కల్నల్ సంతోష్ త్యాగం మరువలేనిది: మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |
కల్నల్ సంతోష్ త్యాగం మరువలేనిది: మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: కల్నల్ సంతోష్ బాబు త్యాగం ఈ జాతి మరువలేనిదని, యావత్ భారతం సంతోష్ వీర మరణానికి సెల్యూట్ చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సంతోష్ బాబు మరణ వార్తను తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి సూర్యాపేటకు చేరుకున్నారు. విద్యానగర్ లోని సంతోష్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితో పాటు గంటకు పైగా కూర్చుని సంతోష్ వీరమరణం గురుంచి, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు జాతి యావత్తు మీ వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కన్న కొడుకును కొల్పోయిన బాధను దిగమింగుకుంటూ దేశం కోసం తమ కుమారుడు ప్రాణాలు ఇచ్చినందుకు గర్వంగా ఉందన్న సంతోష్ తల్లిదండ్రుల మాటలకు జాతి గర్వ పడుతుందన్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులకు ఆమె మాటలు ఎంతో బలాన్ని ఇస్తాయని చెప్పారు.

Advertisement

Next Story