BIG News: మేడిగడ్డపై సర్కార్ తర్జనభర్జన.. NDSA రిపోర్టుపై కేంద్రం నో రిప్లై

by Shiva |
BIG News: మేడిగడ్డపై సర్కార్ తర్జనభర్జన.. NDSA రిపోర్టుపై కేంద్రం నో రిప్లై
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. దాంతో అప్పటి నుంచి అక్కడ నీటి నిల్వ చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ 2023, అక్టోబర్ 21న కుంగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ విచారణకు ఆదేశించింది. దీనిపై ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) విచారణ చేపట్టింది. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సైతం ఎంక్వయిరీ చేసిన తన తుది నివేదిక ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి సమర్పించింది. ఎన్‌డీఎస్ఏ తన మధ్యంతర నివేదిక కేంద్రానికి అందజేసింది. కానీ ఆ నివేదిక అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు.

ఫిబ్రవరిలోనే రిపోర్టు

మేడిగడ్డ బ్యారేజీ సేఫ్టీ నేపథ్యంలో అందులో నీటిని నిల్వ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌డీఎస్‌ఏ ఆదేశించింది. అంతేకాకుండా.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారణాలు.. తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఫిబ్రవరిలోనే రిపోర్టను సైతం తయారు చేసింది. దానిని కేంద్ర ప్రభుత్వానికి అందించింది. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. దాంతో మేడిగడ్డపై ఏం చేయాలో తెలియక అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రిపోర్టు త్వరగా ఇవ్వాలని ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్రం మాత్రం ఆ రిపోర్టును ఇంకా ఇవ్వకపోవడంపై పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రిపోర్టు వచ్చే వరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ఫలితంగా మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. ప్రభుత్వం మేడిగడ్డలో ప్రత్యామ్నాయంగా జియో బ్యాగ్‌లను ఏర్పాటు చేసి నీళ్లను లిఫ్ట్ చేయాలనుకుంది. ఈ విషయాన్ని ఎన్‌డీఎస్‌ఏకు తెలిపినా అక్కడి పెద్దగా స్పందన లేకుండా పోయింది.

లోతుగా పరిశీలిస్తున్న కేంద్ర జలశక్తి శాఖ

మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో టెస్టులు చేయకుండానే బ్యారేజీపై ఎన్‌డీఎస్ఏ రిపోర్టును అందించిందని సమాచారం. దాంతో కేంద్రం సైతం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. రిపోర్టును పెండింగులో పెట్టినట్టు తెలుస్తున్నది. అందుకే.. ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టుపై లోతుగా స్టడీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌ ఒపీనియన్ సైతం తీసుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు ఇదే అంశంపై ఈనెల 30న తెలంగాణ అధికారులతో ఎన్‌డీఎస్ఏ అధికారులు భేటీ కాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా ఎలా ముందుకెళ్లాలో పలు సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ముంచుకొస్తున్న వర్షాకాలం

మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే గత సీజన్‌లో నీరంతా వృథా అయింది. ఈ వర్షాకాలంలోపు అయినా బ్యారేజీకి మరమ్మతు చేయకుంటే మరింత దారుణ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంది. మరమ్మతు పనులు ఇప్పటికిప్పుడు ప్రారంభించినా ఎన్ని నెలల సమయం పడుతుందో సైతం తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్‌డీఎస్ఏ మీటింగులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆసక్తి నెలకొంది. మరోవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు సైతం పలు ప్రత్యామ్నాయ చర్యలపై ఎన్‌డీఎస్ఏ అధికారులతో చర్చించబోతున్నారని సమాచారం.



Next Story

Most Viewed