తెలంగాణ రైతులకు మహేష్ గౌడ్ సారీ చెప్పాలి.. మాజీ మంత్రి డిమాండ్

by Gantepaka Srikanth |
తెలంగాణ రైతులకు మహేష్ గౌడ్ సారీ చెప్పాలి.. మాజీ మంత్రి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతులకు ఆంధ్రా ప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారన్న పీసీసీ అధ్యక్షుడు మహే‌శ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచినట్టేనని పేర్కొన్నారు. రైతులను అరిగోస పెడుతూ మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మహోత్సవాలు నిర్వహిస్తున్నదని.. వాటిని చూస్తుంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఉందని విమర్శించారు. తెలంగాణపై బీఆర్ఎస్‌కు తప్పా ఏ రాజకీయ పార్టీకి ప్రేమ ఉండదని ఇప్పటికే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పాలకుల మన్ననల కోసం ఇంకా పాకులాడడం సిగ్గు చేటని తెలిపారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉన్నామనే సోయి మరిచారని పేర్కొన్నారు. వ్యవసాయ చరిత్ర తెలియని వ్యక్తులు మన పాలకులు కావడం ప్రజల దౌర్భాగ్యమని తెలిపారు. ఆంధ్రాలోని కోస్తా ప్రాంతంలో వరి తప్ప ఏదీ పండించరని.. కానీ, రాష్ట్రంలో వరితోపాటు వాణిజ్య పంటలైన పత్తి, పసుపు, చెరుకు, మిర్చి, మొక్కజొన్న పంటలు పండిస్తారని తెలిపారు. తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed