మహిళా నేతను బూతులు తిడుతూ.. చంపేస్తా అంటూ.. TRS ఎమ్మెల్యే వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-09-05 06:27:23.0  )
మహిళా నేతను బూతులు తిడుతూ.. చంపేస్తా అంటూ.. TRS ఎమ్మెల్యే వార్నింగ్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ పలు వివాదాలను ఎదుర్కొన్న ఆయన.. తాజాగా సొంత పార్టీ నాయకురాలిని బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన తోడె పద్మారెడ్డి మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేయటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తుండగా.. వారి కుటుంబానికి భద్రత కూడా కల్పిస్తున్నారు..!

బెల్లంపల్లి పట్టణంలో అక్రమ కట్టడాల విషయంలో టీఆర్ఎస్ నాయకురాలు పద్మారెడ్డి కుమారుడు వంశీ కృష్ణారెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వంశీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించటంతో పాటు తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది.

తమ కుటుంబానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని.. పోలీసులు రక్షణ కల్పించి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో పాటు వారికి రక్షణ కూడా కల్పించారు. ఈ విషయమై మంచిర్యాల ఏసీసీ మహాజన్‌ను ‘దిశ ప్రతినిధి’ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని.. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. వారి ఇంటి వద్ద పోలీసు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారన్నారు.

2014లో తొలిసారి టీఆర్ఎస్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గం చిన్నయ్య.. 2018లో రెండో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సాధారణంగా మారింది. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.

తాండూరులో ఓ మహిళ భూమిని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి ఆక్రమించేందుకు యత్నించారని, ఇందులో ఎమ్మెల్యే చిన్నయ్య అండ ఉందని ఆరోపిస్తూ.. బెల్లంపల్లిలో మంత్రి హరీష్ రావు హాజరైన సభలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. నెన్నెల మండలంలో ఆయన అనుచరుల భూ కబ్జాలపై ఫిర్యాదులు చేసిన వారిని కేసుల పేరిటా వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

నెన్నెల మండలంలో కొందరు ఆక్రమించిన భూములకు ఏసీడీపీ నిధులతో రోడ్లు వేయటం విమర్శలకు దారి తీసింది. అదే మండలంలో ప్రాణహిత, చేవేళ్ల ప్రధాన కాలువ పనుల కాంట్రాక్టరుతో వివాదం ఏర్పడగా.. చివరికి విషయం అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వద్దకు చేరింది. ఇరిగేషన్ శాఖ డీఈతో బిల్లుల విషయంలో వివాదం ఏర్పడగా.. తర్వాత రాజీ కుదరటంతో సమస్య సద్దుమణిగింది.

అయితే.. తాజాగా సొంత పార్టీ నాయకురాలిని బెదిరించిన విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మరోసారి విచారణ మొదలైంది. ఇది ఎటువైపు దారి తీస్తుందో.. ఎక్కడి వరకు వెళ్తుందో.. పార్టీ అధినాయకత్వం పట్టించుకుంటుందో.. లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story