కరోనా వారియర్స్‌కు మహీంద్రా బంపర్ ఆఫర్!

by Shyam |
కరోనా వారియర్స్‌కు మహీంద్రా బంపర్ ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలను నిండా ముంచేసింది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే జీరో అమ్మకాలతో ఆదాయంలేక వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు కార్ల తయారీ సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు పెరగడానికి, వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో తమ వినియోగదారులకు, ప్రధానంగా కరోనా వారియర్స్‌కు ఆర్థిక సౌలభ్యం గల ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ పథకాలను తీసుకొచ్చామని కంపెనీ (ఆటోమోటివ్ డివిజన్) సీఈవో వీజయ్ నక్రా ప్రకటించారు. వైద్యులు, పోలీసులు, సరుకు రవాణా వాహనాల యజమానులకు విడివిడిగా కొన్ని, సాధారణ వినియోగదారులకు మరిన్ని రుణ పథకాలను ప్రవేశపెట్టింది.

సాధారణ వినియోగదారులు ఎవరైనా మహీంద్రా ఎస్‌యూవీ కొంటే వచ్చే ఏడాది నుంచి ఈఎమ్ఐ చెల్లించేలా ఆఫర్ ఇచ్చింది. దీంతో పాటు 100 శాతం ఆన్ రోడ్ ఫైనాన్సింగ్ అందిస్తోంది. వాహనం కొనుగోలు చేసే సమయంలో వైద్యులు, పోలీసులు, మహిళలకు ప్రాసెసింగ్ ఫీజులో సగం రాయితీ ఇస్తున్నట్టు మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా వెల్లడించారు. అలాగే, వాహనం కొన్న మూడు నెలల తర్వాత కూడా డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. పోలీసులు, వైద్యులు, మహిళా వినియోగదారులకు ఫైనాన్సింగ్ వ్యయంపై 10 బేసిస్ పాయింట్ తగ్గింపు వుంటుందని కంపెనీ స్పష్టం చేసింది. వాహన కొనుగోలుకు అందించే లోన్ మొత్తంలో ప్రతీ లక్ష రూపాయలకు నెలకు రూ.1,234 చొప్పున ఈఎమ్ఐ చెల్లిస్తే సరిపోతుందని సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సందర్భంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, పోలీసులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లుగా మహీంద్రా అండ్ మహింద్రా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed