విలీనం చేయండి కానీ మాకు ప్రమోషన్లు ఇవ్వండి.. టీఎన్‌జీఓ సంఘం

by Shyam |
tngo
X

దిశ, తెలంగాణ బ్యూరో: హౌసింగ్ కార్పొరేషన్ విలీనం చేసే లోగా అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్​ మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలను ప్రభుత్వం విలీనం చేయడాన్ని ఎన్జీవోల సంఘం స్వాగతిస్తుందన్నారు. ఉద్యోగులంతా తెలంగాణ అభివృద్ధికి మద్ధతిస్తూనే ఉంటారన్నారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగులు గత రెండు సంవత్సరాల నుంచి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. పదోన్నతుల ప్రక్రియ చేపడితే, ఉద్యోగుల ఆత్మస్థైర్యం పెరిగి భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. దీంతో పాటు టీఎన్‌జీవో హైదరాబాద్ నగర శాఖ కార్యాలయానికి వసతి కల్పించాలన్నారు.

సీఎస్​ను కలిసిన టీఎన్జీవోలు..

ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయడం కోసం ఒక శాతం మూల వేతనం ఇవ్వడానికి ఉద్యోగులు, పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని టీఎన్జీఓ నాయకులు సీఎస్‌కు వివరించారు. కావున వెంటనే చర్యలు చేపట్టి ఈ‌హెచ్‌ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, నగర శాఖ అధ్యక్షుడు శ్రీ రామ్, కార్యదర్శి శ్రీకాంత్, హౌసింగ్ బోర్డు ఉద్యోగుల నాయకుడు రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story