సామూహిక బాధకు సంఘీభావం దర్డ్

by Ravi |
సామూహిక బాధకు సంఘీభావం దర్డ్
X

భారతదేశం భిన్న సంస్కృతులు, సంప్రదాయాల నెలవు. ఎన్నో కులాలు, మతాలు, భాషలు ఇక్కడున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. కానీ కొన్ని మతోన్మాద ఫాసిస్టు శక్తులు ఈ సామరస్యాన్ని దెబ్బతీయాలని, అబద్ధాల పునాదులపై అధికార సౌధాన్ని నిర్మించుకొని మనువాదాన్ని ప్రతిష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఈ దేశ మూలవాసులైన ముస్లింలపై విషం చిమ్ముతున్నాయి. వారిని పరాయివారుగా చిత్రించి, పౌరసత్వాన్ని లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని న్యాయ ప్రేమికులు ఇటీవలి కాలంలో గళం విప్పుతున్నారు. కలాలు కదిలిస్తున్నారు. అందులో భాగంగానే ముస్లిం మైనారిటీలు అనుభవిస్తున్న అస్తిత్వ వేదనను, దుఖాన్ని పదిమందికీ చెప్పడం కోసం, నొప్పి నివారణకు అందించవలసిన ఔషధాలను సూచిస్తూ స్కైబాబా బహుముఖ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.

ముస్లిం పెయిన్‌కి అక్షరరూపం

తెలంగాణ సాహితీ జగత్తులో స్కైబాబాను ఎరుగని వారు ఉండరు. కవిగా, కథకుడుగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడుగా స్కై అందరికీ సుపరిచితమే. కవితా, కథా సంకలనాలు అనేకం వెలువరించాడు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా ఆయన రచనలు అనువాదమయ్యాయి. ప్రస్తుతం 'దర్ద్ ' పేరుతో ముఫ్ఫై మూడు మంది కవుల సంకలనాన్ని వెలువరించాడు. ఇందులో కూడా ఈ దేశ మూలవాసులైన ముస్లింలు అనుభవిస్తున్న 'దర్ద్ 'ఉంది. ఇందులో లబ్ద ప్రతిష్టులైన సీనియర్లతో పాటు, కొత్త కవులకూ స్థానం కల్పించడం మంచి పరిణామం. దర్ద్ కవులు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తమ సమూహం అనుభవిస్తున్న నొప్పినీ, దుఖాన్ని అక్షరీకరించిన తీరు ప్రశంసనీయం.

సమాజ అస్తిత్వ ఆవేదనను..

కాషాయ కళ్లద్దాలు నుంచి కాక మనసు చక్షువులతో చూడు మేమేమిటో కనబడుతుంది అంటాడు దర్ద్ సంపాదకుడు స్కై. 'అన్నీ దాటి చలివేంద్రాల్లాంటి నా సుర్మా కళ్లల్లోకి ఒక్కసారి నీ జాఫ్రానీ అద్దాలు పక్కనపెట్టి చూడు ప్రేమ కురిపించడానికి అవి సిద్ధంగా ఉంటాయ్ నిర్మలమైన జుబ్బా పైజమాలో చేతులు చాచి నిలుచున్నాను గుండెకు గుండె కలిపే అలాయి బలాయి ఇవ్వడానికి సదా సిద్ధం. అసుంట అసుంటా అనే వాణ్ణి కాను నేను నిచ్చెన మెట్లుగా చీలిన మీ మధ్య వారధిగా నిలుచున్నాను'. అంటూ ప్రేమ, ఆప్యాయతల వారధి నిర్మిస్తున్నాడు స్కై.

'కన్నపేగుల మీద ఎవరి అధికారం యెంతో ఇంతవరకూ నాకెవ్వరూ చెప్పలేదు /ఆస్పత్రి గోడల మధ్య పెల్లుబికిన నా చివరి కేకల మంటల్లో ఆ కన్నపేగుల సమిధలన్నీ కళ్లారా చూశాను/ అమ్మా, నన్ను కన్నందుకు నీ పశ్చాత్తాపాలు విన్నాను /నాన్నా, నువ్వు మోసుకు తిరిగిన శరీరం చావు మూలుగులు నీకే వినపడుతున్నందుకు నీ రహస్యమైన ఏడుపులు చూశాను/ నన్ను కడిగేటప్పుడు నా గాయాలు నా నెత్తురూ కనిపించకుండా నా పైన యింకో చర్మం కప్పగలరా' అంటూ ప్రఖ్యాత కవి అఫ్సర్ ముస్లిం సమాజ అస్తిత్వ ఆవేదనను, నొప్పినీ దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనింపజేశాడు ఈ సంకలనంలో...

మనిషి నిలబడే పరిస్థితి రావాలి..

'దేశాల దేహమ్మీద కనపడని రాచపుండు, వణికిస్తున్న చలి లాంటి విద్వేషం మనిషి తప్ప అన్నీ ప్రాధాన్యత సంతరించుకున్న వ్యూహాలు ఎదురుగా నిలుచున్న వారిని గుర్తించని గుడ్డితనం కులాన్ని, మతాన్ని తప్ప ఇంకే కొలమానంతో చూడని కాలం. మనిషి గురించి గుసగుసలుగా తప్ప ప్రేమగా ఆత్మీయంగా బిగ్గరగా మాట్లాడుకోలేనితనం మనిషి మాత్రమే నిజమనే మనుషులు కావాలిప్పుడు.' అంటూ ప్రముఖ కవి, కవికుల గురువు యాకూబ్ మనిషి కోసం మనిషి నిలబడే పరిస్థితి రావాలంటున్నాడు. మతంకాక మానవత్వం కావాలంటున్నారు.

'..నడి సముద్రంలో మునుగుతున్న నావకు/ పూచీకత్తు ఇవ్వలేని ఈ ఫాసిస్ట్ ప్రపంచానికి/ పేచీ అంతా నా పేరుతోనే.!' అంటూ తన అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్న ఫాసిస్టు మూకల దుశ్చర్యల్ని నిరసిస్తూ ఎంతో పెయిన్‌తో వారిని ఎదుర్కొంటున్నాడు మా షకీల్ పాషా. నేనెవర్ననే కదా ఆరా తీస్తున్నావు/ నేను ఈ దేశపు మట్టిని/ మా మొహల్లాలలోకొచ్చి మా పౌరసత్వానికే పరీక్షలు పెడతావ్ అంటూ.. 'ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి ఈ మట్టిలోనే కలిసిపొయ్యే మాకు ఈ మట్టితో సంబంధమే లేని నువ్వు ప్రశ్నిస్తావా' అని నిలదీస్తున్నాడు కవి సాబిర్.

డెబ్భై ఐదేండ్ల స్వాతంత్రం..

'ఎప్పుడూ టైలర్ గానే మిషనుతొక్కాను / నా పూర్వీకుల దారంపోగుల అల్లికనెలా నిరూపించుకొగలను / ఈ దేశంతో దారపు పోగుల్లా అల్లుకుపోయిన అస్తిత్వాన్ని విడదీయొద్దు అంటున్నాడు నబీ కరీంఖాన్. '...మతం కోసం పుట్టిన నేలను విడిచి/ ఇండియానే మాతృభూమిగా/ త్రివర్ణ పతాకమే జాతి జెండాగా మానవత్వమే ధర్మంగా నిలబడ్డ ముసల్మాన్లకు డెబ్భై ఐదేండ్ల స్వాతంత్రం ఫుట్ పాత్ బతుకే ఇచ్చింది'. అంటూ, దేశం వదిలి వెళ్లండి అనే వాళ్లకు, ఇది మా మాతృభూమి, త్రివర్ణ పతాక మా జాతి జెండా, మా ధర్మం మానవత్వం, మేమెక్కడికో ఎందుకుపోవాలి అని ప్రశ్నిస్తూనే, మా రక్తం ధారపోసి సాధించుకున్న డెభ్భై ఏడేళ్ళ స్వతంత్ర భారతంలో మా బతుకులు ఫుట్ పాత్‌లకే పరిమయ్యాయన్న దర్ద్ బాధను, ఆవేదనను వ్యక్త పరిచాడు కవి అన్వర్.

ఈ విధంగా 33 మంది మూలవాసి ముస్లిం కవుల అంతరంగాల్లోంచి పెల్లుబికి వచ్చిన హృదయావేదన ఈ దర్ద్ ' కవితా సంకలనం. ప్రతి ఒక్కరూ పరామర్శించవలసిన అవసరమైన పుస్తకం. ఇంతటి మంచి కార్యానికి పూనుకున్న దోస్త్ స్కైబాబాకు అభినందనలు. సంకలన కవులకూ శుభాకాంక్షలు! ఈ కవిత్వ సంకలనంపై డా. సంగిశెట్టి శ్రీనివాస్, ఏకే ప్రభాకర్ , శ్రీరామ్ పుప్పాల విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. వీరికి కృతజ్ఞతలు!!

పుస్తకం: దర్ద్

సంపాదకుడు: స్కైబాబ

పేజీలు : 128

వెల రూ.150

పుస్తకం కొరకు: నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్ - 92474 71362


సమీక్షకులు

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Advertisement

Next Story