- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం: మట్టి మనుషుల బతుకు దీపం
హృదయం స్పందించినప్పుడు అసలు సిసలైన కవిత్వం జనిస్తుంది' అంటాడు అన్నవరం దేవేందర్. అసలు సిసలైన తెలంగాణ మట్టి కవి అన్నవరం దేవేందర్. అలతి అలతి పదాలతో తెలంగాణ మట్టి మనుషుల బతుకులను అవలీలగా అక్షరీకరించిన అరుదైన కవి అన్నవరం దేవేందర్. అణచివేత మీద ధిక్కార స్వరాన్ని నిర్భయంగా వినిపించిన కవి అన్నవరం దేవేందర్. జర్నలిజం నుంచి కవిదాక ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి, బతుకును కాచి వడబోసి అక్షరాలను ముద్దాడిన కవి అన్నవరం దేవేందర్.
నిజానికి తెలంగాణ మట్టి మనుషుల బతుకులను సాహిత్యంలోకి తీసుకు వచ్చిన కవులలో దేవేందర్ కూడా తప్పక ఉంటాడని చెప్పడం అతిశయోక్తి కాదేమో! అక్షరాలను పదబంధాలుగా, పదబంధాలను వాక్యాలుగా మార్చి రాయడమే కవిత్వమా? తాడిత పీడిత జనం ప్రజల బాధలను లేదా జానపదాల సంస్కృతీ, సంప్రదాయాలు, భాష యాస వ్యవహారాలను అక్షరీకరించడం కవిత్వమా? అంటే వెంటనే జవాబు చెప్పడం కొంత కొంచెం కష్టం అవుతుందేమో కానీ, అన్నవరం కవిత్వం చదివిన తర్వాత 'మట్టి మనుషుల బతుకులే కవిత్వమని' అంగీకరించక తప్పదు.
బతుకులను ఔపోసన పట్టి
అన్నవరం రచనలలో మనుషుల బాధలు ఉన్నాయి. కష్టాలూ, కన్నీళ్లూ ఉన్నాయి. ఆవేశం ఉంది. ఆక్రోశం ఉంది. కోపం ఉంది. తాపం ఉంది. ఆవేదన ఉంది. ఆలోచన ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బతుకే ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఆత్మీయతకు నిదర్శనం కదా! తెలంగాణ మనుషుల సంస్కృతికి అన్నవరం దేవేందర్ కవిత్వాలు ప్రతి రూపాలు అని చెప్పక తప్పదు. ఏ అంశాన్నయినా 'ముద్ద కలిపి నోట్లో పెట్టినట్టు' 'అరటిపండు ఒలిచి ఇచ్చినట్టు' చక్కగా చెప్పడం దేవేందర్ ప్రత్యేకత. వందల యేండ్ల బానిసత్వాన్ని, ధీరత్వాన్ని రెండు వాక్యాలలో చెప్పగలిగిన సామర్థ్యం అన్నవరం దేవేందర్‌ది.
ఒకనాడు తిరుగులేని హుకూం చెలాయించిన దొరల గడీలు నేడు శిథిలం కావడాన్ని చూపెడుతూ ఒకప్పుడు 'ఒకప్పుడు గడి అంటేనే ఉచ్చ పడేది, ఇప్పుడు అండ్లనే ఉచ్చ పోస్తున్నం' అన్న ఆయన మినీ కవిత ఎంతో గొప్ప ఆలోచన రేకెత్తిస్తుంది. బానిస బతుకుల హీనదీన రోజులను గుర్తుకు తెస్తుంది. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలిచిన ధీరత్వాన్ని ముందు నిలుపుతుంది. ఇలాంటి పవబంధాలు, వాక్యాలు కవితలు దేవేందర్ రచనల నిండా ఎన్నో ఎన్నెన్నో కనిపిస్తాయి. నేటి పిల్లలకు బాల్యం ఉంది కానీ, అందులోని మాధుర్యం లేదు. ఒకప్పుడు బాల్యం ఎంత మధురమైనదో దేవేందర్ అందంగా చెబుతాడు. 'నా బాల్యం పుస్తకంలో దాచుకున్న నెమలీక' అంటాడు 'ఇసుకలో కష్కెలు ఏరుకున్న యాది నా బాల్యం' అంటాడు. ఎంత గొప్ప భావుకత ఇది. ఇసుకలో పిట్టలగూడు కట్టుకొని, కషికలు ఏరుకుంటూ గడిపిన బాల్యం ఇప్పటి పిల్లలకు ఉందా? అలాంటి అందమైన బాల్యాన్ని గుర్తుకు తెచ్చి ఆనందపరచడమే కాకుండా కన్నీరు కూడా పెట్టిస్తాడు.
ధిక్కారమే ఊపిరిగా
ధిక్కార స్వరం వినిపించడమే దేవేందర్ తత్వం కాదు. తెలంగాణ సంస్కృతిని. బతుకును గుప్పిట పట్టి అక్షరాలలో బంధించడం కూడా దేవేందర్ చేతనవుతుంది. తన 'ఊరిదస్తూరి' లాంటి అనేక రచనలు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంటాయి. అందుకే దేవేందర్ అనేక పురస్కారాలను అందుకున్నాడు. శ్రీశ్రీ, శివసాగర్, సి.నారాయణరెడ్డి, ఎన్. గోపి, నందిని సిద్ధారెడ్డి తదితర కవుల రచనలు చదువుతూ తాను కవిగా ఎదిగానని వినమ్రంగా చెబుతాడు. దేవేందర్ 1988 నుంచి సాహిత్యం రాస్తున్నాడు 1985 నుంచి దాదాపు దశాబ్ద కాలం పాత్రికేయుడిగానూ ఉన్నాడు. అదే క్రమంలో సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు.
ఇప్పటి వరకు 16 పుస్తకాలు వెలువరించాడు. అందులో 12 కవిత్వ సంపుటాలు, 2 ఆంగ్ల అనువాద కవిత్వాలు, 2 వ్యాస సంపుటాలు ఉండడం విశేషం. 2001లో 'తొవ్వ' అనే శీర్షికతో తన మొదటి కవితా సంపుటిని వెలువరించారు. ఆ తర్వాత వరుసగా నడక, మంకమ్మ తోట లేబర్ అడ్డా, బుడ్డపర్కలు, బొడ్డు మల్లె చెట్టు, పొద్దుపొడుపు, పొక్కిలి వాకిళ్ల పులకరింత, బువ్వకుండ, ఇంటిదీపం, వరిగొలుసులు, గవాయి, జీవనతాత్పర్యం, మరోకోణం, ఊరి దస్తూరి పుస్తకాలను వెలువరించారు. మరెన్నో పుస్తకాలకు సంపాదకుడిగానూ వ్యవహరించారు. ఆయన కలం దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రియులను, ముఖ్యంగా తెలంగాణ సాహితీ అభిమానులను అలరిస్తూ, అలుపెరగకుండా కవిత్వాలను వెలువరిస్తూనే ఉంది. తెలంగాణ మట్టి బతుకుల జీవితాలను కలవరిస్తూ, పలవరిస్తూనే ఉంది.
అభినందనలు
తెలంగాణ సాహితీ వరం అన్నవరం దేవేందర్‌కు నేటితో 60 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ శుభ సందర్భంలోనే తాను రాసిన 12 కవితా సంపుటాలను ఒక 'బృహత్ సంకలనంగా' ఆదివారం కరీంనగర్ ఫిలింభవన్‌లో ఆవిష్కరించుకున్నాడు. అనేక మంది సాహితీ ప్రముఖులు, సాహితీ అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చి అన్నవరాన్ని ఆశీర్వదించారు. ఇది ఒక గొప్ప నిర్ణయం. అన్నవరం రచనలను ఒకేచోట చదవాలనుకునే వారికి ఇది నిజంగా ఒక వరం. జనం బతకుబాటలో అన్నవరం కలం మరింతగా రాటుదేలాలని, సాహితీ స్రష్టగా దేవేందర్ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ, మిత్రమా అన్నవరం అభినందనలు. శుభాకాంక్షలు.
మహమ్మద్ ఫజుల్ రహమాన్
90102 23917
- Tags
- antarangam