సిండి‘కేటు’గాళ్లు.. అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే..?

by Shyam |
సిండి‘కేటు’గాళ్లు.. అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే..?
X

దిశ, కోదాడ: మద్యం సిండికేట్ నుంచి వచ్చామంటూ కిరాణ షాపులో మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినా ఘటనలు కోదాడ నియోజకవర్గంలో వరుసగా చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ గ్రామంలో నలుగురు వ్యక్తులు బైక్‌‌పై వచ్చి హటాహుటిన దుకాణంలో ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారని సదరు వ్యక్తిని దుకాణదారులు ప్రశ్నించగా తాము కోదాడ మద్యం సిండికేట్ నుంచి వచ్చామని, తమ వద్ద కొనుగోలు చేయని మద్యం బాటిల్ తీసుకుపోతున్నామని చెప్పారు. దీంతో సదరు దుకాణం యజమాని వాగ్వాదానికి దిగడంతో మద్యం సీసాలను అక్కడే వాదిలేసి పారిపోయినట్టు పేర్కొన్నారు. మరో ఘటనలో ఇటీవల ఓ కిరాణం షాపులో సోదాలు నిర్వహించి రూ 15వేల విలువైన మద్యం సీసాలను తీసుకుపోయారు.

సిండికేట్ వ్యాపారం గత కొన్ని రోజులుగా బంద్ చేసి మళ్లీ మొదలు పెట్టడంతో బెల్ట్ దుకాణదారులలో పండుగ వాతావరణం నెలకొంది. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎంఆర్‌పీ ధరలకు మించి బెల్టుదుకాణాలకు విక్రయాలు జరపటం ద్వారా లక్షల రూపాయల్ని కొల్లగొడుతున్నారు. మద్యం బాటిల్‌పై రూ.15 నుంచి 20 రూపాయలకు పైగా బెల్టు దుకాణాలకు అమ్ముతున్నారు. చివరి వరకు రూ.40 అధిక మొత్తంతో మద్యం బాటిల్ మందుబాబులకు చేరుతున్నది.

ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలు?

గ్రామాలలో నిర్వహిస్తున్న పలు సమీక్షా సమావేశాల్లో మద్యం సిండికేట్ వ్యవహారం విషయంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ విషయాన్ని కొంత మంది నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల దృష్టిలో బద్‌నాం అవుతున్నామని గ్రహించిన ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సిండికేట్ వ్యాపారాన్ని ఆపించినట్లు సమాచారం. కానీ కొద్ది రోజులకే మళ్లీ వ్యాపారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మరింత విచ్చలవిడిగా బెల్టు షాపులు తెరిచి విక్రయాలు జరుపుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన పోలీసులు, ఎక్సైజ్‌అధికారులు మాముళ్లమత్తుల్లోమునిగితేలుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..

సమయపాలన అనుసరించి, ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలనే ప్రభుత్వం ఆదేశాలను కొందరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అనధికారికంగా బెల్టుషాపులకు మద్య విక్రయిస్తే దుకాణం లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్‌శాఖ చేసిన హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ముందు వైన్స్ వెనక సిండికేట్ వ్యాపారం వెరసి మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా సాగుతోంది. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలని ఉంది.

Advertisement

Next Story

Most Viewed