గురువు విలువ పెంచిన పుస్తకం

by Ravi |
గురువు విలువ పెంచిన పుస్తకం
X

కాలాలు ఎన్ని మారినా ఏనాటికి చెక్కుచెదరని విశిష్ట బంధం గురుశిష్య సంబంధం, నేటి ఆధునిక కాలాన అట్టి బంధం పలచబడుతుంది అన్న అపోహ అంకురిస్తున్న వేళ గురుశిష్యుల అనుబంధం చాటుతూ ఆధునిక శిష్యగణం కర్తవ్యం గుర్తు చేస్తూ గురువులు చేసిన చేస్తున్న కృషికి విలువ పెంచుతూ వెలువడిందే "నాకు నచ్చిన గురువు". వర్తమాన రచయిత డాక్టర్ మడత భాస్కర్ సంపాదకత్వంలో వెలువడిన ఈ సంకలనంలో మొత్తం 72 వ్యాసాలు ఉన్నాయి, ఇవి అన్ని విద్యా వ్యవస్థకు చెందిన తెలుగు బోధకులు మాత్రమే రాసిన వ్యాసాలు. వ్యాసకర్తల ఎంపికలో తెలుగు బోధకులను మాత్రమే ఎంపిక చేసుకోవడంలో సంపాదకుని లక్ష్యం తెలుగు బోధకుడైన తనలో గల రచనా సువాసన మిగతా తెలుగు బోధకుల్లో కూడా విధిగా ఉండవచ్చు అన్న నమ్మిక కావచ్చు, సంపాదకుని లక్ష్యం దగ్గరలోనే ఈ వ్యాసాలు వెలువడ్డాయి.

టీచర్లపై ప్రేమతో తామూ టీచర్లై...

ఈ వ్యాస సంకలనంలో ఏ వ్యాసం ముట్టినా ప్రతి దానిలో ఆయా తెలుగు పంతుళ్లను ప్రభావితం చేసి తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచి కేవలం చదువు మాత్రమే కాక సంస్కృతి సంప్రదాయాలు రచన విధానం అలవడానికి కారకులైన తమ తెలుగు గురువులను గుర్తు చేసుకున్న వైనం ఇందులో గమనించవచ్చు. డాక్టర్ ఆకునూరు విద్యాదేవి తనకు 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు బోధించిన సుభద్ర టీచర్ ప్రభావంతో తెలుగు మీద ప్రేమ పెంచుకోవడమే కాక తెలుగే ప్రధాన అంశంగా విశ్వవిద్యాలయ విద్య పూర్తి చేసి అత్యుత్తమ పరిశోధన కూడా ముగించడమే కాక తాను కూడా తెలుగు అధ్యాపకురాలై మరెంతో మందికి తెలుగు భాషా రుచులు పంచుతూ, మంచి రచయిత్రిగా మారిన సంగతి చెబుతారు, దీనిని బట్టి తెలుస్తుంది గురువు ప్రభావం శిష్యుల మీద ఎంతగా ఉంటుందో..!

చదువుతోపాటు చేయూత నిచ్చిన గురువులు

ఇదే ప్రభావిత వర్గంలో చేరిన వురిమళ్ల సునందకు రాజేశ్వరరావు సర్, కొమ్మల సంధ్య‌కు పంజాల సత్తయ్య సార్, మీసాల సుధాకర్‌కు లింగయ్య సార్ ఇలా ఎందరో నేటి తరం తెలుగు బోధకులు నేడు ఆదర్శనీయమైన తమ తమ బోధనలతో ఎందరో విద్యార్థులకు తెలుగు బోధిస్తూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గురువులుగా గుర్తింపు పొందుతున్నారు, అంటే అదంతా వారు తమ గురువుల వద్ద పొందిన స్ఫూర్తి వల్లే అని సగర్వంగా చెప్పుకొచ్చారు. డా. పాతూరి రఘురామయ్య గారు ఆంగ్లం బోధించిన జీడికంటి శ్రీనివాస మూర్తి ద్వారా ప్రేరణ పొందితే, మరో తెలుగు బోధకుడు గొబ్బూరి గంగరాజు తనకు ఇంటర్‌లో కామర్స్ బోధించిన ఎన్.వి.ఎన్ చారి సర్ కేవలం చదువు చెప్పటమే కాక తన ఆర్థిక స్తోమత గమనించి తనను చేరదీసి డిగ్రీ వరకు చదివించిన వైనం, జీవనోపాధి కోసం వైద్య వృత్తిని కల్పించటమే గాక తెలుగు భాషా సొగసులు పరిచయం చేసి సార్వత్రిక విధానంలో తెలుగు, సంస్కృత, భాషల్లో మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసుకోవడమే గాక తెలుగు పండితునిగా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి సైతం చేయూతనివ్వడం గురించి కరుణ రసాత్మకంగా వివరించిన వైనంతో గురువు శిష్యుడిని అన్ని కోణాలలో ప్రభావితం చేస్తాడు అన్న విషయం అర్థం అవుతుంది.

మార్గదర్శకులూ గురువులే

పరిశోధక రచయిత డాక్టర్ అమ్మిన తనకు ప్రత్యక్షంగా బోధన చేయకపోయినా తన యావత్ విద్యా జీవితమే మారిపోయేటట్టు సలహాలు ఇచ్చిన గురువు కాని గురువు "దండా గురవయ్య" గురించి చెప్పి, బోధన చేసిన వారే కాదు మార్గం చూపిన వారు గురువులే అన్న సత్యాన్ని నిజం చేశారు. తెలంగాణ తొలి కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ తన ఎదుగుదలకు కారకులైన ఎందరో గురువుల బృందాన్ని గుర్తు చేసుకుంటూనే... తన పరిశోధన మార్గదర్శి ఆచార్య పిల్లలమర్రి రాములు తనకు పరిశోధనలోనే కాక సాహితీ సృజనలో కూడా ఎలా మార్గదర్శనం చేసిందీ వివరించారు. తాడిచెర్ల రవి తనకు ఇష్టమైన గురువు "మందల మల్లారెడ్డి" గురించి గుర్తు చేస్తూ ఆయన సాహితీ జీవితాన్ని ఆయన చెప్పిన ఆదర్శ ఉపాధ్యాయ లక్షణాలను కూలంకషంగా రాసి మరుగున పడిన ఒక గొప్ప పరిశోధక రచయిత సాహితీ కృషిని నేటి తరానికి గుర్తు చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంది.

మనమూ ప్రాతఃస్మరణీయులు అవుదాం

ఆప్త వాక్యాలు అందించిన తనికెళ్ల భరణి, డాక్టర్ గోపీ కూడా తమ ఈ స్థాయికి కారుకులైన గురువులను గుర్తు చేసుకున్న తీరు హర్షనీయం, "మనకు బోధించిన గురువులను తలుచుకుందాం..! మనం బోధించే పిల్లలకు ప్రాతఃస్మరణీయుల మవుదాం" అన్న డాక్టర్ సీతారాం మాటలు అక్షరసత్యంగా ప్రతి బోధకుడు ఆదర్శవంతంగా పాటించాలి. ఆధునిక విద్యా రంగం ప్రమాదకర పోకడలలో పయనిస్తున్న ఈ వేళ రావలసిన సమయానికి వచ్చిన ఒక మంచి వ్యాస సంపుటిగా దీనిని అభివర్ణించవచ్చు, ఎంతో క్లిష్టమైన ఈ సామూహిక సృజనా కృషిలో శత శాతం విజయం సాధించిన సంపాదకుడు డాక్టర్ మడత భాస్కర్, ప్రచురణకర్త చక్రవర్తుల శ్రీనివాస్ మాధవిలకు ప్రత్యేక అభినందనలు. విద్యా సేవకులంతా విధిగా సొంతం చేసుకుని దాచు"కొని" చదవదగ్గ అమూల్య పుస్తకం ఇది,

పుస్తకం : నాకునచ్చిన గురువు (వ్యాస సంకలనం),

సంపాదకుడు: డా: మడత భాస్కర్,

పేజీలు:350, వెల: రూ.990,

ప్రతులకు : 89193 28582


సమీక్షకులు:

డా: అమ్మిన శ్రీనివాసరాజు,

77298 83223

Advertisement

Next Story