Robert vadra: మూడో రోజూ విచారణకు రాబర్ట్ వాద్రా.. 6 గంటలు ప్రశ్నించిన ఈడీ

by vinod kumar |
Robert vadra: మూడో రోజూ విచారణకు రాబర్ట్ వాద్రా.. 6 గంటలు ప్రశ్నించిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ (Money laundering) కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) వరుసగా మూడో రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు వాద్రాను అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన సాయంత్రం ఆరు గంటలకు బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో మొత్తంగా 16 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ వాద్రా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. విచారణ నిమిత్తం ఆయనను మళ్లీ పిలుస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే ఈ కేసులో వాద్రాపై ఈడీ త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేయనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పలు ఆస్తులను సైతం అటాచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

విచారణ అనంతరం రాబర్ట్ మీడియాతో మాట్లాడారు. ‘20 ఏళ్ల నాటి కేసులో ఈడీ ఇప్పుడు ఎందుకు విచారణకు పిలుస్తోంది? ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే. ఈ చర్యలను అందుకే ప్రజలు ఏజెన్సీల దుర్వినియోగం అని భావిస్తున్నారు. రాజకీయ లక్ష్యంలో భాగంగా నాపై విచారణ జరిగింది. గతంలోనూ ఈడీకి సహకరించి వేల పేజీలను అందజేశాను. 20ఏళ్ల నాటి ఈ కేసుకు ముగింపు పడాలి’ అని తెలిపారు. కాగా, హర్యానాలో 2008లో జరిగిన భూ కుంభకోణం కేసులో ఈడీ వాద్రాను విచారిస్తున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed