ఆ రెండు రాఖీలు

by Ravi |
ఆ రెండు రాఖీలు
X

ఎన్ని పున్నాలు

మనయింట్లో పూసినా

ఈ పున్నంను మీరు

నా చేతికి కట్టినప్పుడు

మన ఇల్లంతా పెడ్లిపందిరయ్యేది

మనుసులన్నీ తియ్యని

నెయ్యిబూరెలయ్యేవి

ఇప్పడెక్కడున్నారో కానీ

ఇప్పటికీ ఈ రోజు నా చేతిని

చూసుకున్నపుడు

మురిపెంగా మీరుకట్టిన

దూదిబొండల రంగుల రాఖీనే

గుర్తుకస్తున్నది

మూడు కాలాలు పోటీపడి

సూర్య చంద్రులు ఆడుకునే

మన యింట్లో

మీరచ్చిన రోజు

వెలుగులతో అలుకబడేది

ఇపుడు వేలు ఖరీదు చేసే

రిస్ట్ వాచ్ కంటే

మీ ప్రేమలో ముంచికట్టిన

దారపు కంకణమే

నా చేతికి చుట్టిన

బంగారు బాస్లెట్

రేపు రాఖీల పండుగని

తెల్సినపుడు

మీ కోసమే రాత్రంతా

కలువరించేవాన్ని

తల మసాలా పెట్టి తానంపోసి

పీటమీద కూసుండవెట్టి

కొత్తంగి తొడిగి బొట్టువెట్టి

బెల్లప్రభ చేతుల వెట్టి

మీ కళ్ల నుంచి నా తలపై

పువ్వులు రాలంగా

మీరు కట్టిన అనురాగపు యాది

నన్ను మన ఊరువైపు

గుంజుకపోతున్నది

అవ్వ శేండ్ల కెళ్తే

అన్నం పెట్టి మూతికడిగి నీళ్లుతాపి

సంకనెత్తుకొని ఆడిపించిన

లాలిపాటలు ఎటెగిరి పోయినయో

ఒక చేతిలో పలకా

ఒక చేతిలో చిటికెనేలుతో

బడికి అలవాటు చేసిన మీరు

ఇప్పుడు ఏ తమ్ముని

కండ్లు తుడువ పోయిండ్రో

లోకమంతా తమ్ముళ్ళే అని

జనం రానంత దూరం లోకి

వాళ్ళ గరీబు దుఖాన్ని

మట్టమీది ఏడుపును

ఎన్నుకంటుకున్న ఖాళీ కడుపును

చూసి వెల్లిండ్రో

మీరొచ్చేదాకా

గాజాలో ఒంటరిగా

దుఃఖస్తున్న పసికళ్ళలా

వయనార్లో వరదల్లో చిక్కుకున్న

అనాధ చూపుల్లా

మీ కోసం మీ రెండు రాఖీల కోసం

ఈ రెండు చేతులు

ఎదురు చూస్తూనే వుంటాయి

ఎదురు చూస్తూనే ఉంటాయి.

డా. ఉదారి నారాయణ

94414 13666

Advertisement

Next Story