రికవరీ సాధిస్తున్న దేశీయ తయారీ రంగం : ఫిక్కీ!

by Harish |
Manufacturing
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌లో దేశీయ తయారీ రంగం రికవరీ సాధిస్తోందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అభిప్రాయపడింది. మార్చితో ముగిసే చివరి త్రైమాసికంలో ఈ రంగం మునుపు కోల్పోయిన వృద్ధి వేగాన్ని తిరిగి పొందగలదని ఫిక్కీ అంచనా వేసింది. తాజాగా నివేదించిన త్రైమాసిక సర్వేలో.. కీలకమైన 12 రంగాల నుంచి వివరాలను సేకరించింది. తయారీలో మొత్తం సామర్థ్య వినియోగం 65 శాతం నుంచి 74 శాతానికి పెరిగింది. అధిక ముడి పదార్థాల ధరలు, అధిక వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు, దేశీయ-విదేశీ డిమాండ్ కొరత, చౌక దిగుమతులు వంటివి ఆయా రంగాల్లో విస్తరణ ప్రణాళికలపై ప్రభావం చూపిస్తున్నాయని ఫిక్కీ తెలిపింది.

ఆటోమోటివ్, కేపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, వైద్య పరికరాల రంగాల్లో సామర్థ్య వినియోగం పెరిగిందని, అయితే, టెక్స్‌టైల్, లెదర్ పరిశ్రమల్లో నెమ్మదిగానే ఉందని పేర్కొంది. అదనపు శ్రామిక శక్తిని నియమించుకోవాలని భావిస్తున్న పరిశ్రమలు 20 శాతం నుంచి 37 శాతానికి పెరిగినట్టు ఫిక్కీ పేర్కొంది. పలు రంగాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం..మెడికల్ డివైజెస్, కెమికల్స్, ఎరువులు, ఫార్మా, టెక్స్‌టైల్ యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్స్, కేపిటల్ గూడ్స్, మెటల్, మెటల్ ఉత్పత్తుల విభాగాలు బలమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఫిక్కీ వెల్లడించింది.

Advertisement

Next Story