కరోనా దెబ్బకు బోణీ లేకుండా పోయింది!

by Shyam |
కరోనా దెబ్బకు బోణీ లేకుండా పోయింది!
X

దిశ, న్యూస్ బ్యూరో: మార్చి 21 నుంచి అన్ని మార్కెట్లకు కష్ట కాలమొచ్చింది. జనానికి కరోనా వైరస్ భయం పట్టుకుంది. దాంతో లాక్‌డౌన్ నిబంధనలను సడలించినా స్టోర్లకు పెద్దగా గిరాకీ లేదు. కొందరికైతే బోణీ కూడా కావడం లేదు. స్టోర్లలో కరోనా నియంత్రణ కోసం శానిటైజేషన్, భౌతికదూరం తదితర నిబంధనలన్నీ పాటిస్తుండడంతో నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు స్టోర్ల యజమానులను ‘దిశ’ సంప్రదించగా తమ ఆవేదనను వెలిబుచ్చారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రస్తుతం నిత్యావసర వస్తువులు మినహా మరే ఇతర వస్తువులు కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. డోర్ డెలివరీ అవకాశం ఉన్నా కొనుగోలుకు ఇష్టపడడం లేదు. సగం కూడా అమ్మకాలు సాగడం లేదని యజమానులు వాపోతున్నారు. పైగా లాక్‌డౌన్ దాదాపు రెండు నెలలకు పైగా ఉండడంతో ఫుడ్ ఐటెమ్స్ తయారీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ముడి సరుకు వృథా అయ్యిందని, బయట పారేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రధానంగా బేకరీ, ఐస్ క్రీం, పిజ్జా వంటి తయారీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి.

నో ఫంక్షన్.. నో బ్యూటీ

కరోనా వైరస్‌తో పెళ్లిళ్లు, ఫంక్షన్లు నిలిచిపోయాయి. ఎవరో ఒకరు నిర్వహించినా చడీచప్పుడు లేకుండా 50 నుంచి 100 మందితో కానిచ్చేస్తున్నారు. దాంతో మహిళలెవరూ బ్యూటీ పార్లర్ల వైపు తలెత్తి కూడా చూడడం లేదు. ఈ ఏడాది పెళ్లిళ్లు బాగా ఉంటాయని భావించిన ఓ కూల్ క్యాన్ల తయారీ సంస్థ రూ.2 కోట్ల విలువైన ఉత్పత్తులను సిద్ధం చేసింది. సరిగ్గా ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే సమయానికి లాక్‌డౌన్ పెట్టారు. అంతే ఎక్కడి క్యాన్లు అక్కడే ఉండిపోయాయి. అప్పు తీసుకొచ్చి పెట్టిన రూ.కోటికి వడ్డీలు మాత్రం తప్పడం లేదు. ఇలా ఒకరిద్దరి ఆవేదన కాదు.. వేలాది మంది ఎంటర్ప్రెన్యూర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కరోనాతో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

నిలిచిన వస్త్రోత్పత్తి

వస్త్ర పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. 84 శాతం అమ్మకాలు తగ్గాయని క్లాతింగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సంస్థ తన ప్రతినిధులతో 4 వేల మంది అపెరల్ యజమానులతో మాట్లాడింది. మే నెలలో తీరని నష్టం వాటిల్లిందని గగ్గోలు పెడుతున్నారు. చాలా మంది మాస్కులు, పీపీఈ కిట్ల తయారీలో నిమగ్నమయ్యారు. లాక్‌డౌన్ సడలించినా ఉత్పాదక శక్తి ఊపందుకోలేదు.

ఆశలు అడియాసలు

అమెరికాలో ఓ మహిళ చాలా కాలం మంచి ఉద్యోగం చేసింది. బాగానే సంపాదించింది. అయితే స్వరాష్ట్రంలోనే ఓ ఎంటర్ ప్రెన్యూర్‌గా రాణించాలన్న‌కసితో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసింది. కూకట్ పల్లిలోని ఓ ప్రధాన రహదారిలో శాండ్విచ్ విత్ ఐస్ క్రీం.. వైవిధ్యమైన ఫుడ్ ఐటెం తయారీ, విక్రయ కేంద్రాన్ని నెలకొల్పారు. దానికి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు. నలుగురికి ఉపాధి కల్పించారు. పెట్టి ఓ మూడు నెలలైంది. అంతే.. కరోనా భూతం పట్టేసింది. స్టోర్‌లోని ముడి సరుకులన్నీ పెంటకుప్ప పాలుచేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్ పెట్టిన నాటి నుంచి ఖాళీగా కూర్చుంటూ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న ఆమె ఆకాంక్షకు కరోనా వైరస్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.

రూ.కోట్లు వెచ్చిస్తే తీరని నష్టం

ఓ యువకుడు రూ.2 కోట్లు పెట్టుబడితో ఐస్ క్రీం కంపెనీని నెలకొల్పాడు. 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మూడు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తితో ముడి సరుకులన్నీ వేస్ట్ అయ్యాయి. రూ.లక్షల విలువైన సరుకులు బయట పారేయాల్సి వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను సడలించారన్న సంతోషంతో ఉత్పత్తిని మొదలుపెడితే ఐస్ క్రీంలకు గిరాకీయే లేకుండా పోయింది. దాంతో ఒక్కో రోజు బోణీకి కూడా నోచుకోవడం లేదు. దాంతో ఉద్యోగుల జీతాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదంటూ బాధ పడుతున్నాడు.

నో బ్యూటీ

కూకట్ పల్లి ప్రాంతంలో ఓ పెద్ద బ్యూటీ క్లినిక్కు ఉంది. దాంట్లో పదుల సంఖ్యలో బ్యూటీషియన్లు పని చేస్తున్నారు. మార్చి 21 నుంచి నో బ్యూటీ అని మహిళలు అనేయడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రోజుకు కలెక్షన్ రూ.లక్ష దాకా వచ్చేది. ఇప్పుడు రూ.10 వేలు దాటడం లేదు. రూ.లక్షలు వెచ్చించి క్లినిక్ పెట్టుకుంటే కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందులతో సతమతమవుతున్నామని యజమానురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed