ఉస్సూరుమంటున్న వేళ.. వారికి ఉపాధి

by Shyam |
ఉస్సూరుమంటున్న వేళ.. వారికి ఉపాధి
X

దిశ, రంగారెడ్డి: ఆకలితో నకనకలాడుతున్న వేళ పట్టెడన్నం దొరికితే.. ఆ ఆనందమే వేరు. అట్లనే ఉంది రంగారెడ్డి జిల్లాలోని వలస కూలీల స్థితి. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి అవకాశాల్లేక ఇబ్బందులు పడుతుండడంతో వారిపట్ల కలెక్టర్ కరుణ చూపారు. మరోవైపు జిల్లా పాలనాయంత్రాంగం వీరికి నగదు, ఉచిత బియ్యం పంపిణీ చేయడం, జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తోంది. కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు పాటిస్తూ వారికి తిరిగి ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్లలో పనులు ప్రారంభించేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులు జారీచేశారు.

ఈ నేపథ్యంలో మొయినాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామం, యాచారం మండలం తులేకుర్డ్ గ్రామం, ఇబ్రాహింపట్నం మండలం ఆదిభట్ల, కందుకూరు మండలం రాచలూర్ తోపాటు కొందుర్గ్, కొత్తూరు, నందిగామ, ఫారూఖ్ నగర్, చౌదరిగూడ, కేశంపేట, చేగిరెడ్డి ఘనపూర్, సూతన్ పల్లి, తులకేడు, మహేశ్వరం లలో పనులు ప్రారంభమై వలస కూలీలకు ఉపాధి దొరికింది. వీటితోపాటు, మంచాల, రాచలూర్, కందుకూరు తదితర గ్రామాల్లో స్టోన్ క్రషర్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. తమకు ఉపాధి కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

tags: Rangareddy, Migrant Workers, Start of Works, Crusher, Collector

Next Story

Most Viewed