ఔట్‌సోర్సింగ్ ‘ఔట్’.. మా పొట్ట కొట్టొద్దు కేసీఆర్ సారూ..!

by Shyam |   ( Updated:2021-08-02 22:59:42.0  )
meter-reading
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘ఔట్ సోర్సింగ్ అంటే ఎట్లుండాలె. రెండు నెలలో, మూడునెలల కోసమో తీసుకొని పనైపోయింది బాబు అంటే.. పోయేటట్టుంటే.. అది ఔట్ సోర్సింగ్. నాలుగు రోజుల కోసం తీసుకున్నట్లు. సంవత్సరాల తరబడి పనిచేస్తే కూడా ఔట్ సోర్సింగ్ ఏంది, తలకాయ లేనిది. కాంట్రాక్ట్ ఏంది. నేనదే మాట చెప్పినా.. గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు చెప్పిన. కాంట్రాక్ట్ ఎంప్లాయి ఏంది.. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టరాదు. మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా కాంట్రాక్ట్ చేస్తే మీకంటే నంబర్ వన్ మనుషులు దొరుకుతరు. పీడ పోదా ఇగ.’’ బిల్ కలెక్టర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, కార్మికులనుద్దేశించి ప్రగతిభవన్ లో 4 మే 2017లో సీఎం కేసీఆర్ చెప్పిన మాట. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి నేడు కనీసం వారిని పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. స్మార్ట్ మీటర్లతో తమ జీవితాలు రోడ్డున పడేలా ఉందని మీటర్ రీడర్లు ఆవేదన చెందుతున్నారు.

విద్యుత్ లీకేజీలు, కరెంట్ చౌర్యాన్ని నివారించి డిస్కంలను లాభాల బాట పట్టించేందుకు కేంద్రం స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తెస్తోంది. అయితే, ఈ మీటర్లు వస్తే తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందని మీటర్ రీడర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇన్నిరోజులు ఇదే పనిని నమ్ముకుని చాలీ చాలనీ వేతనంతో బతుకీడుస్తున్న తమ పొట్ట కొట్టొద్దని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు మొర పెట్టుకోవాలని నాలుగేళ్లుగా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా, వారికి ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ మాత్రం ఇవ్వడంలేదు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదు. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే మీటర్ రీడర్ల బతుకు అగమ్య గోచరంగా మారనుంది. ఆ వ్యవస్థే కనుమరుగు కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా 1800 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. వారికి ఉండే పని కేవలం నెలలో సగం రోజులే. కొందరికైతే 10 రోజులు మాత్రమే. ఎస్పీడీసీఎల్ పరిధిలో 12 రోజుల్లో బిల్లింగ్ క్లోజ్ చేయాలి. అదే ఎన్పీడీసీఎల్ సంస్థలో టౌన్ పరిధిలో అయితే 15 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 19 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి కనీసం వారికి 3000 బిల్లులు తీయాలని టార్గెట్ పెడతారు. ఒక్క బిల్లు రీడింగ్ తీస్తే వారికి దొరికేది రూపాయిన్నర కమీషన్. కాంట్రాక్టర్ దయతలిస్తే ఒక రీడింగ్ కి రూ.2 చెల్లిస్తారు. 2001లో చంద్రబాబు హయాంలో స్పాట్ బిల్లర్ల వ్యవస్థ ఏర్పడింది. ఆ సమయంలో ఒక రీడింగ్ తీస్తే రూ.75 పైసలు కమీషన్‌గా ఇచ్చేవారు. ఇప్పటికీ 20 ఏండ్లయినా రూపాయిన్నరకు మించి ఇవ్వడంలేదు.

సంప్రదాయ మీటర్ విధానానిని స్వస్తి చెప్పి స్మార్ట్ మీటర్ విధానాన్ని అమలు చేస్తే మొబైల్ రీచార్జి చేసుకున్నట్లు కరెంట్ కోసం కూడా రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల 1800 మంది మీటర్ రీడర్ల భవిష్యత్ అంధకారంలో పడుతుంది. వారికి ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా వ్యవస్థే కనుమరుగవుతుంది. ఇదే పనిని ఏండ్లుగా నమ్ముకుని జీవిస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ పని తప్పా వేరే పని తెలియదని స్పాట్ బిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పనికి వెళ్దామన్నా.. 15 రోజులకు ఎవరూ ఇచ్చే అవకాశం లేకపోవడంతో శాఖలోనే ఏదో ఒక పని చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. బిల్లులు తీయడం అయిపోయాక ఇతర రోజుల్లో లైన్ మెన్లు, లైన్ ఇన్ స్పెక్టర్లు ఏదో ఒక పని చూపిస్తే అది వెళ్లి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రీపెయిడ్ మీటరింగ్ విధానం అమలైతే వీరితో పాటు బిల్ కలెక్టర్లకు కూడా ఉద్వాసన తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఖ్య సుమారు 1000 మంది. బిల్లులు తీసుకునేందుకు ప్రత్యేకంగా వ్యక్తి అవసరం ఉండదు కాబట్టి వారి జీవితాలు కూడా రోడ్డున పడినట్లే. తమకున్న సమస్యలతో పాటు ఈ విషయంపై కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ తీసుకుందామని ప్రయత్నిస్తే నాలుగేళ్లుగా సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని వారు చెబుతున్నారు.

మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా తమ సమస్యలపై వినతి పత్రాలు అందించినా ఇప్పటివరకు పట్టించుకోలేదని మీటర్ రీడర్లు వాపోతున్నారు. ఇక విద్యుత్ శాఖ మంత్రి అయితే ఏకంగా మీటర్ రీడర్లు సంస్థకు చెందిన వ్యక్తులు కాదని, వారితో తమకేం సంబంధం లేదని అన్నారని మీటర్ రీడర్లు ఆవేదన చెందుతున్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సమస్యలు పరిష్కరిస్తారని తెలిసి ఎన్నోసార్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోలేదని స్పాట్ బిల్లర్లు చెబుతున్నారు. ఏండ్లుగా సంస్థలో పనిచేస్తున్నా మీటర్ రీడర్లకు కనీసం ఆరోగ్య భద్రత కూడా కల్పించలేదు. దానికి తోడు ఉన్నతాధికారుల బెదిరింపులు తోడవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.

30 రోజుల పని కల్పించాలి..

ప్రభుత్వం గుర్తింపు కల్పించాలి. ఇప్పుడు మీటర్ రీడర్లకున్న 12 రోజుల పని కాకుండా నెల మొత్తం పని కల్పించాలి. అంతేకాకుండా ఇందుకు తగిన వేతనం ఇప్పించాలి. ఈఎస్ఐ, పీఎఫ్ కూడా ఇవ్వాలి. ఆరోగ్య భద్రతతో అండగా నిలవాలి. ఇప్పటికే చాలీచాలనీ వేతనాలతో బతుకీడుస్తున్నాం. స్మార్ట్ మీటర్లు వస్తే మా జీవితాలు రోడ్డున పడతాయి. నిరుపేదలకు కూడా ఇబ్బందులు తప్పవు. ఈ విధానానికి కేంద్రం స్వస్తి పలకాలి.

-సునీల్ కుమార్, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

స్మార్ట్ మీటర్లు వస్తే చౌర్యం పెరిగిపోతుంది

కేంద్రం ప్రవేశపెడుతున్న స్మార్ట్ మీటర్ల ప్రధాన లక్ష్యం విద్యుత్ లీకేజీలు, చౌర్యాన్ని తగ్గించడం. అయితే, దీనిని ప్రవేశపెట్టినా నష్టాలు తప్పవు. విద్యుత్ చౌర్యం మరింత ఎక్కువవుతుంది. గతంలో నేరుగా విద్యుత్ స్తంభాలకు తీగలు తగిలించినట్లుగా పరిస్థితులు మారుతాయి. నిరుపేదలు ముందే డబ్బులు చెల్లించి వినియోగించడం వీలుపడదు. దీంతో చౌర్యం ఎక్కువవుతుంది. ప్రీపెయిడ్ మీటర్లు వస్తే.. సిబ్బంది కూడా తగ్గిపోతారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావు.

-బాబ్జీ, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ బంజారాహిల్స్ డివిజన్ ప్రెసిడెంట్

Advertisement

Next Story

Most Viewed