ప్రత్యక్ష జీవితమే.. ప్రామాణికమైన కథలుగా..

by Ravi |
ప్రత్యక్ష జీవితమే.. ప్రామాణికమైన కథలుగా..
X

అనాదిగా ఈ దేశంలోని దళితులు.. సామాజిక విభజనను, అసమానతలను పెంచి పోషించే కుల వ్యవస్థ దుర్మార్గానికి గురవుతూనే ఉన్నారు. కానీ కులవివక్ష ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అది కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ నాజూకైన రూపాలను ధరించి తన వివక్ష, దోపిడీ సారాన్ని మరుగు పరచుకుంటుంది. అటువంటి పైపై రూపాన్ని మాత్రమే చూసి కుల (సార)మే లేదంటున్న సోకాల్డ్‌ 'ఆధునికుల' వాదనా బండారాన్ని దశాబ్దన్నర కాలంగా రాస్తున్న తన కథల ద్వారా బట్టబయలు చేస్తున్నాడు పసునూరి రవీందర్‌.

ఇక్కడే ఒక విషయం చెప్పాలి. మొట్టమొదటి ముద్రణ (2019 ఫిబ్రవరి) 'అవుట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియా' కథల పుస్తకానికి లేని 'ఆధునిక దళిత కథలు' అనే ఉపశీర్షికను రెండవ ముద్రణ (2023 ఫిబ్రవరి)లో రచయిత చేర్చాడు. ఇక్కడ ఈ 'ఆధునిక ' అనే పదం కేవలం కాలసూచిక మాత్రమే కాదు. ఇంతకు ముందటి దళిత రచయితల దృక్పథానికి, పసునూరి దృక్పథానికి మధ్య ఉండే ఒక గుణాత్మక తేడాను ఈ పదం సూచిస్తుంది. ఇందుకు 'అవుట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియా' పుస్తకం తర్వాత వచ్చిన 'కండీషన్స్‌ అప్లయ్‌' పుస్తకంలోని కథలను మరింత సజీవ ఉదాహరణలుగా చెప్పవచ్చు. గ్రామాల్లోను, నగరాలలోనూ ప్రజల జీవితాలపై పడిన ఆ చలన క్రమాల ప్రభావాలన్నింటినీ పసునూరి రాసిన 'పులి అడుగు దెబ్బ', 'ధూం తడాఖా”, జెజ్జెనక జెన్‌', 'ధంకీ' లాంటి కథల్లో మనం చూస్తాం. ఇక 'వాట్సాప్‌ స్ట్రీట్స్’ కథలో మనిషి రకానికి కులాన్ని ఆపాదించగా, 'కండీషన్స్‌ అప్లయ్‌ ' అనే కథలో స్తీ గర్భానికి కూడా కులాన్ని ఆపాదించిన మనోవికారాన్నీ రచయిత చిత్రించాడు.

ఆధునిక దళిత జీవితపు అసలు పార్శ్వం

ఈ సంపుటిలోని మిగిలిన అన్ని కథలు ఒక ఎత్తు అయితే, 'లీఫ్ మ్యాన్‌' అనే కథ ఒక్కటే మరో ఎత్తు. ఎందుకంటే అత్యాధునిక, ఆధునికానంతర సిద్ధాంతాలెన్నో రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆధునిక దళిత జీవితపు అసలు పార్శ్వాన్ని ఈ 'లీఫ్‌ మ్యాన్‌' కథ గొప్పగా క్యాప్పర్‌ చేసింది. ఈ కథ ఒక్కటే మిగిలిన దళిత రచయితలందరి కంటే పసునూరిని ప్రత్యేక కథా రచయితగా నిలబెడుతుంది. అంటే, ఈ కథ ద్వారా పసునూరి దళిత అస్తిత్వ సమస్యను కేవలం కుల అస్తిత్వ కోణం లోంచే కాకుండా , రాజకీయార్థిక కోణంలో కూడా చూడగలిగాడు.

ప్రత్యక్ష జీవితమే పరమ ప్రమాణం

సంక్షిప్తంగా చెప్పాలంటే పసునూరికి ప్రత్యక్ష జీవితమే అత్యంత ప్రమాణం. ఏ పోరాటమైనా ప్రజల జీవితాన్ని ప్రగతిశీలంగా మారుస్తున్నదా లేదా అనే దానిపైనే ఆయన గురి ఉంటుంది. అందుకే ఆయన రాస్తున్న కథలేవీ నేల (జీవితం) విడిచి చేసే సాము లాంటి విన్యాసాలు కావు. 'లీఫ్ మ్యాన్‌' కథలోని లింగరాజు చూపులాగే పసునూరి చూపు కూడా నేల చూపే కానీ తల ఎత్తని చూపు ఎంత మాత్రం కాదు. సగర్వంగా తలెత్తుకొని డప్పెత్తి దరువేస్తూ ఆ డప్పునే రద్దు చేయాలనుకునే చూపు. తన కలాన్ని పదునుదేరేలా నూరుతూ కత్తిలా పైకెత్తి కులచ్చేదనం చేయాలని బయలుదేరిన వాడు. ఆ క్రమంలో కాళ్ల కింది నేలను విస్మరించకుండానే నింగిలోని నక్షత్రాల కేసి కూడా చూపు సారించే బృహత్‌ దృష్టి రచయిత పసునూరికి ఉందని చెప్పడానికి ఈ 'లీఫ్‌ మ్యాన్‌' కథే ఉత్తమ ఉదాహరణ.

కులం గుట్టును రట్టు చేసిన కథలు

ఇవి కులం గుట్టును రట్టు చేసిన కథలు. కులం పేరిట దళితుల్ని అవమానించి, హింసించి, సంహరించే దేశం ఆధునిక భారతదేశం ఎట్లయితదని పసునూరి ప్రశ్నిస్తున్నాడు. కారంచేడు నుండి వాకపల్లి వరకు దళిత స్త్రీలను చెరచడంలో, దళితుల్ని చంపడంలో 'పధాన స్రవంతి' రాజకీయాలన్నీ పోటీ పడుతున్న చోట కులం లేదని ఎలా అనగలం ప్రేమైక నిలయమైన ఇంటిగుట్టును కాపాడడంలో అర్థం ఉంది గాని, కులగుట్టును కాపాడడంలో అర్థం ఏముంటుంది కుల హింసను, కుల ద్వేషాన్ని కాపాడడం తప్ప కులగుట్టులో మరేం లేదు. ఏ పట్టణానికేగినా, ఏ దేశాంతరాలకేగినా ఇంటా బయటా కులం నీడలా వెంటాడి హింసిస్తుంటే దళితులెలా కులగుట్టును దాచుకున్న దేశం గుట్టును కాపాడుతారు. నిలువెల్లా ద్వేషంతో నిండిన, హింసాయుతమైన అలాంటి కులగుట్టును రట్టు చేసిన కథలే ఇవి. అంటరానితనానికి, ఆర్థిక సమస్యకు మధ్య లేని పోటీని తీసుకువచ్చి, ఆర్థిక సమస్యల పరిష్కారమే ప్రధానమని చెప్పినచెప్పే ప్రగతిశీలుర ధోరణులను పసునూరి కూడా పసిగట్టాడు. అందుకే 'ఆత్మగౌరవం లేని చోట అన్నం ఎలా సహిస్తుంద'ని పసునూరి ప్రశ్నిస్తున్నాడు.

రూపం మార్చుకున్న సరికొత్త దాడి

అయితే పట్టణాలకు, దేశాంతరాలకు వలసవెళ్తే కుల వివక్ష, అంటరానితనం పోయాయని కాదు. అవి రూపం మార్చుకుని సరికొత్త దాడి చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీలు, గోవర్ణ భూ వెంచర్లు, కుల(బ్రాహ్మణ) కాలనీలు అటువంటి ఆధునిక అంటరానితనాన్ని, కులవివక్షను ఎత్తి చూపుతున్నాయి. ఈ మనువాద భాగోతాన్నంతా పసునూరి తన కథల్లో చూపించాడు. స్థల కాల గమనాలలో నిర్దిష్టత ప్రాధాన్యతను గుర్తించడమే ఈ కథల విశిష్టత. నిర్దిష్ట స్థలకాలాలలో వాస్తవిక జీవితాన్ని పట్టించుకోకుండా సమకాలీన చారిత్రక గమనాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అలాగే భవిష్యత్‌ చరిత్ర నిర్మాణంలో ఏయే సామాజిక శక్తుల పాత్ర ఏమిటో సరిగ్గా గుర్తించలేము. ప్రియ మిత్రుడు పసునూరికి వచ్చిన రాబోయే అవార్డ్స్‌ ఏవైనా ప్రజల, పాఠకుల అభిమానానికి మించినవి కావని నమ్ముతూ హార్దిక అభినందనలతో...

(నేడు 15న పసునూరి “కండీషన్స్‌ అప్లయ్‌’కి తెలంగాణ సారస్వత పరిషత్‌ ఉత్తమ కథా సంపుటి-2024 పురస్కారం ప్రదానం చేస్తున్న సందర్భంగా)

మెట్టు రవీందర్‌,

సాహిత్య విమర్శకులు

99087 63566



Next Story