- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మద్దతు ధర’గురించి మోడీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: పంటకు కనీస మద్దతు ధర ఇకపైనా ఎప్పట్లాగే కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా భరోసానిచ్చారు. నూతన సాగు చట్టాలకు ఒక అవకాశమివ్వాలని, వాటి తీరును పరిశీలించాలని కోరారు. అందుకే రైతులు ఆందోళనలు వీడి ఇంటికెళ్లాలని సూచించారు. వారి ఆందోళనలను చర్చించి పరిష్కరిస్తామని, సభాముఖంగా వారిని చర్చలకు ఆహ్వానిస్తున్నానని అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని రాజ్యసభలో మాట్లాడారు. సాగులో సంస్కరణలపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నదని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలలను తాము అమలు చేస్తున్నామని, అందుకు గర్వపడాలని అన్నారు. మన్మోహన్ సింగ్ చేసిన ఒక వ్యాఖ్యతో ప్రస్తుతం యూటర్న్ తీసుకుంటున్నవారందరూ ఏకీభవిస్తారని తెలుపుతూ ‘1930లో ఏర్పాటు చేసిన మార్కెటింగ్ వ్యవస్థతో రైతులు అధిక ధరలకు తమ పంటను అమ్ముకోవడానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. భారత శక్తిని తెలుసుకునేందుకు ఈ అవరోధాలన్నింటిని తొలిగించాలి. అందుకే కొత్త సంస్కరణలు చేపడుతున్నాం’ అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఉటంకించారు.
మన్మోహన్ సింగ్ కలలను మోడీ సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయంలో సంస్కరణలకు ప్రతి ప్రభుత్వమూ ప్రయత్నించిందని, అందులో సఫలమయ్యాయా? లేదా? అనేది అనవసరమని తెలిపారు. కానీ, ప్రతి ఒక్కరూ సంస్కరణల కోసం తపించారని చెప్పారు. కొన్ని దశాబ్దాలపాటు ఈ సంస్కరణలను పెండింగ్‌లో పెట్టారు. కానీ, నేడు తమ ప్రభుత్వం ఈ సంస్కరణలపై ధైర్యంగా ముందుకెళితే కాంగ్రెస్ నిరసిస్తున్నదని ఆరోపించారు. ప్రగతి అంటేనే కొత్త అంశాలను జోడించుకుంటూ వెళ్లడమని, అందుకే కొత్త చట్టాలకూ అవకాశమివ్వాలని సూచించారు. రైతులు ఆందోళనలు వీడాలని అభ్యర్థించారు.
అతిపెద్ద ప్రజాస్వామ్యం కాదు.. మదర్ ఆఫ్ డెమొక్రసీ
‘మనమంతా విదేశీయుల పదాలకు అలవాటు పడిపోతుంటాం. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమనగానే పొంగిపోతుంటాం. కానీ, మనం యువతకు నేర్పాల్సినది ఇది కాదు. భారత్ ప్రజాస్వామ్యానికే జనని. ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమొక్రసీ. అది వారసత్వంగా లభించిన విలువ’ అని ప్రధాని అన్నారు.
ఆందోళన జీవుల నుంచి దేశాన్ని రక్షించాలి
కొందరు దేశంలో ఎక్కడ నిరసనలు జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతుంటారని ప్రధానమంత్రి అన్నారు. రైతులు, వర్తకులు, ఉద్యోగులు, ఇతరులు ఎవరు రోడ్డెక్కినా వారితో కనిపిస్తుంటారని తెలిపారు. అలాంటి ఆందోళనజీవులను ముందుగా గుర్తించాలని, వారి నుంచి దేశాన్ని రక్షించాలని చెప్పారు. ఎందుకంటే వారు స్వయంగా నిర్భయంగా ఒక నిర్ణయాన్ని తీసుకోలేరని, ఎక్కడ నిరసనలు జరిగినా ఎగదోస్తుంటారని వివరించారు. ఆందోళనజీవులు సొంతకాళ్లపై బతకరని, వారంతా పరాన్నజీవులని విమర్శించారు.
కొత్త ఎఫ్‌డీఐలతో తస్మాత్ జాగ్రత్త
‘దేశం అభివృద్ధి పథాన వెళ్తున్నది. ఈ క్రమంలోనే ఎఫ్‌డీఐ(ఫారీన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్)ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, ఇంతలోనే కొత్త ఎఫ్‌డీఐ నాకు కనిపించింది. ఇది లాభాలనిచ్చే ఎఫ్‌డీఐ కాదు. విదేశీ విధ్వంసకర భావజాలం(ఫారీన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ-ఎఫ్‌డీఐ). ఈ ఎఫ్‌డీఐ నుంచీ మనల్ని మనం రక్షించుకోవాలి’ అని ప్రధానమంత్రి మోడీ సూచించారు.
మద్దతు ధర పోతుందని ఎవరన్నారు?: రాకేశ్ తికాయత్
ప్రధానమంత్రి హామీపై రైతు నేత రాకేశ్ తికాయత్ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మద్దతు ధర పోతుందని ఎవరన్నారని ప్రశ్నించారు. ‘కనీస మద్దతు ధర తీసేస్తున్నారని మేమెప్పుడు అన్నాం. కనీస మద్దతు ధరపై ఒక చట్టాన్ని చేయాలని అడిగాం. మద్దతు ధరపై చట్టాన్ని తెస్తే దేశవ్యాప్తంగా రైతాంగం లబ్దిపొందుతుంది. ప్రస్తుతం కనీసమ మద్దతు ధరపై చట్టమే లేదు. అందుకే వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు’ అని తికాయత్ అన్నారు.