- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదాంత జీవిత వి'శారద'
జీవితమనే దారిలో సమాజ గమనంతో అడుగులు కలుపుతూ అవిశ్రాంతంగా పరుగెత్తి.. ఆదరణకు నోచక.. సాహిత్యాన్ని నమ్ముకొని, 'అమ్ముకొని' చివరి నెత్తుటి బొట్టు వరకు వ్యవస్థ మారాలని, మారుతుందని ఆశించి మూడు పదుల వయసుకే 'అందనంత దూరం' వెళ్లిపోయిన సాహిత్య బాటసారి 'శారద'- ఎస్.నటరాజన్. నటరాజన్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు 'మంచి-చెడు’ శారదంటే సాహితీలోకం టక్కున గుర్తిస్తుంది.
నిద్ర, తిండి లేని రచయిత
1924 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన పుదుక్కోటులో జన్మించాడు నటరాజన్. అతి బీద కుటుంబం. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి భాగీరథి. పన్నెండేళ్ల ప్రాయంలో మద్రాసు నుంచి వచ్చి 'ఆంధ్రా పారిస్' తెనాలి రైల్వేస్టేషన్‌లో అడుగు పెట్టాడు. తల్లి అతని రెండో ఏటనే మరణించింది. ఎర్రగా, సన్నగా, రివటలా, పలుచటి ముఖం, తీర్చిదిద్దినట్లు కళ్లు, తీక్షణమైన చూపులు, అరచేతుల చొక్క, తెల్లటి పంచె అడ్డ కట్టు.. 'మధూకరం', వారాలు చేసుకుంటూ తనను, తండ్రిని పోషించేవాడు. దేవాలయాల దగ్గర గంధం తీసి అమ్మేవాడు. చిన్న వయసులోనే తమిళ సాహిత్యాన్ని బాగా చదివాడు. దీనివల్ల తమిళ జీవన విధానంలోని సునిశిత హాస్యం అతని దృష్టిని ఆకర్షించింది. తల్లి ప్రేమ తెలియనివాడు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేనివాడు. పెద్దవుతున్న కొద్ది అతని సమస్యలు పెద్దవిగా మారాయి. అతని పదిహేనవ ఏట తండ్రి మరణం, దహన సంస్కారాలు దగ్గరుండి చూడటం చేత మూర్ఛ వచ్చి పడిపోయాడు. ఆ జబ్బే చివరకతని ప్రాణం తీసింది..
ఒక చేత్తో రచనలు.. మరో చేత్తో..
జీవనం కోసం తెనాలిలో అక్క భర్త భీమారావు కాఫీ హోటల్‌లో సర్వరుగా కుదిరాడు. సర్వరుగా పని చేస్తూనే పుస్తకాలు చదవటం విస్తృతం చేసాడు. తెనాలిలో బతకాలంటే తెలుగు అవసరమనుకున్నాడు. తురగా వెంకటేశ్వరరావు గారనే వీధి బడిపంతులు దగ్గర 'ఓనమాలు' నేర్చుకొన్నాడు. మూడవ తరగతి వరకు అక్కడే చదివాడు. 'గజేంద్ర మోక్షం' 'శ్యామలా దండకం' కంఠస్తం చేసాడు 'శారద నీరదేందు' అనే భాగవత పద్యమే కాదు.. 'చెయ్యెత్తి జైకొట్టూ తెలుగోడా' అనే గీతం నిత్య స్మరణీయాలయాయి.. పాడకుండా ఉండలేని 'నటరాజన్'ను చూసినవారు లేరనేది మిత్రులు వ్యాఖ్యానం. తెలుగు భాషపట్ల నటరాజన్‌కు ఎంతో మమకారం, ఆప్యాయత. క్రమేపి పెద్దయినా.. అతని ఈతి బాధలు పోలేదు.. ఒక ప్రక్క రచనలు చేస్తూనే మరో చేత్తో గారెలు, బజ్జీలు వేస్తూ 'జీవనం' చేసిన 'గొప్ప సాహితీకారుడు'.. తెలుగులో గొప్ప రచనలు చేయటం వలన 'గుర్తింపు పొందని' వాడు..
ఏడేళ్లలో ఐదారు నవలలు, నూరు కథలు
నటరాజన్‌కు మొదటి నుంచి రచనా ప్రవృత్తి ఉంది. ఆంగ్ల, ఫ్రెంచి భాషలను నేర్చుకున్నాడు. ఆ భాషలలోని కథలను తమిళంలోకి అనువదించేవాడు. తనలోని రచయితను మేల్కొలిపాడు. ఆంగ్ల పత్రికలలోని పజిల్స్ పూర్తి చేసి బహుమతులు గెలుచుకున్నాడు. నటరాజన్ 1948-55ల మధ్య కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే రచనలు చేశారు. ఏది సత్యం, మంచీ- చెడూ, అపస్వరాలు, మహీపతి అనే నవలలు రాశారు. ఆ రోజుల్లో స్త్రీల పేరుతో రచనలు చేస్తే వెంటనే పత్రికలలో అచ్చయేవి. 'శారద' అనే పేరుతో రచనలందుకే చేసారని అనుకున్నారు. కానీ.. అది నిజం కాదని ఆయనే చెప్పుకున్నారు.
తొలి రచన 'ప్రపంచానికి జబ్బు చేసింది'
1946లో ఆయన మొదటి రచన 'ప్రపంచానికి జబ్బు చేసింది' ప్రజాశక్తిలో ప్రచురితమయింది. 'జ్యోతి' తెలుగు స్వతంత్ర' 'హంస' వంటి పత్రికలు ‘శారద' రచనలు ప్రచురించాయి. ఆ రోజుల్లోనే 'ప్రజావాణి' అనే రాత పత్రికను ప్రారంభించారు. తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసినా 'అల్లూరి సీతారామరాజు' ‘కన్నెగంటి హనుమంతు' అనే సినిమాలను కలర్‌లో తీద్దామని ప్రణాళికలు వేసుకున్నారు. రావూరి భరద్వాజ, ప్రకాశం, మల్లిఖార్జునరావు, ఆలూరి భుజంగరావు 'శారద'కు ఆప్తులు. ఎంతటి దారిద్ర్యం వెంటాడినా 'రచనలు' చేయటం మానలేదు. ఆయనదో విభిన్నమైన శైలి. చలం, బుచ్చిబాబు రచనలంటే ప్రాణం. 'కొడవటిగంటి కుటుంబరావు, రా.వి.శాస్త్రి గార్ల రచనలకు వారధి వంటివాడు శారద' అని ఆరోజులలో సాహితీకారుల మన్ననలందుకొన్న సాహితీ సృజనకారుడు 'శారద'.
మృతుడు కాదు.. అమరుడు
'శారద నీరదేందు ఘనసార ‘శారద' జీవితం 17.08.55 తన 31వ ఏట శాశ్వత నిద్రలోనికి జారిపోయింది. నటరాజన్ కథ ఓ జీవిత సత్యాన్ని సాహితీ లోకానికి.. సమాజానికి ఎలుగెత్తి చాటుతుంది. కష్టాల కొలిమి నుండి ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలి దప్పులు, దారిద్ర్యం సృజనను ఆపలేవు. శారద- కేవలం రచయిత కాదు.. తత్వవేత్త, క్రాంతిదర్శి, దార్శనికుడు. తెనాలి శారదను ఒక తల్లిగా ఆదరించింది. చివరి వరకు అతను తెనాలిని వదిలి పెట్టలేదంటే అతిశయోక్తి కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తమవంటి వారి జీవితాలు మారుతాయనే అతని ఆశ నిరాశగా మారింది 'ఈ పద్ధతిలో నేను స్వతంత్ర భారత పౌరుణ్ణని భావించలేకపోవటంతో తప్పేమీ లేదనుకుంటాన'ని ఆయనే వాపోయారు. ''నూరు కథలను రాసిన శారద, ఐదారు నవలల్ని రచించిన శారద, ప్రతీ రచన ద్వారా పాఠకుణ్ణి పలకరించిన శారద... మృతుడు కాదు. అమరుడు” అనే నార్ల చిరంజీవి గారి మాట అక్షర సత్యం.
(1924-2024 శారద శత జయంతి సంవత్సరం సందర్భంగా)
భమిడిపాటి గౌరీశంకర్
94928 58395