కాంగ్రెస్సోళ్లు అప్పుడేం చేశారు: కేటీఆర్

by Shyam |   ( Updated:2020-06-10 04:26:50.0  )
కాంగ్రెస్సోళ్లు అప్పుడేం చేశారు: కేటీఆర్
X

దిశ, కరీంనగర్: జలదీక్ష చేస్తామంటున్న కాంగ్రెస్ నేతల తీరు కుందేళ్లను చంపిన నక్కలు సంతాప సభ పెట్టినట్టుగా తయారైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు నింపడం లేదని ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు 60ఏళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామానికి రంగనాయక్ సాగర్ ద్వారా కాళేశ్వరం నీళ్లు చేరుకున్న సందర్భంగా జలహారతి కార్యక్రమంతో పాటు అభివృద్ది కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోదావరి జలాలు మెట్టప్రాంతమైన బదనకల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దూకుతున్నాయని, యాభై ఏళ్లలో ఎన్నడు చూడని అద్భుత దృశ్యం సాక్షాత్కరించిందన్నారు. అన్నమే తెలియదని వెక్కిరించిన వాళ్ల చెంపపై కొట్టేలా దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, వానాకాలంలో కూడా ఎండిపోయే తంగళ్లపల్లి చెరువులో 365రోజులు జలాలే ఉంటాయని కేటీఆర్ అన్నారు. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, దేశంలో ఇదే అత్యుత్తమ రికార్డని ఆయన తెలిపారు. ఈ విషయంపై ముస్సోరీలో ఐఎఎస్ అధికారులకు పాఠాలుగా బోధిస్తున్నారంటే సిరిసిల్లకు ఎంతటి ప్రాధాన్యత కల్గిందో అర్థం చేసుకోవచ్చన్నారు.

సిరిసిల్ల జిల్లాలోని 666 చెరువులు కూడా ఇదే పద్దతిలో నింపనున్నామని, కరెంటుపై ఆధారపడకుండా ఏటా రెండు పంటలు పండించి చూపిస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ అనుకోలేదని, సముద్రానికి 89మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల పైన కొండపోచమ్మకు గోదావరి జలాలను సీఎం తీసుకువచ్చి చరిత్ర సృష్టించారన్నారు. గంగను భగీరథుడు ఆనాడు శివుని నెత్తి నుంచి భూమి మీదకు తెస్తే, అపర భగీరథుడు కేసీఆర్ దిగువ ప్రాంతం నుండి ఎగువ ప్రాంతానికి నీటిని తీసుకొస్తున్నారన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులతో రాష్ట్రంలో జలవిప్లవం రాబోతోందని, 1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తీసుకరానున్నామన్నారు. బంగారం పండే సారవంతమైన నేలలు ఇక్కడ ఉన్నాయి. నీళ్లు కూడా వస్తే రైతుల బతుకులు బాగవుతాయని, చెరువు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణలోని 46వేల చెరువులు ఇదే తీరులో నింపితే ఇక సమస్యే ఉండదని, చేపలు, రొయ్యల పెంపకం రూపంలో నీలి విప్లవం మన రాష్ట్రంలో రాబోతోందని, ఇంటింటికి గేదెలు, ఆవులిచ్చి శ్వేత విప్లవం తీసుకవస్తామన్నారు.

Advertisement

Next Story