అయ్యా...ఓ పారి అచ్చిపోరా!

by Ravi |   ( Updated:2024-09-01 18:30:59.0  )
అయ్యా...ఓ పారి అచ్చిపోరా!
X

అయ్యా....

మీరొత్తండ్లని కబురందగానే

మీ వొళ్లలువకుండా ఉండేందుకు

మావోళ్లు తెల్లారి తెల్లార్లకే రోడ్లు సగపెట్టిండ్రు

మీ కళ్లకానందంగా నదురియ్యదానికి

ఒక్క పూటల్నే చెట్లను పెంచిండ్రు

మీరు మొక్కుకునే గుడి సుట్టూత

ఎలిగే కరెంటు దీపాల జిలుగులు సూత్తాంటే

నింగినుండో సుక్కల మండెనుదెచ్చి ఈడ అలికినట్టుండ్రు

తొవ్వ తొవ్వంతా శెత్తను దీశి ముగ్గులు పోశిండ్రు

మీ పాణానికి ఎప్పుడు ఏ ఆపద యెట్లత్తదోనని

పెద్దాసుపత్రిల జేశినట్టే సకలం సవులతులు జేశిండ్రు

గియన్ని ఆర్తల్లో ఇని జూశినంకా మాకాశబుట్టింది

అయ్యా...మీకు పున్నెముంటది బాంచన్

ఓ పారి మా గూడానికొచ్చిపోరాదుర్రి

గిట్లనన్నా... మూరెడు మూరెడు గుంతలు పడి

బురద మళ్లైన మా రోడ్లు సక్కపడుతయేమో

మా ఇంట్లబుట్టినోళ్ళ లెక్కనే మమ్మంటుకునుండే మురుగు

కొన్ని దినాలన్నా మా నుండి దూరమైతదేమో

యెన్నడెలుగని మా గూడెంలో ఈది దీపాలు

మీరొచ్చే పున్నాన తళుకుతళుకులాడుతాయేమో

కక్కుడేరుగుల్లకే మందుబిళ్ళల్లేక సచ్చిన మా సంటోల్లు

మీ పేరుమీదనన్నా నాలుగొద్దులెక్కువ బతుకుతరేమో

అయ్యా... మీరొత్తే మా గూడెంల

దసరా దీపాలి కలిపొచ్చినట్టే ఉంటది

మీకు పున్నెముంటదీ...

యాడాదికోపారన్నా మా గూడాలకొచ్చిపోండ్రి

ఎప్పుడు యే గాలికారిపోతయో తెల్వని

మా బతుకు దీపాంతలల్లా

మీ తీరుబడి యాత్రైనా...

మాకింత జీవ సమురైతదేమో....

మీకు పున్నెముంటది

అప్పుడప్పుడూ మా గూడాల

పొంటి సూశిపోండ్రి బాంచెన్

దిలీప్.వి

84640 30808

Advertisement

Next Story