వలస కూలీలను..అనుమతించని ఆ రాష్ట్ర ఖాకీలు..

by Shyam |
వలస కూలీలను..అనుమతించని ఆ రాష్ట్ర ఖాకీలు..
X

దిశ, నల్లగొండ: అనుమతి పత్రాలు చూపించినా ఆ రాష్ట్ర పోలీసులు వలస కూలీలను తమ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించడం లేదు. వివరాల్లోకెళితే..కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సొంత గ్రామాలకు ప్రయాణమైన వలస కూలీలకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో చుక్కెదురవుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్​పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు అన్ని అనుమతులు చూపిస్తున్న వలస కూలీలను ఏపీకి పంపిస్తున్నా.. గరికపాడు చెక్​పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు వారిని ఆపేస్తున్నారు. ఆదివారం సుమారు 300 మంది కూలీలు వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రా ప్రాంతానికి ప్రయాణమయ్యారు. సంబంధిత తహసీల్దార్, అధికారుల అనుమతి తీసుకొని కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి వస్తే… తీరా ఇక్కడికి వచ్చాక ఏపీలోకి ప్రవేశం నిరాకరిస్తున్నారని కూలీలు వాపోతున్నారు. అయినా సరే కూలీలు అక్కడే గంటలకొద్దీ పడిగాపులు కాస్తు చిన్న పిల్లలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కూలీల ఇబ్బందులు గమనించిన తెలంగాణ పోలీసులు వలస కూలీలకు భోజనం, తాగు నీరు, మజ్జిగ అందిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం స్పందించాలి..

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో వలస కూలీలు ఎక్కడికక్కడ లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరినీ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో వారు ఆనందపడ్డారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుని పయనమయ్యారు. మహబూబ్​నగర్​లోని ఇటుక బట్టీల్లో పని చేసుకునే వలస కార్మికులు తమ స్వస్థలమైన ఏపీలోని ఒంగోలుకు వెళ్లేందుకు తెలంగాణ పోలీసుల వద్ద అనుమతి తీసుకున్నారు. తెలంగాణ పోలీసుల సాయంతో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్​ సరిహద్దు వరకు తమ భార్యాపిల్లలతో చేరుకున్నారు. కానీ, ఏపీ పోలీసులు సరిహద్దు దాటి వారిని లోనికి అనుమతించకపోవడంతో అక్కడే ఉన్నారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక, ఇక్కడ ఉండలేక, సొంత ఊళ్లకు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే తమను అనుమతించాలనీ, స్వస్థలాలకు పంపించాలని వారు వేడుకుంటున్నారు.

Tags: covid 19 effect, lock down, migrant workers, locked, going to native places, permission, police

Advertisement

Next Story