‘ఎమ్మెల్యే’ ఫోన్ వచ్చిందంటే..వారికి వణుకే..!

by Shyam |
‘ఎమ్మెల్యే’ ఫోన్ వచ్చిందంటే..వారికి వణుకే..!
X

దిశ, వరంగల్: ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుందంటే చాలు..ఆ నియోజకవర్గంలోని ప్రజలెవరైనా ఆనందపడతారు. కానీ, వాళ్లు మాత్రం వణికిపోతున్నారు. అదేంటీ.. భయపడటమేంటీ.. అనుకుంటున్నారా.. ఆ విషయాలు తెలుసుకోవాలంటే..మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..కరోనా వైరస్ దెబ్బకు మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తయారైంది వ్యాపారుల పరిస్థితి. అసలే లాక్ డౌన్‌తో వ్యాపారాలు సాగక కష్టనష్టాలు ఎదుర్కొంటున్న క్రమంలో ఒకరు ఫోన్ చేసి బియ్యం, నిత్యావసర వస్తువులు కావాలంటూ అడగడం, మరొకరు తమ మనిషిని పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల నుంచి నుంచి వారికి ఫోన్ వచ్చిందంటే గజగజ వణికిపోతున్నారట. బయటకు చెప్పుకుంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయోనని కక్కలేక మింగలేక మిన్నకుంటున్నట్లు సమాచారం. ప్రధానంగా లిక్కర్, బెల్లం, రియల్ ఎస్టేట్, ఐరన్, సిమెంట్, అడ్తి వ్యాపారులు, ఇతర షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు నిత్యం ప్రజా ప్రతినిధుల నుంచి కష్టాలు తప్పడం లేదనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది.

కరోనా తెచ్చిన కష్టం..

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) అనేక వర్గాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. లాక్ డౌన్‌తో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూత‌పడటంతో ఆయా వర్గాలు నష్టాలు చవిచూస్తున్నాయి. ప్రధానంగా పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి బాధలు చూడలేక మానవతావాదులు, దాతలు, దయార్ద్ర హృదయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తోచిన సాయం అందజేస్తున్నారు. వారి స్థాయిని బట్టి కొందరు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తుండగా మరికొందరు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జిల్లాల వారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేదలు, వలస కూలీలను ఆదుకోవడంలో పోటీపడుతున్నారు. సీఎం మన్ననలు పొందాలనే సదుద్దేశ్యంతో రోజూ వారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధుల మధ్య పెరిగిన పోటీ కాస్తా వ్యాపార వర్గాలకు చుక్కలు చూపిస్తున్నట్లు సమాచారం.

కొందరు స్వచ్ఛందంగా సొంత డబ్బులు వెచ్చించి కార్యక్రమం చేస్తుంటే మరికొంతమంది మాత్రం కేవలం వ్యాపారస్తులను టార్గెట్ చేసి తమ సొంత డబ్బా కొట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే లిక్కర్ వ్యాపారస్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లాక్ డౌన్‌తో వైన్స్, బార్లు మూసి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో డబ్బులు ఇవ్వడం అసాధ్యమని వ్యాపారస్తులు చెబుతుండటంతో సదరు ఎమ్మెల్యే తన పలుకుబడి ఉపయోగించి రాత్రి వేళ షాపులు తెరిపించి మద్యం డంప్ చేసుకుని వెసులుబాటు కల్పిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకుని రెట్టింపు రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం‌పై పద్ధతిని అవలంభిస్తున్నట్లు వినిపిస్తోంది. స్థానిక రైస్ మిల్లర్లు, ఇతర బడా వ్యాపారస్తులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నట్లు సమాచారం.

దొంగచాటు వ్యాపారం..!

ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల దెబ్బకు భయపడిన వ్యాపారస్తులు సందట్లో సడే‌మియా అన్నట్లు దొంగచాటుగా వ్యాపారం నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా లిక్కర్ వ్యాపారులు రాత్రివేళ వైన్స్, బార్లు తెరిచి మద్యం డంప్ చేసుకుని బ్లాక్ లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వైన్స్ మూసి ఉండటం బెల్లం వ్యాపారులకు కలిసొచ్చింది. తండాల్లో నాటుసారా కోసం ఇష్టారాజ్యంగా బెల్లం అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా పలువురు వ్యాపారులు గుట్కా, తంబాకు, అంబర్ లాంటి నిషేధిత
వస్తువులను సైతం గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి నేతల సపోర్ట్ ఉండటంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags: merchants, essential commodities supply, MLA’s call, covid 19, effect, lock down

Advertisement

Next Story

Most Viewed