అంతర్రాష్ట్ర జల వివాదాలపై త్వరగా తేల్చండి : మంత్రి హరీశ్ రావు

by Shyam |   ( Updated:2021-11-12 06:38:18.0  )
అంతర్రాష్ట్ర జల వివాదాలపై త్వరగా తేల్చండి : మంత్రి హరీశ్ రావు
X

దిశప్రతినిధి, మెదక్ : అంతర్రాష్ట్ర నది జలాల వివాదంపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మా వాటా మాకు చెందాలన్నదే తమ ఉద్దేశమని, అంతేకానీ ఏనాడూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శేకావత్ పై తాము వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్నదే తమ బాధని చెప్పుకొచ్చారు.

అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ఏదైనా రాష్ట్రం ఫిర్యాదు చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలని, లేదా ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే తాము కేంద్ర సర్కారుకు సెక్షన్ -3 కింద ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా మొదటి ప్రాధాన్యతగా నీటి వాటాపై సీఎం దృష్టి పెట్టారన్నారు. ఇప్పటివరకు తుది నిర్ణయం రాలేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మీరు స్పందించలేక పోవడం వల్లే 13 నెలల తరువాత మేము సుప్రీంకోర్టుకు వెళ్ళామన్నారు. చట్ట ప్రకారమే మీ దగ్గరికి వచ్చామని గుర్తుచేశారు.

అయినా, మీరు ఏడాదిలోగా స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము సుప్రీంకు వెళ్లినా మీరు ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయడంలో అభ్యంతరం ఏమిటని అడిగారు. జలవివాదం ఏడేళ్లుగా మీ వద్ద పెండింగ్‌లో ఉన్నది వాస్తవం కాదా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మా ఆవేదన అంతా కృష్ణా జలాల్లో తమ వాటా తమకు చెందాలన్నదే అని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ఈ వివాదాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదా కొత్త ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలన్నారు. గోదావరి జలాలపై మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అలాగే గోదావరిపై అన్ని ప్రాజెక్టులకు అనుమతిస్తామని వెల్లడించారు.

కేంద్రం పై యుద్ధం మొదలైంది: తుంగతుర్తి ఎమ్మెల్యే

Advertisement

Next Story