గురుకుల విద్యార్థుల ప్రతిభ అసామాన్యం : మంత్రి

by Shyam |
గురుకుల విద్యార్థుల ప్రతిభ అసామాన్యం : మంత్రి
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రతిభ దేశంలోనే అసామాన్యమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. 2019 ఏడాదిలో నీట్, ఐఐటీ సీట్ సాధించిన 215 విద్యార్థులకు గౌలిదొడ్డి జూనియర్ కళాశాలలో శుక్రవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గురుకుల విద్యాలయాలు ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడుతూ.. చరిత్రలో సువర్ణ అక్షరాలతో నూతన అధ్యాయం లిఖిస్తున్నారని కొనియాడారు.

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు 135 మంది, ఐఐటీలకు 80 మంది ఎంపిక కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. అందుకు ఆ విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అనంతరం గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ఈ ఏడాది నీట్, ఐఐటీ సాధించిన విద్యార్థులంతా బీడీ కార్మికులు, చిన్నరైతులు, వ్యవసాయ కూలీలు, టీ.అమ్మకం దారులు, కూరగాయలు అమ్మకందారుల, డ్రైవర్ల, సెక్యూరిటీ గార్డుల కుటుంబాలకు చెందినవారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 10 ఎంబీబీఎస్ సీట్లు కూడా సాధించని గురుకులాలు ప్రస్తుతం.. ప్రభుత్వ సహకారం, సీఎం చూపిస్తున్న చొరవతో ఈ ఏడాది మొత్తం 215 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐటీ సీట్లను పొందారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed