మధుర జ్ఞాపకాలు

by Ravi |
మధుర జ్ఞాపకాలు
X

మాట మౌనంగా ఉంటే మూగ భాషే

మాట మధురంగా వుంటే ఇరు

హృదయాలను నిండుగా నిమురుతుంది

మాట పెలుసుగా మారితే మనిషిలో

ఇంకో మనిషి నిదుర లేస్తాడు

క్రోధంలో పుట్టిన కసి పెరుగుతు పెరుగుతూ

తనకు తానే నివురుగప్పిన నిప్పులా

మారుతూ మారిపోతూ, కళ్ళకు గంతలు కట్టినా

అవతలవన్నీ కనిపించినట్టు

విప్పినా ఎదురుగా వున్నవి కనిపించనట్టు

అదొక వింత పరిణామం

అతుకుల రహదారిపై గతుకుల బతుకులు

చిత్రంగా నడుస్తుంటే

రోదిస్తున్న గుండెకు మాటే ఒక మంత్రం ఔషధం

కాలగర్భంలో కలిసిన కష్టాలను నెమరు వేసుకునే

సమయంలో మాటే ఒక ఓదార్పు

నీళ్లు నిండిన నిండు గిన్నెలాంటి కళ్ళకు

మనసు చెప్పే మౌన భాష్యమే తీయని మాట

మధుర జ్ఞాపకాల లోగిలిలో నిలువెత్తు విగ్రహమై

నిన్ను కడవరకు కాపాడేది నీ నోటి మాటే

కాదంటే ఔనంటె కీచులాటల ఆటలో

మాట ఒక మంత్రమై నిలవాలి

మనిషి తనవు ఆనవాళ్లు పుడమిపై

మిగలాలని మౌనంగా రోదించటం కాదు

ఒక మాట శాసనమై నిలవాలి..!

- బొమ్మిదేని రాజేశ్వరి,

90527 44215



Next Story