ఇప్పుడే రాజీనామా చేస్తా..లోకేశ్ పోటీకి సిద్ధమా?

by srinivas |   ( Updated:2021-10-23 05:03:27.0  )
ఇప్పుడే రాజీనామా చేస్తా..లోకేశ్ పోటీకి సిద్ధమా?
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అసమ్మతి నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మాజీమంత్రి పరిటాల సునీతకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తానని చంద్రబాబు దీక్షలో మాజీమంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకని ఇప్పుడే రాజీనామా చేస్తానని వంశీ తెలిపారు.

ఈ సందర్భంగా ఖాళీ లెటర్ హెడ్‌పై ఎమ్మెల్యే వంశీమోహన్ తన సంతకం పెట్టారు. ఈ లెటర్‌ అందుకుని మాజీమంత్రి పరిటాల సునీత స్పీకర్‌కు అందజేయాలన్నారు. తాను రాజీనామా చేస్తే స్పీకర్ ఫార్మెట్‌లో చేయలేదని టీడీపీ నేతలు రాద్ధాంతం చేసే అవకాశం ఉందని కాబట్టి మాజీమంత్రి పరిటాల సునీతయే రాజీనామా చేస్తున్నట్లు రాసి స్పీకర్‌కు అందజేయాలన్నారు. పరిటాల సునీత అంటే తనకు వదినలాంటిదని ఆమె అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. తల్లికి కొడుక్కి మధ్య చంద్రబాబు తగాదాలు సృష్టించే వ్యక్తి అని విమర్శించారు. గన్నవరంలో ఇప్పటికిప్పుడు పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తనపై పోటీ చేసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు, లోకేశ్‌కు ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ గత ఎన్నికల్లో ఓడిపోయాడని ఇప్పుడు తనపై పోటీ చేసి గెలిచే అవకాశం వచ్చిందని ఉపయోగించుకోవాలంటూ సవాల్ విసిరారు.

గన్నవరం వచ్చి పరిటాల సునీత టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. లోకేశ్ బరిలో ఉంటే మాజీమంత్రి పరిటాల సునీత ఆయనకు శ్రీకృష్ణ సారథ్యం, శల్య సారథ్యం వహిస్తారో చూస్తానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఇకపోతే ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షలో శుక్రవారం పాల్గొన్న మాజీమంత్రి పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది మనం..ఎమ్మెల్యేలుగా గెలిచింది వారని విమర్శించారు. చంద్రబాబు కాళ్లదగ్గర పడి ఉండాల్సిన వ్యక్తులు..తండ్రిలా గౌరవించాల్సిన వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఇప్పుడు చేస్తున్న విమర్శలు దురదృష్టకరమన్నారు. వీరు చేస్తున్న విమర్శలకు తమకు బీపీ కూడా వస్తుందని వచ్చే ఎన్నికల్లో వీరిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed