పార్టీలకతీతంగా నాతో నడవండి.. అలా దుబ్బాకను మార్చుకుందాం!

by Shyam |
పార్టీలకతీతంగా నాతో నడవండి.. అలా దుబ్బాకను మార్చుకుందాం!
X

దిశ, దుబ్బాక : తన నియోజకవర్గమైన దుబ్బాకను సిద్ధిపేట, గజ్వేల్ తీరుగా మారుస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గుడికందుల గ్రామానికి 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్ల కిందట 30 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసి ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం బాధాకరం అని అన్నారు.

మూడేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేయని పనులను తాను మూడు నెలల్లో చేసి చూపిస్తానన్నారు.అంతేకాకుండా రజక సంఘానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామస్తులు సహకరిస్తే గుడికందుల గ్రామానికి అవసరమున్న నిధులు మంజూరు చేసి సిద్దిపేట, గజ్వేల్ తరహా దుబ్బాకలోని గ్రామాలను అభివృద్ధి చేస్తామని వివరించారు. పార్టీలను పక్కన పెట్టి యువకులు అందరూ అభివృద్ధి కోసం తనతో కలిసి నడవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లయ్య, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story