- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మర్యాదలను' బద్దలు కొట్టిన ‘హస్పెండ్ స్టిచ్’
‘‘ఏమిటీ అత్యాచారాల పర్వం! పాల వాసన కూడా మరువని మూడేళ్ల పసిపిల్లల్ని కూడా వదలని పైశాచిక కాముకత్వం! రెండు కాళ్ల మధ్య రక్తస్రావంతో, గాయంతో, నొప్పితో విలవిల్లాడే పసికూనల బాధ వాళ్లకు పట్టదా! రక్తస్రావంతో చనిపోయిన పిల్లలు ఎంతమందో! ఉచ్చపోయడానికి పనికొచ్చే భాగంగా మాత్రమే తెలిసిన తన మర్మాంగంపై జరిగే హింస వాళ్ల నెంత భయభ్రాంతులను చేస్తుందో కదా! అది జీవితాంతం వెంటాడుతూ..జీవితాన్ని నాశనం చేస్తుంటే..’’ ‘ప్రశ్న’ కథలో ఇలా ప్రశ్నల వర్షంతో సాగే స్వరూప అంతర్మథనం ఇది. పేపర్‌లో ఇలాంటి వార్తలను చూసి నిట్టూర్చి వదిలేసే సంఘటనలు కావివి.
‘మార్ ఔర్ మార్..మార్ దేవ్..హైనాకో..’ నిద్రపోతున్న పద్నాలుగేళ్ళ పసిబిడ్డైన కూతురి కాళ్లు పట్టుకుని వంటింట్లోకి లాక్కుపోతున్న భర్త ఖాద్రీ పై సివంగిలా విరుచుకుపడిన ఆ బాలిక తల్లి ఖుర్షీదా బేగం అరుపులు వింటే మనం కూడా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. పదిహేడేళ్ళ కన్న కూతురు అస్రాపై ఏళ్ల తరబడి అత్యాచారం చేస్తున్న ఖాద్రీని పోలీసులకు పట్టించడం చట్టపరిధిలో ఒక చర్య. బెయిల్ పై వచ్చిన ఖాద్రీ మళ్ళీ కూతురిపై అత్యాచారం చేయబోతుంటే ఏం చేయగలుగుతుంది ఆ తల్లి! కూతుళ్లతో కలిసి రోకలిబండతో భర్తను కొట్టి చంపుతుంది. ‘రాయి’(స్టోన్) కథ అలా ముగుస్తుంది. కానీ అనివార్యమైన ఈ అప్రయత్న చర్యలు ‘మర్యాదరామన్న’ల దృష్టిలో ప్రతీకారాలు, అటవిక చర్యలు !
గీతాంజలి రాసిన ‘హస్బెండ్ స్టిచ్’ కథలు, వాటి ఇంగ్లీషు అనువాదం ‘ద రాక్ దట్ వాజ్ నాట్’ చదువుతుంటే కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టల ముసుగులో ఎన్ని విషాదాలను ఎంత కాలంగా ఈ సమాజం దాచి, భరిస్తోందో కదా ! అర్థం లేని ఆ మర్యాదలను, పరువు ప్రతిష్టలను గీతాంజలి తన పెన్ గన్‌తో ఒక్కసారిగా బద్దలు కొట్టారు. గీతాంజలి రచనాశైలి వాస్తవ సంఘటనలతో నదీ ప్రవాహంలా సాగుతుంది. ప్రొ. కె.సునీతా రాణి చేసిన ఇంగ్లీషు అనువాదం కూడా అంతే సరళంగా, అంతే వేగంగా సాగుతోంది. ఒక్కో కథ మనం చూడని, మనం ఊహించని అనేక మానని గాయాలను చూపుతుంది.
‘నాన్న చాలా క్రూరుడు. రాత్రి అయ్యిందంటే అమ్మ గుండె చప్పుడు రెట్టింపయ్యేది. అమ్మ బాధతో విలవిల్లాడేది. కాళ్లుపట్టుకుని ప్రార్థించేది. నాన్న వినేవాడు కాదు. సిగరెట్టుతో అమ్మ బుగ్గల మీద, పెదాల మీద, చన్నుల మీద, నడుం మీద వాతలు పెట్టేవాడు. అమ్మ రక్తసిక్తమైన దిక్కులేని పావురంలా రోదించేది. ఆరోజు అమ్మకు వాత పెట్టింది జననాంగాల మీద ! అవును సిగరెట్టు వాతలు పెట్టాడు! నాన్న రోజూ అమ్మ మీద అత్యాచారం చేస్తాడు! అమ్మ కన్నీళ్ళకు, అత్యాచారాలకు గురవుతున్న సమస్త స్త్రీ జాతి కన్నీళ్ళకు ప్రతీకారం తీర్చుకోవాలి.’ ఖడ్గ చాలనం (ద స్విష్ ఆఫ్ ద సోర్డ్) కథ సారాంశమంతా తల్లి కడుపులో ఉన్న ఆడ శిశువు పడుతున్న ఆవేదన, ఆక్రోశం. ఇలాంటి మగవాళ్లపైన ప్రతీకారంగానేమో ఆ శిశువు జననాంగాలు లేకుండా పుడుతుంది! కడుపులో శిశువు ఇలా ఆలోచించడం కాల్పనికత అయినా, ఈ హింసలు మాత్రం పచ్చి నిజాలు.
‘నీకు అర్థం కాదు. నాది వదులైపోయిందని అంటున్నాడు. కుట్లు వేయించుకుని బిగుతుగా చేయించుకుందామని’ అంటుంది సుశీల.‘ఏంటి ఇలాంటి ఆపరేషన్లు కూడా ఉన్నాయా’ అని నిర్ఘాంత పోతుంది సృజన. ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం ఉండదు. ఆస్పత్రిలో సుశీలకు పక్షవాతం వచ్చి కుడి చేయి పడిపోతుంది. ఇది హస్బెండ్ స్టిచ్(ద హస్బెండ్ స్టిచ్) కథ సారాంశం.
ఆర్టిస్టైన నగేష్ తాగుడుకు బానిసై, ఇంట్లోనే పరాయి స్త్రీలతో గడుపుతాడు. కూతురికి బాయ్ ఫ్రెండ్స్.. గర్భస్రావం.. కొడుకు జేబులో కండోమ్స్. ఈ స్థితిలో కుటుంబంలో ప్రేమంటే ఏమిటో తెలియకుండా బతుకుతున్న రుద్ర మధుతో ప్రేమలో పడుతుంది. ఇది భర్తకు, పిల్లలకు తెలిసి ఆమెకు నింఫొమేనియా (మనో లైంగిక వ్యాధి) అని ఆరోపిస్తారు. ‘ఈ మగ నాయాళ్లు ఏం చేసినా చెల్లుతుంది. మన ఆడోళ్లే..ఎప్పుడన్నా కిసుక్కున నవ్వినా లంజలైపోతాం..’ అని రుద్రతో అంటుంది పనిమనిషి అలివేలు. నిజానికి నగేష్‌కే నింఫొమేనియా అని మనో వైద్యులు తేల్చి, అతనికి చికిత్స చేస్తారు. ‘ప్రపంచంలో ఏ పని చేసినా పట్టుబడకుండా తప్పించుకోవచ్చు. కానీ, ప్రేమలో పడ్డ విషయం బయటపడకుండా ఏ మానవ మాత్రుడు తప్పించుకోలేడు’ అన్న అందమైన గాలిబ్ కవితతో కథ ముగుస్తుంది. ఇది చలం రచనలను పోలిన ఒక ప్రేమ కావ్యంలా సాగుతుంది.
శిలకాని శిల(ద రాక్ దట్ వాజ్ నాట్) కథలో దేహ సౌష్టవమే స్త్రీ అనుకునే భర్త చేతిలో హింసను అనుభవించి ప్రతిమ రొమ్ము పెద్దదిగా కనిపించడానికి సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటుంది. ఫలితంగా రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ కాక, సికలికాన్‌ను తీసేయించుకోవడానికి సిద్ధమవడంతో కథ ముగుస్తుంది. వాస్తవాలు ఆశాజనకంగా లేవు.
చిన్నతనంలో బాబాయ్ చేతిలో అత్యాచారానికి గురైన కస్తూరి ఆత్మ కథే ఫ్రిజ్ డ్(ఫ్రిజ్ డ్). ‘‘శృంగార మంటే స్త్రీ పురుషుల జననాంగాల మధ్య జరిగే రాపిడి మాత్రమే కాదు, దంపతులు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, స్పర్శతో వ్యక్తపరుచుకునే అందమైన భాష. అతనిలో శృంగార మరిమళాలంటే తన నోటి దుర్గంధమో, విస్కీ సిగరెట్ వాసనల సమ్మిళితమో. మృగ వాంఛే తప్ప మృదు స్పర్శ లేని వాడు’ ఈ కథలో అడుగడుగునా స్త్రీల మానసిక క్షోభ వ్యక్తమవుతుంది.
అన్నిటి కంటే ఆశ్చర్య పరిచే కథ ‘నా భర్తే నన్ను రేప్ చేశాడు’(మై హస్బెండ్ రేప్డ్ మి). పదహారేళ్ల బాలిక సాత్వికను బలవంతంగా కాపురం చేయమని భర్త కొడతాడు. వేడుకున్నా ఆపడు. ‘ఇంకెన్ని రోజులు సతాయిస్తవే నా కొడుకుని’ అంటుంది అత్త. ‘మా ఆడబిడ్డ నా చేతులు వంచి పట్టుకుంది. మా అత్త నా కాళ్ళు పట్టుకుంది. నా మొగుడు నా నోట్లో గుడ్డలు కుక్కి నాపైన జంతువు తీర్గ పడ్డడు’ అని ఆస్పత్రిలో డాక్టర్‌కు చెపుతుంది సాత్విక. రక్తం ధారలు కడుతుంది. ఈ కథ చదువుతుంటే ఇలా కూడా జరుగుతాయా! అనిపిస్తుంది.
ఇన్ని విషాద సంఘటనలను చెప్పిన గీతాంజలి ముద్దు(ద కిస్) కథలో ప్రేమతో పెట్టే ముద్దు గురించి రష్యన్ కవయిత్రి మెరీనా త్సేతేవా రాసిన కవితను గుర్తు చేస్తారు. ‘నుదుటిపైన పెట్టే ముద్దు దుఖాన్ని పోగొడుతుంది. కళ్లపైన పెట్టే ముద్దు నిద్ర పుచ్చుతుంది. పెదవులపైన పెట్టే ముద్దు దాహార్తిని తీరుస్తుంది. ప్రియా నీ నుదిటిని మళ్ళీ ముద్దాడనీ’ మెరీనా ఎంత గొప్పగా రాసింది!
ఇవ్వన్నీ స్త్రీల లైంగిక వైవిధ్య వెతలు. ఈ వెతలన్నీ అందరికీ తెలియకపోవచ్చు. తెలిసినా తెలియనట్టు ఉండిపోతారు. వీటిని చదవడానికే ‘మర్యాదస్తులు’ బిడియ పడతారు. గీతాంజలి హైదరాబాదులో మానసిక వైద్యురాలు. తన దగ్గరకు వచ్చే మహిళల వాస్తవ వెతల నుంచే ఈ కథలను రాశారు. చలం సాహిత్యానికి ఒక శాస్త్రీయతను జోడించి, అభివృద్ధి చేసిన సాహిత్యమే గీతాంజలి కథలనడం అతిశయోక్తి కాదేమో!
ప్రతులకు
డా. భారతి
88977 91964
హజ్బెండ్ స్టిచ్ (Husbend stitch)
పేజీలు - 208
వెల - రూ. 200
ఆంగ్లంలో
The rock that was not
పేజీలు : 181
వెల : రూ. 349
సమీక్షకులు
రాఘవశర్మ
94932 26180