స్మార్ట్ ఇండియన్ కిచెన్స్.. చేతికి పనిచెప్పనక్కర్లేదు

by Anukaran |   ( Updated:2021-09-07 22:17:11.0  )
స్మార్ట్ ఇండియన్ కిచెన్స్.. చేతికి పనిచెప్పనక్కర్లేదు
X

దిశ, ఫీచర్స్: ప్రతి రంగంలో ఆటోమేషన్ పెరిగిపోగా.. ఇండియన్ కిచెన్స్ కూడా స్మార్ట్‌గా రూపొందుతున్నాయి. కొవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార యజమానులకు పరిశుభ్రతపై ప్రాధాన్యత ఏర్పడగా.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ వంటి సాంకేతికతను కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆటోమేటెడ్ పానీపూరీ, కాఫీ, టీ, సోడా మేకింగ్ మెషిన్స్ అందుబాటులోకి రాగా, ఈ ట్రెండ్‌ను గమనించిన కొంతమంది ఆంట్రప్రెన్యూర్లు.. మానవ జోక్యం లేకుండా వివిధ ఆహార పదార్థాలను తయారు చేసే యంత్రాలను రూపొందించారు. ఈ మేరకు భారతీయ వంటశాలలను ఆటోమేట్ చేసే లక్ష్యంతో కుకింగ్ బోట్, జూలియా, దోశమాటిక్, ఎకో ఫ్రైయర్ వంటి కిచెన్ అప్లయెన్సెస్ మార్కెట్లోకి వచ్చాయి. మాస్టర్ లేకుండానే దోశమాటిక్ ఎన్ని రకాల దోశలు వేయగలుగుతుంది? జూలియా ఎన్ని రకాల భారతీయ వంటకాల రుచులు పంచుతుంది? మరి అవి ఎలా చేస్తాయో తెలుసుకుందాం..

భారతీయ ఆహారం చాలా ప్రత్యేకమైనది. ఇతర దేశాల ఆహారాలతో పోల్చుకుంటే ఆటోమేషన్‌కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ క్రమంలోనే మిక్సర్-గ్రైండర్, బ్లెండర్లు, టోస్టర్‌, బేకింగ్ ఓవెన్‌, ఓటీజీ, డిష్‌వాషర్లతో పాటు ఆటోమేటిక్ రోటీ-మేకర్స్ కూడా ఇప్పటికే ఇండియన్ కిచెన్స్‌లోకి వచ్చేశాయి. అంటే ఇప్పటికే మన వంటశాలలు ఆధునిక సాంకేతికతను అనేక రూపాల్లో స్వీకరించాయి. అయితే మనుషుల ప్రమేయం అవసరం లేకుండా టిఫిన్స్ నుంచి భారీ వంటకాల వరకు అన్ని రకాల ఫుడ్స్ చేసే ఆటోమేటెడ్ మెషిన్స్ కూడా అందుబాటులో ఉన్నా.. 2020 వరకు వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. కానీ కొవిడ్ అనంతరం పరిశుభ్రతపై శ్రద్ధ పెరగడంతో, వీటికి డిమాండ్ పెరుగుతోంది.

జూలియా..

బెంగళూరుకు చెందిన ఇంజనీర్స్ రాఘవ్ గుప్తా, రోహిన్ మల్హోత్రాలు కలిసి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ స్టార్ట్-అప్ నిమ్బుల్‌ను స్థాపించి 2016లో ‘జూలియా’ పేరుతో ఓ కుకింగ్ రోబోట్‌ను తయారుచేశారు. ఇది ఆసియన్ కర్రీలు, పాస్తా, నూడిల్స్‌తో పాటు రైస్ ఆధారిత వంటకాలు కూడా చేయగలదు. అంతర్నిర్మిత స్టారర్, థర్మల్ కెమెరాలు, మల్టిపుల్ సెన్సార్లతో రూపొందిన ఈ రోబోట్.. 100 మంది చెఫ్‌ల బృందం ప్రోగ్రామ్ చేసిన దాదాపు 30 భారతీయ వంటకాలను ప్రిపేర్ చేయగలదు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రోబోట్ రుచి ప్రాధాన్యతలకు అనుగుణంగా వంటకాలు చేస్తుందని మేకర్స్ చెప్పారు. అంతేకాదు అలెక్సా లాగానే జెండర్ బయాస్ లేకుండా.. జూలియా వాయిస్ మోడ్‌ను స్త్రీ, పురుష గొంతుతో ఎంచుకునే అవకాశముంది. కొవిడ్ తర్వాత జూలియాకు ఆర్డర్స్ పెరుగుతున్నాయని రాఘవ్ తెలిపాడు.

ముకుంద ఫుడ్స్..

బెంగళూరుకు చెందిన కిచెన్ ఆటోమేషన్ సొల్యూషన్ ప్రొవైడర్ ‘ముకుంద ఫుడ్స్’ ఏడేళ్ల ముందే ఆటోమేటెడ్ ప్రొడక్ట్స్ తయారీ ప్రారంభించింది. అయితే కొవిడ్ పరిణామాల నేపథ్యంలో 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మునుపటి కంటే మూడు రెట్లు ఎక్కువ ఆర్డర్లు పొందుతోంది. ముకుంద ఫుడ్స్ 2014లో దోశమాటిక్‌ను సృష్టించడం ద్వారా వార్తల్లో నిలవగా, ఇది మానవ సహాయం లేకుండా 50 రకాల దోశలను అందిస్తుంది. ఇక ‘షోస్టాపర్ వోకీ’ అనే ఆటోమేటెడ్ పరికరం ఫ్రైడ్ రైస్, కూరలు, స్టార్టర్స్, పోహా, ఉప్మా వంటి ఆహార పదార్థాలతో పాటు వెయ్యి వంటకాలను తయారు చేయగలదు. ఫింగర్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మోము ఫ్రైతో పాటు మరెన్నో స్నాక్స్ ఐటెమ్స్ అందిస్తుంది ‘ఎకో ఫ్రైయర్’. మెనూలో కొత్త వంటలను జోడించే అవకాశం కూడా ఉంది. చైనీస్, నార్త్ ఇండియన్, అమెరికన్, వెరైటీ బిర్యానీలు కూడా అందించే మెషిన్స్ ముకుంద అందిస్తోంది. ఇవన్నీ కూడా పూర్తి ఆటోమేటెడ్ మెషిన్స్ కాగా, ఐవోటీ, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించారు. యూఎస్‌ సహా 27 దేశాల్లో 3వేలకు పైగా దోశ మాటిక్ మెషిన్‌లను విక్రయించారు. వీరి అందించే యంత్రాల ధర రూ. 30వేల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది.

లాభమేంటి..?

కొవిడ్ సమయంలో కూలీల కొరత ఏర్పడగా, కొవిడ్ అనంతరం బయట వ్యక్తులతో వంట చేయించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆటోమేటెడ్ ఫుడ్ అప్లయెన్సెస్ వినియోగం పెరిగింది. ఇంట్లో వృద్ధులకు కూడా ఇవి ఎంతో ఉయోగకరంగా ఉంటాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు 24/7 అందుబాటులో ఉండటం కూడా మరో అడ్వాంటేజ్. అదే బిజినెస్ పరంగా చూస్తే.. లాక్‌డౌన్ ముగియగానే రెస్టారెంట్లకు అవసరమైన మానవశక్తి లేనప్పుడు, వారు ఆటోమేషన్ పరికరాలు ఎంచుకున్నారు. అయితే ఆటోమేషన్‌ను స్వీకరించడం ద్వారా గణనీయంగా ఖర్చు తగ్గి, ఉత్పాదకత మార్జిన్‌ పెరగడంతో చాలామంది ఫుడ్ బిజినెస్ ఓనర్స్ బెస్ట్ ఆప్షన్‌గా భావించారు. భోజన ప్రిపరేషన్ సమయం తగ్గిపోవడం, మాస్టర్స్, చెఫ్స్‌తో పనిలేకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే కొత్త వ్యాపారస్థులను కూడా ఇది ఆకర్షించింది. అంతేకాదు ఒక చెఫ్ నెలకు రూ. 30-50 వేల శాలరీ డిమాండ్ చేస్తాడు. కానీ అతడు ఒక గంటలో 10 కంటే ఎక్కువ వంటలను చేయలేడు. అదే ఈ యంత్రాలను ఒక్కసారి ఇన్‌స్టాలేషన్ చేస్తే గంటలో 30కి పైగా వంటకాలు తయారు చేస్తుంది.

ఉద్యోగాలు కోల్పోయారా..?

మనుషుల స్థానంలో యంత్రాలు రావడంతో ఉద్యోగులు నేరుగా ప్రభావితం అయినప్పటికి, దానిని ఇతర మార్గాల్లో భర్తీ చేయవచ్చు. ఉదాహరణకు ఒక వ్యాపార యజమాని నలుగురికి బదులు ఇద్దరిని నియమించుకున్నపుడు డబ్బు సేవ్ అవుతుంది. అప్పుడు ఆ మనీతో మరో చోట ఔట్‌లెట్‌‌ ఏర్పాటు చేయవచ్చు. అలా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోతే చాలామందికి ఉపాధి కల్పించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed