తెలుగుకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉందామా?

by Ravi |   ( Updated:2025-04-10 01:15:30.0  )
తెలుగుకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉందామా?
X

తెలుగు భాష మనకో గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. భారతదేశంలో రెండవ అత్యధికంగా మాట్లాడే భాష (హిందీ తర్వాత), ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచిన ప్రధాన భాష (Ethnologue డేటా ప్రకారం) తెలుగు. కానీ మాతృ భాష తెలుగుకు స్వగ్రామంలోనే అన్యాయం జరుగుతుంటే, మౌనంగా ఉండడం పాపమే అవుతుంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో విద్యా సంస్థల యాజమాన్యాలు 'తెలుగు భాషను రెండో భాషగా కూడా బోధించబోమని' ప్రకటించడం, తెలుగును తప్పనిసరి బోధనా భాషగా చేయవద్దంటూ తల్లిదండ్రులు చేపట్టిన ధర్నా మనలో తీవ్ర ఆందోళన కలిగించాలి.

అంతర్జాతీయీకరణ పేరుతో, అంగ్లం, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి భాషల్ని నేర్పించి, మాతృభాషను పక్కనబెట్టడం అభివృద్ధి కాదు – అది భాషా సంహారానికి నాంది అనే విషయం తల్లిదండ్రులు మరవొద్దు.

తెలుగు భాష వద్దా?

హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులకు రెండో భాషగా తెలుగు బోధన అవసరం లేదని చెప్పింది. అంతేగాక ప్రభుత్వం తెలుగును తప్పనిసరిగా భోధించాలంటూ జీవో విడుదల చేస్తే.. తెలుగు భాషను తప్పని సరిగా చేయోద్దు.. తెలుగు బదులు ఇతర భాషలు నేర్చుకునేందుకు వీలు కల్పించాలంటూ విద్యార్థులతో, తల్లిదండ్రులతో ధర్నా సైతం నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయడం ద్వారా పిల్లల భాషాభివృద్ధికి భంగం కలుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ప్రాథ మిక పాఠశాలల్లో 68% స్కూళ్లు తెలుగు మాధ్యమంగా కొనసాగుతున్నప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లో ఆ శాతం 30కి పడిపోయింది. 2001 నుండి మాతృభాషలో ప్రాథమిక విద్య అనే నినాదం కొనసాగుతున్నా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో దీనికి విరుద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపణలు..

మూల భాష తప్పనిసరి కాదా?

తెలంగాణ రాష్ట్రం అధికార భాషగా తెలుగును ప్రకటించినా, అనేక ప్రైవేట్ స్కూల్స్‌లో తెలుగు బోధన అధోగతిలో ఉంది. అన్ని స్థాయిల్లో బోధించాలనే నిబంధనలు ఉన్నా, వాటి అమలు చాలా ప్రాథమిక స్థాయిలోనే జరుగుతోంది. కేంద్ర బోర్డు (CBSE/ICSE) పాఠశాలలు, 'మూల భాష తప్పనిసరి కాదం'టూ కొన్ని మౌలిక నిబంధనలను తప్పుదారి పట్టిస్తున్నాయి. కేంద్ర స్థాయిలో విద్యా విధానాలు, మాతృ భాషల బోధనకు ప్రాధాన్యం ఇవ్వని విధంగా రూపుదిద్దు కోవడం, రాష్ట్ర స్థాయిలోనూ స్పష్టమైన అమలు మెకానిజం లేకపోవడం వల్ల తెలుగుకు చీకటి కోణం ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అధికార భాషపై మాట్లాడినా, ఆమోదించిన విద్యా సంస్థలపై నియంత్రణ లేదంటే, చర్యలు కనిపించడం లేదు. పిల్లలు తమ ప్రాంతీయ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే స్పష్టమైన ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భారత రాజ్యాంగంలోని 21A (బేసిక్ ఎడ్యుకేషన్ హక్కు) ప్రకారం, పిల్లలకు వారి భాషలో విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. UNESCO కూడా మాతృభాషలో ప్రాథమిక విద్య ఇచ్చినపుడే మానవ మేధస్సు పూర్తిగా వికసిస్తుంది అని స్పష్టంగా పేర్కొంది. మాతృభాషను నేర్చుకునే హక్కు ఎవరిచ్చినది కాదు, పొందినది కాదు. అది జన్మసిద్ధమైన హక్కు..

తెలుగు భాషపై గౌరవం చూపాలి!

ప్రాథమిక విద్యను తెలుగులో అందించాలి. మాతృ భాషను బోధించకపోవడం అనేది ఆ పిల్లల మేధస్సు అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. ఇది నైతికంగా తప్పు, న్యాయపరంగా అపరాధం. పిల్లలు మొదట తమ మాతృభాషలో బోధన పొందితే అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, సైన్స్ పాఠ్యపుస్తకాలు తెలుగులో అందుబాటులో ఉండాలి. తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలి (ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోనూ, తెలుగు భాషా అకాడమీని బలోపేతం చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు తప్పనిసరి చేయాలి. తెలుగు రచయితలకు, కవులకు పురస్కారాలు, గౌరవాలు ఇవ్వాలి. తెలుగులో వెబ్‌సైట్లు, యాప్‌లు అభివృద్ధి చేయాలి. తెలుగు కోసం స్పెల్ చెకర్స్, OCR, టెక్స్ట్-టు-స్పీచ్ టూల్స్ అభివృద్ధి చేయాలి. ప్రతి యువతీ యువకుడు రోజూ కనీసం ఒకసారి తెలుగులో రాయడం, మాట్లాడడం సాధన చేయాలి. ఇంట్లో చిన్నారులతో తెలుగు మాట్లాడడం అలవాటు చేయాలి. పిల్లలకు తెలుగు కథలు చెప్పడం, పాఠాలు చదవడం ప్రోత్సహించాలి. తమిళులు, మళయాళీలు, బెంగాలీలు తమ భాషపై చూపించే గౌరవం మనం కూడా చూపాలి. తెలుగు మాట్లా డటం వెరవకుండా, గర్వంగా, నిగర్విగా ఉండాలి.

ఈ ధర్నా మనందరికీ మేల్కొలుపు!

తెలుగు భాషను చిన్నచూపు చూడటం అంటే మన అనువంశిక వారసత్వాన్ని తాకట్టు పెట్టడమే. కొంతమంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ నేర్పించాలి, ప్రపంచ మార్కెట్లో ఆ స్థాయిలో ఉండాలంటే తెలుగు అడ్డంకి అవుతుంది అనే అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇది అపోహ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానవేత్తలు మాతృభాషలో విద్యనభ్యసించి, ఆపై ఇతర భాషల్లో ప్రావీణ్యం సాధించినవారే! రష్యా, చైనా, జపాన్, యూరప్‌లో ఇంగ్లండ్ తప్ప మిగతా దేశాల వారు శాస్త్ర సాంకేతిక రంగాలతో సహా అన్నీ తమ మాతృభాషల్లోనే బోధిస్తున్నారని మర్చిపోవద్దు. పిల్లల భవిష్యత్తు, సంస్కృతి, మాన వ విలువల పరిరక్షణ కోసం తెలుగు భాష బోధన తప్పనిసరి. విద్యా సంస్థలు తెలుగును పూర్తిగా తీసివేస్తున్న ఈ సందర్భం మనందరికీ మేల్కొలుపు. తెలుగు నేర్పించండి అనే డిమాండ్‌ కేవలం భావోద్వేగం కాదు. అది హక్కు. మన భాషపై ఎవరు ఎక్కడ అన్యాయం చేసినా సరే, “తెలుగు వద్దంటే ఊరుకోం” అనే సంకల్పంతో నిలదీయాలి. ప్రభుత్వమే కాక, సమాజం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.

డాక్టర్ బి. కేశవులు ఎం.డి.సైకియాట్రీ

చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం

85010 61659



Next Story

Most Viewed