- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అజయ్’ మాటే శాసనం
దిశ, ఖమ్మం:
రాజకీయాల్లో అదృష్టం ఎవరిని ఏ తీరుగ వరిస్తుందో ఊహించడం కష్టమే. అప్పటిదాకా అన్నీ తానై నడిపించిన వాడు ఆ తరువాత అక్కరకు రాకుండా పోవచ్చు. అసలు లైమ్‌లైట్‌లో లేనివారికి అందలం ఎక్కే అవకాశం రావచ్చు. దేశ, రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి విశ్లేషిస్తే ఇలాంటి సంఘటనలు అనేకం. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అలా అదృష్టం వరించిన వారిలో ఖమ్మం గులాబీ తోట నుంచి మంత్రిగా ఎన్నికైన పువ్వాడ అజయ్ కుమార్ ఒకరు.
ఖమ్మం జిల్లా రాజకీయ తెరపై మంత్రి అజయ్ ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ఆయన కేంద్ర బిందువుగా మారారు. జిల్లాలో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఆయనే సుప్రీంగా మారారు. అధిష్ఠానం వద్ద నుంచి ఫుల్ సపోర్ట్ ఉండటంతో అజయ్ మాటే శాసనం అన్న రేంజ్‌లో హవా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన స్థానిక, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో వరుసగా విజయదుందుభి మోగించింది. మునిసిపల్ ఎన్నికల్లో అయితే ఐదుచోట్ల క్లీన్‌స్వీప్ చేసింది. ఇటీవల జరిగిన డీసీసీబీ ఎన్నికల్లోనూ పార్టీ మద్దతుదారులే పీఏసీఏస్‌ల్లోని అత్యధిక డైరెక్టర్ స్థానాలను కైవసం చేసుకున్నారు.
ప్రతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం వంటి కీలక నిర్ణయాల్లో అజయ్ తన మార్కు రాజకీయాన్ని చూపుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటన కూడా అజయ్ పలుకుబడికి, ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. డీసీసీబీ ఎన్నికల సమయంలో చైర్మన్ పదవి కోసం ఒకరిద్దరూ నేతలు కేటీఆర్‌ను నేరుగా కలసి తమకు పదవి ఇవ్వాలని విన్నవించారట. ఆ సమయంలో జిల్లాలో ఏం జరిగినా, ఏం జరగాలన్నా అంతా అజయ్ చూసుకుంటాడని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారట. దీంతో విషయం బోధపడిన సదరు ఆశావహులు పదవి కోసం తిరిగి మంత్రి అజయ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట.
మంత్రిగారికి మాట చెప్పకుండా అధిష్ఠానం దాకా వెళ్లే నేతలు ఇప్పుడు జిల్లాలో లేరంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎమ్మెల్యేలది కూడా అదే పరిస్థితి. దీనికంతటికి ప్రధాన కారణం అజయ్‌కుమార్ మంత్రి హోదాలో ఉండటం ఒకటయితే, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఆప్తుడు అనేది రెండో కారణమని పార్టీ శ్రేణులే గుర్తు చేస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతలైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో కలివిడిగా ఉంటూనే తన మార్కు రాజకీయంతో ముందుకు కదులుతున్నారు. పొలిటికల్ టార్గెట్లను రీచ్ అవుతూనే అసంతృప్తులను వెంటనే అణచివేస్తున్నారు. సహజంగానే తుమ్మల వర్గాన్ని పార్టీ పదవులకు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులకు దూరం పెడుతూ జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అంటూ చెప్పుకోవాలి. ఎందుకంటే ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని 10 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తే కేవలం అజయ్ మాత్రమే ఖమ్మం సెగ్మెంట్‌లో విజయం సాధించారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయింది.
ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాలో నిండుకుండలా ఉంది. అందరినీ మెప్పిస్తూ, ఎవరినీ నొప్పించకుండా అజయ్ పార్టీని బాగానే నడిపించగలుగుతున్నారనే సానుకూల అభిప్రాయంలో ప్రస్తుతం అధిష్ఠానం ఉంది. వాస్తవానికి జిల్లాకు ఏకైక మంత్రిగా ఉండటం కూడా అజయ్‌కు బాగా కలసి వచ్చిందనే చెప్పాలి. తుమ్మల ఓటమి, పొంగులేటికి పార్టీ టికెట్ లభించకపోవడం, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతుండటం.. మిగిలిన ఎమ్మెల్యేల్లో చాలామంది కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినవారు కావడంతో పార్టీలోని నిర్ణయాలపై వారి ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది.
వాస్తవానికి ఖమ్మం రాజకీయాల్లో ఎప్పుడూ అసంతృప్తి, అసమ్మతి, వర్గ రాజకీయం వర్ధిల్లుతూ ఉండేది. కానీ ప్రస్తుతం జిల్లా రాజకీయమంతా అజయ్ నామస్మరణతో తరిస్తోందంటే ఆశ్చర్యమేమీ లేదు. తన వర్గ రాజకీయ అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ అనుచరగణాన్ని పెంచుకోవడంలో సఫలమవుతున్నాడని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో నీతులు ఉపదేశాలే కాదు.. ఇంకా చాలా చేయాలి.. అవన్నీ అజయ్‌కు బాగా తెలుసూ అంటూ ఓ ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరుల వద్ద వ్యాఖ్యానించారట. అజయ్ రాజకీయ చాతుర్యానికి ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిదర్శనమని చెప్పుకోవచ్చు.
Tags : Trs, Khammam, Minister Ajay Kumar, KTR