మారుతీ సుజుకి ఆగష్టు అమ్మకాల్లో వృద్ధి

by Harish |
మారుతీ సుజుకి ఆగష్టు అమ్మకాల్లో వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ 2020, ఆగష్టు అమ్మకాల్లో 21.3 శాతం వృద్ధిని సాధించింది. ఆగష్టు నెలకు దేశీయ మార్కెట్లో మొత్తం 1,16,704 యూనిట్లను విక్రయించినట్లు మారుతీ సుజుకి (Maruti Suzuki) మంగళవారం వెల్లడించింది. ఇది 2019 ఆగస్టులో విక్రయించిన 94,728 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమల్లో డిమాండ్ పుంజుకుంది.

2019, ఆగష్టులో 93,173 యూనిట్లతో పోలిస్తే కంపెనీ మొత్తం 1,13,033 యూనిట్లను గత నెలలో ఫ్యాక్టరీ నుంచి డీలర్‌షిప్‌లకు సరఫరా చేసింది. మార్చిలో లాక్‌డౌన్ తర్వాత మారుతీ సుజుకి ఒక నెలలో లక్ష యూనిట్లకు పైగా విక్రయించడం ఇదే మొదటిసారి. మారుతీ సుజుకి ఎక్కువ భాగం మినీ, కాంపాక్ట్ విభాగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2019 ఆగష్టు, 2020 ఆగష్టును పోలిస్తే 26.8 శాతం పెరిగాయి.

ఎస్-ప్రెస్సో (s-presso) మోడల్ గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది గనక 2019, ఆగష్టు గణాంకాలతో పోల్చలేమని కంపెనీ తెలిపింది. వినియోగ వాహనాలైన విటారా బ్రెజా (vitara brezza), కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎస్-క్రాస్ (S-Cross), ఎర్టిగా (Ertiga), ఎక్స్ఎల్6 (XL6) వాహనాల విక్రయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇతర విభాగాల్లో 2019, ఇదే నెలతో పోల్చితే ఆగష్టులో 13.5 శాతం పెరిగింది.

అయితే, మిడ్-సైజ్ సెడాన్ (midsize sedan) విభాగంలో విక్రయాలు తగ్గాయి. హ్యూండాయ్ (Hyundai) నుంచి వెర్నా (Verna), హోండా (Honda) నుంచి ఐదో తరం సిటీ మోడల్ కార్లు ఆగష్టులోనే ప్రారంభమయ్యాయి. అయితే, వీటి పోటీ వల్ల మారుతీ సియజ్ (maruti ciaz) విక్రయాలు ఇంకా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాయి. ఆగష్టులో సియాజ్ మోడల్ కార్లు, 1,223 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి ఎగుమతుల్లో 7,920 యూనిట్లతో 15.3 శాతం క్షీణత నమోదైంది.

ఇక, దేశీయంగా అమ్మకాలు, ఎగుమతులు రెండూ 2019, ఆగష్టు నెలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఆగష్టులో 17.1 శాతం పెరుగుదల ఉన్నట్టు కంపెనీ తెలిపింది. కొవిడ్-19, అనంతర పరిణామాల్లో మారుతీ సుజుకితో పాటు ఇతర కార్ల తయారీదారులకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో సాధారణ స్థితి వెల్లగలమని మారుతీ సుజుకి పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed