ఎంతకైనా తెగిస్తాం.. ఎత్తుకు పైఎత్తులు వేస్తాం

by srinivas |
Minister Srinivas Gowd
X

దిశ,తెలంగాణ బ్యూరో : పాలమూరు జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలను ఎడారి చేస్తామంటే ఊరుకోబోమని.. ఎంతకైనా తెగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపి వేయాలని, మొండిగా వ్యవహరిస్తే బీచ్ పల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడ్తామని హెచ్చరించారు. సోమవారం తెలంగాణశాసనసభా పక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని, అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం జల దోపిడీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఏపీ జల దోపిడీకి విరుగుడుగా కేసీఆర్ పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. తెలుగు గంగకు మానవతా దృక్పథంతో మంచి నీళ్ల కోసం సహకరిస్తే అది జల దోపిడీగా మారిందని మండిపడ్డారు. నాడు వైఎస్ఆర్10వేల క్యూసెక్కులు తీసుకెళ్లారని, అది 40వేల క్యూసెక్కులకు చేరిందని, ఇప్పుడు 80వేల క్యూసెక్కులకు చేరిందని తెలిపారు.

పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని అంతకంతకు పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ జిల్లా నుంచి 14లక్షల మంది వలస పోయారన్నారు. వలసల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. అయితే ఏపీ జల దోపిడీతో వెనకబడ్డ పాలమూరు జిల్లా ఎడారి కావాలా ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్ ఏం కావాలి ? అని ప్రశ్నించారు. తమ ప్రాజెక్టులు నిబంధనల ప్రకారమే నిర్మాణం అవుతున్నాయని ఏపీ మంత్రి చెప్పడంలో నిజం లేదని, కొత్తగా నీటి కేటాయింపులు జరగనంత వరకు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని మొదలు పెట్టమని ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రికి అపెక్స్ కౌన్సిల్ లో హామీ ఇచ్చింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. ఆ హామీని తుంగలో తొక్కి మోసం చేస్తోంది జగన్ కాదా ? అన్నారు.

స్నేహ హస్తం అంటూనే వెకిలి చేష్టలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నోట్లో చక్కర… కడుపులో కత్తెర అన్నట్టు ఉంది ఏపీ ప్రభుత్వం తీరు అని అన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.. రాష్ట్రం విడిపోయాక కూడా జల దోపిడీతో ఇబ్బంది పెడతారా ?.. గ్రీన్ ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్‌లంటే కూడా ఏపీకి లెక్కలేదా ? అన్నారు. నీళ్ల తరలింపుపై టెలీ మెట్రీలు పెడతామంటే సాకులు చెబుతూ ఏపీ ప్రభుత్వం దాట వేస్తోందని ధ్వజమెత్తారు.

సామరస్యంతో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నట్టే ఏపీతో కృష్ణా జలాలపై అవగాహన ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ ను పిలిచామని, అయినా ఆయన సామరస్యంతో మసలు కోవడం లేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేసినట్టే మేము చేస్తే ఒక్క నీటి చుక్క కూడా ఆంధ్రకు వెళ్లదని పరోక్షంగా హెచ్చరించారు.

మేము పైన ఉన్నాం.. ప్రాజెక్టులు ఎన్నయినా కట్టుకోవచ్చు.. కానీ ఆలా చేయడం లేదని, జగన్ ను కేసీఆర్ తమ్ముడిలా భావించి స్నేహ హస్తం అందించినా సరిగా స్పందించలేదన్నారు. కేసీఆర్ మంచికి మంచి… చెడుకు చెడ్డవారని, ఇప్పటికైనా సయోధ్యకు ప్రయత్నించండి అని సూచించారు. అనుమతులు వచ్చేదాకా ప్రాజెక్టులు ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మరో సారి విజ్ఞప్తి చేశారు. కొత్త ట్రిబ్యునల్ వేస్తామన్న కేంద్రం హామీ మేరకే సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరించుకున్నామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వాటిని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed