటంతో లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమా హాళ్లనే నమ్ముకుని బతికే సిబ్బంది జీవితాలు రోడ్డున పడ్డాయి.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వాచ్ మన్, టికెట్ కౌంటర్, క్యాంటిన్లనే నమ్ముకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

థియేటర్ల మూసివేత

మొదటి విడత లాక్ డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే ఒక్కో రంగం కాస్త గాడిన పడుతోందనుకున్న తరుణంలోనే సెకండ్ వేవ్ వీర విజృంభణ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 550 థియేటర్లు ఉండగా అందులో 400 సింగిల్ స్క్రీన్ సినిమాహాళ్లు, 150 మల్టీఫ్లెక్స్ లు ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ వేవ్ అనంతరం ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సినిమా హాళ్లు క్రమంగా మూతపడ్డాయి.

ప్రభుత్వం సెకండ్ వేవ్ లో భాగంగా లాక్ డౌన్ విధించకముందే సినిమా యూనిట్ పరిస్థితిని అంచానా వేసుకొని రిలీజ్ లను ముందుగానే నిలిపేశాయి. అనంతరం కొన్ని థియేటర్లలో సినిమాలు ఆడినా లాభాలు రాకపోగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాహాళ్లకు అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ రాకపోవడంతో యాజమాన్యానికి నిర్వహణ మరింత భారంగా మారింది. లాభాలు రాకపోవడంతో సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

క్యాంటీన్ల ఆదాయానికి గండి

థియేటర్లలో క్యాంటీన్ నిర్వహించే వారి ఆదాయానికి లాక్ డౌన్ కారణంగా భారీగా గండి పడింది. సినిమా హాళ్లలో క్యాంటీన్లు నిర్వహించే వారికి పీస్ పర్ రేట్ లెక్కన యజమానులు డబ్బు చెల్లించేవారు. ఎంత మొత్తం విక్రయిస్తే అంత శాతం డబ్బు అందించేవారు. థియేటర్లు మూత పడటంతో క్యాంటీన్లనే నమ్ముకున్న వారి పరిస్థితి రోడ్డుపాలైంది. లాక్ డౌన్ కారణంగా ఈ పని కాకుంటే వేరే పని చేసేందుకు కూడా ఆస్కారం లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా పలు థియేటర్లలో క్యాంటీన్లకు టెండర్లు నిర్వహిస్తారు. కొంత నిర్ణీత కాలానికి వేలం నిర్వహిస్తారు. ఆ డబ్బును యజమానులకు చెల్లించాల్సి ఉంది. అలా వేలం ద్వారా యజమానులకు డబ్బులు చెల్లించినవారు కొవిడ్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయారు. థియేటర్లు మూసేయడంతో కొన్నిచోట్ల యజమానులు వేలం డబ్బును వారికి తిరిగి అందించలేదు. దీంతో వారు అప్పులపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో పనిచేసే పలువురు సిబ్బంది కూరగాయలు అమ్ముతూ ఏ పూటకాపూట కాలం వెళ్లదీస్తున్నారు.

క్రమంగా వేతనాల తగ్గింపు

ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ ను యజమానులు చాలా తక్కువ రోజులుంటుందని తొలుత భావించారు. అయితే ఎవరి అంచనాలకు అందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అలా నెలలు గడిచాయి. దీంతో చేసేదేం లేక నష్టాన్ని పూడ్చుకునేందుకు యాజమాన్యాలు సిబ్బంది వేతనాలకు కోతలు విధించాయి. అలా సిబ్బందికి తొలుత 70 శాతం జీతాలు మాత్రమే అందించారు. అనంతరం సమయం గడుస్తున్నాకొద్దీ 60 శాతానికి జీతాన్ని కుదించారు. అదే విధానాన్ని ఇప్పటి వరకు కొనసాగించారు యజమానులు. ఇక ప్రస్తుతమయితే 50 శాతానికి తగ్గించేందుకు యాజమాన్యాలు ప్రణాళికలు చేస్తున్నాయి.

ఇప్పటికే పలుచోట్ల యాజమాన్యాలు దీనిని అమలు చేస్తున్నాయి. కాగా మరికొందరు వారి సిబ్బందిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో ప్రతినెల వారి ఖర్చులకు డబ్బులు అందజేస్తున్నారు. థియేటర్లలో పనిచేసే వారికి చదువు పెద్దగా లేకపోవడంతో ఇతర పని చేసుకునేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. దీంతో చేసేదేంలేక వారు థియేటర్లనే నమ్ముకుంటూ ఇన్ని రోజులు తమ కుటుంబాలను పోషించారు. ప్రస్తుతం కరోనా రక్కసి తమ జీవితాలను నట్టేట ముంచిందని సిబ్బంది తమగోడు వెళ్లబోసుకుంటున్నారు.

గతంలో ఒక వాచ్ మన్ కు రూ.10 వేల నుంచి రూ.12 వేల వేతనం చెల్లించేవారు. అయితే కొవిడ్ అనంతరం రూ.6000 కంటే ఎక్కువ చెల్లించడంలేదు యాజమాన్యాలు. గేట్ కీపర్లు, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది స్థితి కూడా ఇలాగే తయారైంది.

సిబ్బంది ఉద్యోగాలు ఔట్

లాక్ డౌన్ కారణంగా థియేటర్లనే నమ్ముకున్న ఎంతో మంది సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. యాజమాన్యాలు తమ నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగా ఇష్టానుసారంగా ఉద్యోగులను తొలగించింది. సాధారణంగా ఒక సినిమాహాల్ కు సుమారు 15 నుంచి 30 మంది వరకు సిబ్బంది అవసరముంటుంది. వాచ్ మన్, గేట్ కీపర్లు, సెక్యూరిటీ, బౌన్సర్లు, టికెట్ కౌంటర్, క్యాంటీన్, పార్కింగ్, హౌస్ కీపింగ్, ఇతరత్రా సిబ్బంది తప్పనిసరి.

అయితే నష్టాల నుంచి గట్టెక్కేందుకు సగం వరకు సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా తొలగించాయి యాజమాన్యాలు. ఇప్పటికే ప్రభుత్వం థియేటర్లలో ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఆ వ్యవస్థలో ఉన్నవారు మొత్తం ఉపాధికి దూరమైనట్లు యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. కాగా పార్కింగ్ ను పర్యవేక్షించేందుకు ఒక వ్యక్తి అయినా కనీసం అవసరం ఉంటుంది కాబట్టి వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుండటంతో వారిని కూడా యాజమాన్యాలు తొలగించింది, దీంతో జీవనోపాధి కరువై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సినిమాహాళ్లలో పనిచేసే సిబ్బంది.

కొవిడ్ బారిన పడి ఇబ్బందులు

థియేటర్లలో పనిచేసే కొందరు సిబ్బంది ఇప్పటికే ఉద్యోగం కోల్పోతే.. మరికొందరు జాబ్ చేస్తున్నా సగం జీతం మాత్రమే వస్తోంది. దీంతో బతకడమే కష్టంగా మారితే దీనికి తోడు కొవిడ్ వారి జీవితాలను అస్తవ్యస్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వందల్లో సినిమాహాళ్లలో పనిచేసే సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. వారి కుటుంబసభ్యుల్లో కొందరికి సైతం కరోనా సోకడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా థియేటర్ల యజమానులు వారికి కొంత ఆర్థికసాయం, నిత్యావసరాల పంపిణీ వంటివి చేసినా వాటితో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా గతేడాది మొదటి లాక్ డౌన్ లో భాగంగా ప్రసాద్ ఐమాక్స్ లో పనిచేసే సిబ్బంది ఒకరు అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.

మినిమం డిమాండ్ చార్జీలు మాఫీ చేయాలి

సినిమా హాళ్లలో షోలు ఆడినా, షోలు నిర్వహించకున్నా ఒక్కో థియేటర్ కు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు వస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా మినిమం డిమాండ్ పేరిట విద్యుత్ శాఖకు పన్ను చెల్లిస్తున్నాం. లాక్ డౌన్ తో ఇప్పటికే సతమతమవుతున్నాం. సిబ్బందికి వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం స్పందించి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు మినిమం డిమాండ్ చార్జీలను మాఫీ చేయాలి. అలా అయితేనే తమకు కొంత ఉపశమనం లభిస్తుంది. లేదంటే అప్పులపాలయ్యే అవకాశాలున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల లోపు పూర్తయ్యే చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తామన్నారు. అది ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉంది.
-గోవిందరాజు, థియేటర్ సహ యజమాని

ఫ్రీ పార్కింగ్ వల్ల ఉపాధి కోల్పోయాం

థియేటర్లలో ఫ్రీ పార్కింగ్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎవరూ అడగలేదు. ఫ్రీ పార్కింగ్ పేరిట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ వ్యవస్థను నమ్ముకున్న వారంతా ఉపాధిని కోల్పోయారు. ప్రత్యామ్నాయం లేక, వేరే పని తెలియక సినిమా హాళ్లలోనే ఉండి ఏదో ఒక పనిచేసుకుంటున్నాం. ఇప్పిటికైనా ఈ ఫ్రీ పార్కింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి.
– ఎండీ అబ్దుల్ వహిద్, సెక్యూరిటీ సిబ్బంది, హైదరాబాద్

ప్రభుత్వం ఆదుకోవాలి

కరోనా వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. యాజమాన్యాలు అప్పుడప్పుడు ఆర్థికసాయంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. అలా కొన్ని రోజుల వరకు కాలం వెళ్లదీస్తున్నాం. ప్రభుత్వం కూడా తమను ఆర్థికంగా ఆదుకోవాలి. బయట ఏ పనికి వెళ్దామన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూట గడవడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– ప్రశాంత్, గేట్ కీపర్, ఉప్పల్

Advertisement

Next Story