నేను తంగలాన్‌ని

by Ravi |
నేను తంగలాన్‌ని
X

నేను తంగలాన్‌ని

పరాజితులైన నీ తాత ముత్తాతల

ఆదిమ రక్త వారసున్ని

ఆర్య కుల కట్టడి ఊరు పొలిమేర

వెలివాడల

నిశీధిని పారదోలే

ద్రవిడ అస్తిత్వ తొలి పొద్దును

ఎట్టి చేసిన మట్టి మనుషుల

బక్క చిక్కిన కాలే(ఖాలీ) డొక్కలు నింపే

గంజి అంబలిలో గుడిచిన మెతుకును

పట్టెడు కయ్యలేక పుట్టెడు కైకిలి కెలికితే

తట్టెడు కష్టంలోంచి

పుట్టిన నెత్తురు చెమట చుక్కను

ఆదిశంకరుని దూర దుష్ట

ఘోర కుట్ర ఆదేశాలతో

కాలం కత్తితో

తెగిపడ్డ శాక్యముని శిరస్సును

క్రూర క్రూసెడ్లలో కూల్చబడ్డ

నేలమాళిగల్లో దాచబడ్డ

నిషిద్ధ(బుద్ధ) నాగజాతి చరితను

అభ్యుదయం అద్వైతం

రామానుజన్ అశేష చిత్ ఆచిత్‌ల బ్రహ్మం

వర్ణ విభజనల వాటాల చితాభస్మం

కొంకణ్ కొలహార్ బంగారు గనుల్లో

బాల్యం ఎరుగని బానిసల చెరబడ్డ చరిత్ర పుటను

అంటరాని స్వదేశీ నిరాశ

అవకాశవాద పరదేశీ అత్యాశల

శ్రమ దోపిడికి సాక్షి"భూత" ఏనుగు కొండను

భూమిపై అధికారాన్ని శిస్తుల శిలువతో

పొలంలో పాతితే దోపిడీ పొరల్ని చీల్చి

మళ్లీ మొలకెత్తిన మూలవాసిని

నేను నీ తంగలాన్‌ ని

నీ మెదడు లోతుల్లో ఆదమరచిన మట్టి మనిషుల

వారసత్వ వాస్తవ జ్ఞాపకాన్ని....

- బ్రూపి

99591 95976

Advertisement

Next Story