ఎ‌మ్ఐ, రెడ్‌మీ, పోకో ఫోన్‌లకు ఏమైంది?

by Harish |
ఎ‌మ్ఐ, రెడ్‌మీ, పోకో ఫోన్‌లకు ఏమైంది?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్‌ఐ, రెడ్‌మీ, పోకో స్మార్ట్‌ఫోన్‌లపై కంప్లయిట్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ ఫోన్ ఆగిపోతోందని, వాటంతటవే రీబూట్ అవుతున్నాయని ఆయా కంపెనీల కస్టమర్లు ట్విట్టర్ ద్వారా తమ డివైజ్‌లో వస్తున్న ఎర్రర్స్‌ను వివరిస్తున్నారు. డేటా అంతా కోల్పోతున్నామని, ‘ఫైండ్ డివైజ్ క్లోజ్డ్ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ’ అంటూ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోన్లకు ఏమైంది?

దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్‌ఐ, రెడ్‌మీ, పోకో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దీనిపై షియోమీ తాజాగా స్పందించింది. తమ ఫోన్లలో సాంకేతిక లోపం వల్లనే ఫోన్లు రీబూట్ అవుతున్నాయని, డేటా కోల్పోతున్నారని, వీలైనంతా త్వరగా ఇందుకు పరిష్కారం కనిపెడతామని షియోమీ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ఫోన్‌ను అప్‌డేట్ చేస్తున్నప్పుడు వస్తున్న ఎర్రర్ మెస్సేజ్‌లను సరిదిద్దేందుకు ‘స్టేబుల్ సాఫ్ట్‌వేర్‌’ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఆ సంస్థ వెల్లడించింది. వినియోగదారుల ఫిర్యాదులు పరిశీలించిన మీదట.. ఎమ్ఐయూఐ 12(MIUI 12) అప్‌డేట్‌ వల్లే ఈ సమస్య వచ్చిందని, ప్రోగ్రామింగ్ కోడ్‌లో చిన్న అక్షర దోషాల వల్ల, అది మిస్ బిహేవ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మేరకు సమస్యలు ఎదుర్కొంటున్న కస్టమర్లకు షియోమీ కొన్ని సూచనలు చేసింది. వినియోగదారులకు అందించే సేవల్లో రాజీ పడబోమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించింది. ఈ సమస్య బారిన పడకుండా ఉండేందుకు వినియోగదారులు షియోమీ, ఎమ్‌ఐ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయవద్దని సూచించింది.

ప్రధానంగా ఎమ్‌ఐ 10టీ ప్రో, ఎమ్‌ఐ 10, రెడ్‌మీ కె20ప్రో, రెడ్ మీ నోట్9, రెడ్ మీ నోట్ 7 ప్రో, పోకో ఎక్స్ 3 ఫోన్లలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నైజీరియాలోనూ ఈ కంపెనీ ఫోన్లలో ఇలాంటి సమస్యే ఎదురవుతుందని నెటిజన్లు తెలిపారు. కొంతమంది నెటిజన్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ కారణంగా ఇలా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌లో వచ్చిన సమస్యను పరిష్కరించినట్లుగా ఎయిర్ టెల్ గ్లోబల్ సీఐవో హర్మీన్ మెహతా ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Advertisement

Next Story