- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా మాటే మా అన్న మాట.. వైరలైన ఎమ్మెల్సీ పల్లా చెల్లెలి ఆడియో
దిశ ప్రతినిధి, వరంగల్/ స్టేషన్‌ఘన్‌పూర్ : వేలేరు మండలంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతోంది. మాట వినని అధికారులను బెదిరింపులకు గురిచేయడమే కాదు ఏకంగా బదిలీ చేయించేస్తున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి శివారు లోక్యాతండాలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలకు స్థానిక జడ్పీటీసీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కజిన్ సిస్టర్ సరితారెడ్డి వత్తాసు పలికారు.
తన మాట వినలేదని ఏకంగా తహసీల్దార్ విజయలక్ష్మిని బదిలీ చేయించినట్లుగా స్పష్టమవుతోంది. ఈ సంఘటనకు ముందు ఆమె తహసీల్దార్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణ తీరు చూస్తుంటే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అండ చూసుకుని మండలం మొత్తాన్ని ఆమె ఏ విధంగా గుప్పింట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో అర్థమవుతోంది. తన మాటే తన అన్న మాట అని.. లోకల్ ఎంపీపీ సమ్మిరెడ్డి చెప్పినట్లు చేయొద్దని తహసీల్దార్‌కు వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా తాను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరినంటూ పదేపదే తహసీల్దార్‌కు గుర్తు చేయడం గమనార్హం. అయితే తహసీల్దార్ విజయలక్ష్మి కూడా సరితారెడ్డికి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. ఈపరిణామమే ఆమె బదిలీకి కారణమైందని రెవెన్యూ అధికారుల ద్వారా తెలుస్తోంది.
జడ్పీటీసీ సరిత, తహసీల్దార్ విజయలక్ష్మి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ కోసం కింద క్లిక్ చేయండి
అసలేం జరిగిందంటే..?
దిశకు దొరికిన ఆధారాలు… విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. నెలన్నర క్రితం మండలంలోని షోడషాపల్లి గ్రామ శివారు లోక్యాతండా పరిధిలో సర్పంచ్ భర్త అనువాద లింగం సాయంతో గొల్లెన రాజు అనే వ్యక్తి సర్వే నెం.310, 312 అసైన్డ్ భూముల నుంచి కొద్దిరోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. రోజూ రాత్రి సమయంలో జేసీబీ సాయంతో ట్రాక్టర్లు, టిప్పర్ల సాయంతో హన్మకొండ ప్రాంతానికి తరలిస్తున్నాడు.
అయితే ఈ విషయాన్ని స్థానికులు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి మే 4న తనిఖీలు నిర్వహించి జేసీబీ వాహనాన్ని సీజ్ చేసింది. మైనింగ్ తవ్వాకాలు చేసినందుకు రూ.25వేలను జరిమానా కట్టాలని, అదేవిధంగా రూ. 75 వేలను ఐసోలేషన్ సహాయార్థం అందజేయాలని తహసీల్దార్ గల్లెల రాజుకు సూచించారు.
తహసీల్దార్‌కు జడ్పీటీసీ సరితా రెడ్డి బెదిరింపులు..!
తహసీల్దార్ విజయలక్ష్మి రూ.లక్ష జరిమానను రాజుకు విధించడంతో జడ్పీటీసీ సరితను ఆశ్రయించాడు. రెవెన్యూ అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటూ జరిమానాను కేవలం రూ.25వేలే కట్టించాలని సూచించారు. ఇదే విషయంపై ఫోన్ చేసిన క్రమంలో జడ్పీటీసీ-తహసీల్దార్ విజయలక్ష్మికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీపీ సమ్మిరెడ్డి చెప్పినట్లుగా మీరు చేస్తున్నారంటూ తహసీల్దార్‌పై మండిపడ్డారు.
ఎంపీపీ ఏమైనా ఎర్రబెల్లి దయాకర్‌రావులా మినిస్టరా… కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావునా అంటూ ఫోన్‌లో శివాలెత్తిపోయారు. జడ్పీటీసీ మాటల తర్వాత తహసీల్దార్ కూడా తాను చేయాల్సిన పనిని చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే రూ.25వేలను చలానా రూపంలో చెల్లించాలని మిగతా రూ.75వేలను మండలకేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రం సహాయార్థం అందజేయాలని రాజుకు తహసీల్దార్ చెప్పారు.
దీంతో రాజు గత నెల 24న రూ.25వేలు చలానా కట్టాడు. అలాగే రూ.75వేలను ఐసోలేషన్ సెంటర్‌కు అందజేస్తున్నట్లుగా స్వదస్తూరితో లేఖను రాసి మొత్తాన్ని తహసీల్దార్‌కు అందజేశాడు. అయితే రాజు అందజేసిన రూ.75వేలు ఐసోలేషన్‌కు ఏవిధంగా ఖర్చు చేశారన్నది కూడా తెలియాల్సి ఉంది.
మాట విననందుకు తహసీల్దార్‌కు బదిలీ బహుమానం..
మట్టి తవ్వకాల అక్రమాలను అడ్డుకుంటూ జరిమానాలు విధించిన తహసీల్దార్ విజయలక్ష్మిపై అనుహ్యంగా వేటు పడింది. ఈనెల 14న బదిలీ అంటూ ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆమె సీటులోకి నూతన తహసీల్దార్‌గా వేముల సమ్మయ్య విధుల్లో చేరడం గమనార్హం. విజయలక్ష్మి బదిలీ వెనుక జడ్పీటీసీ అధికార ప్రయోగం ఉందన్న దానికి ఇది నిదర్శనమని, పక్కాగా ముందే బదిలీకి రంగం చేసినట్లుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేలేరు మండలంలో ఇసుక, మైనింగ్ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తహసీల్దార్ బదిలీ రాజకీయాల్లోనూ చర్చనీయాశంగా మారుతోంది.