శరవేగంగా అభివృద్ధి పనులు: మంత్రి తలసాని

by Shyam |
శరవేగంగా అభివృద్ధి పనులు: మంత్రి తలసాని
X

దిశ, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.30 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సిటీలో చేపడుతున్న ఫ్లైఓవర్ లు, స్కై‌వేలు, బీటీ రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఇతర అధికారులతో కలిసి మంత్రి తలసాని బుధవారం పర్యవేక్షించారు.

ముందుగా నెక్లెస్ రోడ్డులో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ. 26 కోట్లతో 6 కి. మీటర్లు చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను పరిశీలించారు. రోజూ రద్దీగా ఉండే ఈ రోడ్డు ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిందన్నారు. ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్న కారణంగా తిరిగి చేపడుతున్నామని అన్నారు. నూతనంగా చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సిటీ లైట్ హోటల్, రాణిగంజ్, బైబిల్ హౌస్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సివరేజ్ వాటర్ ఓవర్ ప్లో సమస్య పరిష్కారానికి సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ వద్ద రూ. 25 లక్షలతో 250 మీటర్ల మేర డ్రైనేజీ పైప్ లైన్ పనులు చేపట్టామన్నారు.

కవాడిగూడ ప్రాగా టూల్స్ వద్ద సివరేజ్ లైన్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,ఎప్పుడు రద్దీగా ఉండే ముషీరాబాద్ – కవాడీగూడ రోడ్డులో భోలక్ పూర్, కవాడిగూడ, ప్రాంతాలలో సివరేజ్ ఓవర్ ప్లో సమస్య పరిష్కారానికి, వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యల పరిష్కారానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ చొరవతో సుమారు రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో 900 ఎంఎం డయా పైప్ లైన్ ను 550 మీటర్ల మేర నిర్మిస్తున్నట్లు తెలిపారు. పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక వైపు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారనీ, మరో వైపు అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వివరించారు. ఆయన వెంట జీహెచ్ ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండీఏ సీఈ
బీఎల్ఎన్ రెడ్డి, డీఎంసీ ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎస్ఈ అనిల్ రాజ్ ఉన్నారు.

Tags: Minister talasani, develpment works, inspection, with mlas, officers, roads, lockdown

Advertisement

Next Story

Most Viewed