- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సగం ప్రయాణికులకే అవకాశం..
• ప్రయాణ సాధనాల్లో మార్పులు
• ప్రజా రవాణాపై కరోనా ప్రభావం
దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనా మనిషి జీవితంలో వినూత్న మార్పులకు కారణమవుతోంది. ఇప్పటికే మాస్క్‌లు, శానిటైజర్లు నిత్యం జీవితంలో భాగమైపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా వీటి వాడకం తప్పనిసరనే అంచనాలు వెల్లడవుతున్నాయి. కాగా, రానున్న రోజుల్లో ప్రజారవాణా వ్యవస్థను కూడా గాడిలో పెట్టనున్నారు. లాక్‌డౌన్ రోజులకు ఆదాయాన్ని కోల్పోయిన సంస్థలు తదుపరి సర్వీసుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నివారణలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాయి. ఆర్టీసీ, మెట్రో సర్వీసులు సైతం 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సుతు, రైళ్లను నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో భాగంగా భౌతికదూరం తప్పనిసరని తేలిపోయింది. లాక్‌డౌన్ కారణంగా మెట్రో రూ. వంద కోట్లు, ఆర్టీసీ రూ. 120 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్టు అంచనా. అయితే రానున్న రోజుల్లో బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లను ఎలా నడిపాలి ? ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ఏ విధంగా చేర్చాలనే అంశాలను ప్రభుత్వాలు, సంబంధిత విభాగాలు పరిశీలిస్తున్నాయి.
ఆర్టీసీలో ఇలా..
ఆర్టీసీలో 50 శాతం కెపాసిటీతో బస్సులు నడుపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా సీట్లలో మార్కింగ్ చేయనున్నారు. ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరినీ, ఇద్దరు కూర్చునే సీట్లలో ఒకరిని మాత్రమే అనుమతించి కేవలం సీటింగ్‌కే మాత్రమే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. బస్సుల్లో నిల్చొని ప్రయాణించడాన్ని నిషేధించాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాకుండా బస్సులను ప్రతీరోజు శానిటైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బస్సుల్లో టికెట్లు ఇచ్చే పద్ధతికి బదులుగా గ్రౌండ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు.
మెట్రో రైళ్లలో..
మెట్రో సర్వీసులపైనా కరోనా ప్రభావం కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మెట్రోలో నెల రోజులకు పైగా ఆపరేషన్స్ ఆగిపోగా.. ప్రస్తుతం మెట్రో రైళ్లు, స్టేషన్లలో ప్రజలు, ప్రయాణికులకు అవసరమైన చర్యలపై మెట్రో విభాగాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ఇకపై మెట్రో రైళ్లలో ప్రయాణీకులు నిలుచునేందుకు వైట్ మార్కింగ్ సర్కిల్స్ ఏర్పాటు చేయడం కూడా ఒక ఆప్షన్‌గా కనిపిస్తోంది. సాధారణంగా ఒక్కో రైలులో తొమ్మిది వందల మంది వరకు ప్రయాణిస్తుండగా.. అందులో 50 శాతం మందిని అనుమతించడం ద్వారా భౌతిక దూరం పాటించే వీలుంది. అంతేకాక మెట్రో స్టేషన్లలో ప్రవేశించే ప్రతీ ఒక్కరు శానిటైజర్లు ఉపయోగించడం, భౌతిక దూరం పాటించేలా చూడటం ద్వారా మెట్రో ప్రయాణాల్లో కరోనా భయాలను దూరం చేయనున్నారు. కాగా, మెట్రో ఆపరేషన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
లాక్‌డౌన్ రోజుల్లో వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీ, మెట్రోను.. 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడిపితే మరింత నష్టం వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. ఓ వైపు సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తరలించిన ఆర్టీసీనే నష్టాల్లో ఉందని ప్రభుత్వం చెబుతుండగా.. ఇక సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం కోత పెడితే ఆదాయం కంటే.. ఖర్చే ఎక్కువగా వస్తుందని ఆర్టీసీరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సర్వీసుల్లో చేపట్టే మార్పులపై అధికారికంగా ధృవీకరించకపోయినా.. పైన పేర్కొన్న చర్యలను లాక్‌డౌన్ తర్వాత అమలు చేసే ఆస్కారం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నివారణ చర్యలకు అత్యుత్తమ మార్గాలుగా ఇవి మాత్రమే కనిపిస్తున్నా.. ఆర్థికంగా ఆయా రవాణా వ్యవస్థలకు భారంగా పరిణమించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీలు, ఇతర పద్ధతులు ఏమైనా చేపడుతుందా లేదా కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టనుందా తెలియాలంటే వేచిచూడాల్సిందే.