జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత విధించిన మూడీస్

by Harish |
జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత విధించిన మూడీస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను మూడీస్ సవరించింది. గతంలో అంచనా వేసిన 13.7 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నట్టు మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో జీడీపీ అంచనాల్లో కోత విధిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. అయితే, సెకెండ్ వేవ్ ప్రభావం 2020 నాటి ప్రభావం కంటే తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ‘లాక్‌డౌన్ ఆంక్షల వల్ల పునరుద్ధరణ దశలో ఉన్న ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిస్తాయి.

మార్కెట్లతో పాటు వినియోగదారుల సెంటిమెంట్‌ను ఈ పరిస్థితులు దెబ్బతీస్తాయి. అయితే, గతేడాది స్థాయిలో ప్రభావ తీవ్రత ఉంటుందని అనుకోవట్లేదని’ మూడీస్ తన నివేదికలో వెల్లడించింది. అదేవిధంగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 90 శాతానికి పెరుగుతుందని, 2022-23లో ఇది 92 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా, సమీప భవిష్యత్తులో రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశాలను తోసిపుచ్చింది. బదులుగా ఆర్థికవ్యవస్థ, ఆర్థిక రంగాలపై ఒత్తిడి కారణంగా రేటింగ్‌పై ప్రతికూలత ఉంటుందని హెచ్చరించింది.

Advertisement

Next Story