క్యాంపు రాజకీయాలు షురూ.. TRS ఎమ్మెల్సీ ఓటర్స్ ఫుల్ హ్యాపీ

by Sridhar Babu |   ( Updated:2021-11-29 22:52:16.0  )
క్యాంపు రాజకీయాలు షురూ.. TRS ఎమ్మెల్సీ ఓటర్స్ ఫుల్ హ్యాపీ
X

దిశ, భద్రాచలం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి జెడ్పీటీసీ, ఎంపీటీసీలను లక్షాధికారులను చేస్తున్నాయనే ప్రచారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకి రూ.3 లక్షలు ముట్టాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి రసవత్తర రాజకీయ పరిణామాలను బట్టి గతంకంటే ఎక్కువే లభిస్తాయని స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇకపై జరిగే ఎన్నికలన్నీ యమకాస్ట్లీఅని హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పటికే రుజువుచేసింది. సరికొత్త పథకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. వార్ వన్‌సైడ్ అని గొప్పలు చెప్పుకునే నోర్లు మూతపడ్డాయి.

Charla-TRS-leaders

దీంతో హుజురాబాద్ ఓటమి భయం టీఆర్‌ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తగినంత బలం లేకపోయినా అధికార పార్టీ అభ్యర్థులను ఢీకొట్టడానికి విపక్ష, స్వతంత్ర అభ్యర్థులు రాష్ట్రంలో పలుచోట్ల బరిలోగి దిగడంతో టీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి ఉమ్మడి ఖమ్మంలో ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీకి దడ పుట్టిస్తోందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పోటీలో నిలవడం వల్లనే ఇలా క్యాంపుకు వెళ్ళే అదృష్టం వచ్చిందనేది టీఆర్ఎస్ ఓటర్ల అభిప్రాయం. ఎన్నిక ఏకగ్రీవమైతే తమను కనీసం అభ్యర్థులు కూడా పట్టించుకోకపోయేవారని అని వారి అభిప్రాయం.

టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు

ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక సరైనదేనా అనే గుసగుసలు గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తనకున్న పరపతి, పలుకుబడి ఉపయోగించి పట్టుబట్టి తాతా మధుకి టికెట్ ఇప్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చివరలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అండదండలు కూడా తోడైనట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న సీనియర్లను కాదని, తాతా మధుకి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో పార్టీ క్యాడర్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయని విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఎమ్మెల్సీతో సహా మంత్రి పదవి ఆశించగా, ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, వద్దిరాజు రవిచంద్ర @గాయత్రి రవి వంటివారు ఖమ్మం ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ డెసిషన్ గులాబీ శ్రేణులకు ఊహించని షాక్‌గానే చెప్పొచ్చు.

టికెట్ చేజారడంతో ఆయా నాయకుల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ చివరిరోజు వరకూ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మార్చి తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని అభిమానులు గులాబీ పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేశారంటే తాతా మధు ఎంపికపై వారిలో ఎంత అసంతృప్తి ఉందో తేటతెల్లమైంది. అయితే, టికెట్ ఆశించి భంగపడిన నాయకులంతా తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారా? లేక పట్టించుకోకుండా ఆత్మప్రభోదంతో ఓటేయాలని అనుచరులకు సలహా ఇచ్చి సైలెంట్‌గా ఉంటారా? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. క్యాడర్‌లో నెలకొన్న ఈ తరహా అంతర్గత అసంతృప్తిని అణిచివేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పైచేయి సాధిస్తుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

క్రాస్ ఓటింగ్ భయం.. క్యాంపులకు పయనం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేంత బలం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ, అభ్యర్థి ఎంపికపై నెలకొన్న అంతర్గత అసంతృప్తి, పార్టీలో గ్రూపు రాజకీయాలు, కాంగ్రెస్ అందించే స్నేహహస్తంతో కొంత కీడు జరగొచ్చనే(క్రాస్ ఓటింగ్) భయంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. అందుకే పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా చేజారకుండా అధినాయకత్వం సూచనలతో ముందుచూపుతో ఓటర్లను (ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను) మండల నాయకులు దగ్గర ఉండి క్యాంపులకు పంపించారు. పదిరోజులు ఓటర్లను కాపలా కాయాల్సిన పరిస్థితి. సొంత బలం పదిలపర్చుకొని విపక్షాల నుంచి ఓట్లు రాబట్టే ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఓటర్లకు ఎరవేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే అధికార పార్టీలో అసమ్మతిని అనుకూలంగా మలచుకొనేందుకు కాంగ్రెస్ అభ్యర్థి అత్యంత రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Advertisement

Next Story