ఇంటెలిజెన్స్ బ్యూరోతో మోడీ భేటీ.. మూడు రోజులు కీలక చర్చలు

by Shamantha N |
pm-modi
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ అంతర్గత భద్రతపై ప్రధాని మోడీ అధ్యక్షతన వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలతో మేధోమధన సదస్సు జరగనున్నది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, దేశంలోని వామపక్ష తీవ్రవాదం, మావోయిస్టు సమస్య, ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోకి చొరబడడం, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ప్రతీ ఏటా ఇలాంటి సదస్సులు జరగడం ఆనవాయితీ అయినా ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సుకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రతినిధులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర పోలీసు సంస్థల ఉన్నతాధికారులు, పారామిలిటరీ బలగాల చీఫ్‌లు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తదితరులు కూడా హాజరుకానున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చేంత వరకూ ఢిల్లీ కేంద్రంగా జరిగే ఈ సమావేశాలు ఆ తర్వాత ఇతర నగరాల్లో నిర్వహిస్తున్నది. గతంలో గువాహటి, చంఢీగఢ్, గుజరాత్‌లోని కచ్, హైదరాబాద్, మధ్యప్రదేశ్‌లోని టేకన్‌పూర్, మహారాష్ట్రలోని పూణె నగరాల్లో జరిగింది. ఇప్పుడు లక్నో వేదికగా జరుగనున్నది.

గతేడాది కరోనా కారణంగా ఆన్‌లైన్ ద్వారా ఈ సదస్సును నిర్వహించి విపత్తుల సమయంలో పోలీసులు పోషించిన పాత్ర, సాధించిన విజయాలు తదితరాలపై చర్చించారు. ఈసారి మాత్రం దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రత, పోలీసు శాఖ ఆధునికీకరణ, రాష్ట్రాలు పోషించాల్సిన పాత్ర తదితరాలపై విస్తృతంగా చర్చ జరగనున్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాల సమాచారం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 250 మంది డీజీపీలు, ఐజీలు హాజరుకానున్నారు.

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతుండడం, ప్రభుత్వ వెబ్‌సైట్లు సైతం హ్యాకింగ్ బారిన పడుతుండడం, వాటి ద్వారా ఆర్థిక నేరాలు చోటుచేసుకోవడం, నివారించడానికి ఇకపైన పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత తదితర అంశాలపై లోతుగా చర్చ జరగనున్నట్లు హోంశాఖ వర్గాల సమాచారం. వివిధ రాష్ట్రాల్లోని సైబర్ సెక్యూరిటీ విభాగాల అనుభవాలు, మెలకువలు తదితరాలను చర్చించి ఉత్తమంగా ఉన్నట్లయితే ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడంపై ప్రస్తావించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed