కథా- సంవేదన:తండ్రీ -కొడుకు

by Ravi |
కథా- సంవేదన:తండ్రీ -కొడుకు
X

'నాకు బైక్ కావాలి' అన్నాడు కొడుకు. 'బైక్ వద్దు. కావాలంటే కారు తీసుకుని వెళ్లు' 'మరి మీకు?' 'నాకు ఆఫీస్ కార్ వస్తుందిగా' కొడుక్కి కారు ఇష్టం లేదు. స్నేహితులందరూ బైకుల్లోనే వస్తారు. కారు అసౌకర్యం కూడా. చిన్న చిన్న సందుల్లోకి వెళ్లడం కష్టం. అదే విషయం తండ్రికి చెప్పాడు. తండ్రి వినిపించుకోలేదు. 'కారు కష్టం డాడీ. బైక్ బెటర్' అన్నాడు మళ్లీ కొడుకు. తండ్రి ఎలాంటి జవాబు చెప్పలేదు. కొడుకు రెట్టించలేకపోయాడు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ బైక్ ప్రస్తావన వస్తావని తండ్రి దగ్గర తీసుకొని వచ్చాడు కొడుకు.తండ్రి ఏమీ మాట్లాడలేదు.

'నానమ్మ డబ్బులు ఇస్తానని అంటుంది కదా? బైక్ కొనడానికి. కొంటే ఏమవుతుంది' ఈ సారి కాస్త గట్టిగా అడిగాడు తండ్రిని కొడుకు. తండ్రి దగ్గర జవాబు ఉంది. కానీ, అతను జవాబు చెప్పలేదు. 'కారు తీసుకొని వెళ్లు' అన్నాడు చివరికి. 'ఈ వయసులో నడపాల్సింది బైకు నాన్నా!' కారులో చిన్న చిన్న సందుల్లో తిరగలేను. కష్టం. అసౌకర్యం కూడా' అన్నాడు కొడుకు. తండ్రి ఏమీ మాట్లాడలేదు. కొడుకు ముభావంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అలా మరో వారం రోజులు గడిచాయి. ఆ తర్వాత మళ్లీ బైక్ ప్రస్తావన తీసుకొని వచ్చాడు కొడుకు. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ. 'నాకు బైక్ అవసరం ఉంది డాడీ' అన్నాడు. అప్పటికీ అమ్మతో తన బైక్ అవసరం గురించి చెప్పాడు. కారు ఎంత అసౌకర్యమో కూడా వివరించాడు. 'వాడికి బైక్ అవసరం ఉందండి. రోజూ బస్సులో వెళ్లడం కష్టం. వాడి గోల్ చేరుకోవాలంటే-వాడికి చాలా టైం ఉండాలి. కారు వాడికి అసౌకర్యం. బైక్ కొందాం' అంది మెల్లిగా భర్తతో, కన్విన్సింగ్ ధోరణిలో. వాడికి బైక్ అవసరం ఉందన్న సంగతి తండ్రికి తెలుసు. కానీ, యువకులు ఎంత స్పీడ్‌గా బైకులు నడుపుతున్నారో అతను రోజూ చూస్తున్నాడు. నష్టపరిహారం కోసం కోర్టుకి వస్తున్న కేసులలో అవే ఎక్కువ. అదీ ఆయన భయం. ఆందోళన.

'యూఎస్‌కి వెళ్లాలన్నది వాడి ఆశయం. అందుకు పనులు చాలానే ఉంటాయి. వాడికి బైక్ అవసరమే. కావలసిన పరీక్షలు రాసుకోవడానికి, కావల్సిన ప్రదేశాలు తిరగడానికి. బైక్ ఉంటే వాడికి సౌకర్యంగా ఉంటుంది' వాడి బైక్ గురించి మరోసారి గట్టిగా అడిగింది భర్తని ఆ కుర్రవాడి తల్లి. ఒక్క నిమిషం ఆలోచించి 'సరే' అన్నాడు తండ్రి. ఖరీదైన బండి కొందామని కొడుకు ప్రతిపాదించాడు. తండ్రి ఒప్పుకోలేదు. మధ్యేమార్గంగా అపాచీ కొన్నారు. ఏదో ఒక బండి కొన్నారని కొంత సంతృప్తి చెందాడు కొడుకు . అది ఎక్కువ స్పీడ్ పోదని తండ్రి అనుకున్నాడు. అది కూడా బాగా స్పీడ్ పోతుందని కొడుక్కి తెలుసు.

కాలచక్రం గిర్రున తిరిగింది. కొడుకు అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసాడు. యూఎస్‌లో పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. ఓ సంవత్సరం తరువాత ఓ పెద్ద ఇల్లు కొన్నాడు. ఆ తరువాత అమ్మని, నాన్నని అమెరికా తీసుకొని వెళ్ళాడు. తన బీఎండబ్ల్యూ కారులో చాలా నగరాలను చూపించాడు. ఓ మూడు మాసాల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు అతని తల్లిదండ్రులు. ఇండియాకి వచ్చే ముందే పెద్ద కారు కొనమని తండ్రికి చెప్పాడు కొడుకు. తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా పెద్ద కారు కొనమని వీడియో కాల్‌లో చాలాసార్లు చెప్పాడు కొడుకు. తండ్రి వినలేదు. 'నేను బీఎండబ్ల్యూ కార్లో తిరుగుతూ మీరు మామూలు కారులో తిరగడం బాగా లేదు' అన్నాడు ఒకసారి.

చివరికి తండ్రి అకౌంట్లో ఓ నలుభై లక్షలు డిపాజిట్ చేశాడు కొడుకు. అయినా ఖరీదైన కారు తండ్రి కొనలేదు. ఆ డబ్బులు అలానే ఉండిపోయాయి. కొంతకాలం తర్వాత డిపాజిట్‌గా మారిపోయాయి. ఓ సంవత్సరం తర్వాత కొడుకు ఇండియాకు వచ్చాడు ఖరీదైన కారు కొందామని బలవంతపెట్టాడు. 'ససేమిరా' అన్నాడు తండ్రి. బీఎండబ్ల్యూ కారు కొనడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అతను. చివరికి మధ్యేమార్గంగా 25 లక్షలు పెట్టి ఓ కారు కొన్నారు. అదైనా తండ్రి కొన్నందుకు సంతోషపడ్డాడు కొడుకు.

డబ్బులు ఉండీ తనకు ఖరీదైన టూవీలర్ కొనివ్వ లేదు. ఖరీదైన కారు కొందామని అంటే వినలేదు. తను కొంటానని అంటే కూడా వద్దన్నారు. ఆలోచించాడు కొడుకు. అతనికి ఏమీ అర్ధం కాలేదు. 'నాన్నా ఇలా ఎందుకని' తల్లిని అడిగాడు కొడుకు. తల్లి నవ్వింది. 'నీ మీద ప్రేమే రెండింటికి కారణం. అంతే నీది కూడా అదేరా' అంది అమ్మ.


-మంగారి రాజేందర్ జింబో

94404 83001

Advertisement

Next Story

Most Viewed